భారజల కర్మాగారంలో మరో కలికితురాయి

ABN , First Publish Date - 2022-01-19T05:04:10+05:30 IST

భారజల కర్మాగారంలో మరో కలికితురాయి

భారజల కర్మాగారంలో మరో కలికితురాయి
మణుగూరు హెవీవాటర్‌ప్లాంట్‌

దేశంలోనే ప్రథమంగా ఓ-18 ప్లాంట్‌ ప్రారంభం

26న జాతికి అంకితమివ్వనున్న ప్రధాని మోదీ

అశ్వాపురం జనవరి 18: ప్రతిష్ఠాత్మక మణుగూరు భారజల కర్మాగారం మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే ప్రథమంగా జీవరసాయన చర్యలకు వినియోగించే హెచ్‌టూఓ-18 ప్లాంట్‌ భారత అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ ప్రారంభమైంది. డీఏఈ చైర్మన్‌ కె.ఎన్‌ వ్యాస్‌ వర్చువల్‌ విధానంలో ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు. రిపభ్లిక్‌ డే సందర్భంగా 26న ప్రధాని మోదీ ఈ ప్లాంట్‌ను జాతికి అంకితమివ్వనున్నారు. ఇప్పటి వరకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద భారజల కర్మాగారంగా పేరుపొందిన మణుగూరు భారజల కర్మాగారం ఓ-18 ఉత్పత్తితో దేశానికే తలమానికంగా నిలిచింది. భారజల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన ఈ కర్మాగారం ఇప్పటికే క్యాప్టివ్‌ పవర్‌ప్లాంట్‌, ఆక్సీజన్‌, బోరాన్‌, సోలార్‌ ప్లాంట్ల వంటివి ఏర్పాటు చేసుకుని భారత అణుశక్తి విభాగంలో ప్రధాన భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ-18 ప్లాంట్‌ ప్రారంభంతో మరో మైలురాయిని చేరుకుంది. ఈ హెవీవాటర్‌ ప్లాంట్‌ అన్ని రంగాల్లో విజయవంతం కావటంతో డీఏఈ(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆటోమిక్‌ ఎనర్జీ) ఈ కర్మాగారాన్ని ఓ-18 ఉత్పత్తికి ఎంచుకుంది. కాగా మణుగూరు ఓ-18 ప్లాంట్‌లో సంవత్సరానికి 10కేజీల ఓ-18 ఉత్పత్తి కానుంది. ప్రారంభ కార్యక్రమంలో బార్క్‌ డైరెక్టర్‌ మహంతి, హెవీవాటర్‌బోర్డు అసోసియేట్‌ డైరెక్టర్‌ జీవీఎస్‌. ప్రసాద్‌, మణుగూరు భారజల కర్మాగార జీఎం సతీష్‌, డీజీఎంలు సుధాకర్‌, ఉపాధ్యాయ, వెంకటేష్‌, సీఏవో కాంబ్లి ప్లాంట్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రూ.53కోట్లతో నిర్మాణం

భారత అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో మణుగూరు భారజల కర్మాగారంలో హెచ్‌2ఓ-18 ప్లాంట్‌ ఏర్పాటుకు 2016లోనే రూ.53కోట్లతో శ్రీకారం చుట్టారు. అన్ని సాంకేతిక, మౌళిక వసతుల కల్పన పూర్తికావడంతో మంగళవారం ప్లాంట్‌ ప్రారంభమైంది. హెచ్‌2ఓ-18 ఐసోటోప్‌ వైద్యరంగంలో వినూత్న మార్పులకు మూలం కానుంది. దీనిని ఉపయోగించి జీవరసాయన చర్యల్లో భాగంగా జరిగే ట్యూమర్లు, క్యాన్సర్‌కారకాలు, డైమెన్షియల్‌ వ్యాధులను ఖచ్చితంగా నిర్ధారించనున్నారు. దీంతో ప్రపంచ దేశాల్లో ఓ-18కు అత్యంత ప్రాముఖ్యం లభించింది. ఇప్పటివరకు దీనిని అమెరికా, చైనా వంటి దేశాలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. కాగా నీటిలో సాధారణంగా 0.204శాతం ఉండే ఆక్సిజన్‌ను 95శాతం వృద్ధి చేయటం ద్వారా హెచ్‌2ఓ-18 లభించనుంది.

Updated Date - 2022-01-19T05:04:10+05:30 IST