అప్పు కోసం మరో కార్పొరేషన్‌

ABN , First Publish Date - 2021-01-09T08:09:28+05:30 IST

అప్పుల కోసం మరో కార్పొరేషన్‌ ఏర్పాటైంది. ‘ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ కార్పొరేషన్‌’ పేరిట సర్కారు మరో సంస్థను ఏర్పాటు చేసింది.

అప్పు కోసం మరో కార్పొరేషన్‌

  • మెడికల్‌ కాలేజీల భూములు తాకట్టు
  • ఏపీ మెడికల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు
  • 16 కొత్త కాలేజీలు, ‘నాడు-నేడు’కు 
  • రూ.12 వేల కోట్లు సమీకరణ
  • అప్పు ఇచ్చేదుకు బ్యాంకులు నో
  • అందుకే మరో కార్పొరేషన్‌ తెరపైకి
  • 108 ఎకరాలు తాకట్టు పెట్టి రుణం
  • ఆర్డినెన్సు జారీ చేసిన రాష్ట్ర గవర్నర్‌

ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ కార్పొరేషన్‌! పేరును బట్టి ఈ కార్పొరేషన్‌ వైద్య విద్యాభివృద్ధి కోసమో, పరిశోధనల కోసమో ఏర్పాటు చేసిందని భావిస్తే తప్పులో కాలేసినట్టే! కేవలం అప్పులు తెచ్చుకోవడం కోసమే దీనిని ఏర్పాటుచేస్తున్నారు. కొత్త మెడికల్‌ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో ‘నాడు - నేడు’ పథకం పేరుతో వేల కోట్ల రుణాలను ఈ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం సమీకరించుకోనుంది. 


అమరావతి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి):  అప్పుల కోసం మరో కార్పొరేషన్‌ ఏర్పాటైంది. ‘ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ కార్పొరేషన్‌’ పేరిట సర్కారు మరో సంస్థను ఏర్పాటు చేసింది. దీనిపై శుక్రవారం గవర్నర్‌ ఆర్డినెన్సు జారీ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన 108 ఎకరాలను ఈ కార్పొరేషన్‌కు అప్పగించి... ఈ భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి దాదాపు రూ.12 వేల కోట్లు రుణం పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసున్నట్లు తెలుస్తోంది. ఇందులో రూ.3200 కోట్లను ‘నాడు - నేడు’ కోసం ఖర్చు చేస్తారు. మిగిలిన రూ.8800 కోట్లను 16 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం కోసం ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పు కోసం ఆరు నెలల నుంచి ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ అధికారులు  బ్యాంకుల చుట్టూ  తిరుగుతున్నారు. కానీ ఒక్క బ్యాంకు కూడా ప్రభుత్వానికి రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, మెడికల్‌ కాలేజీల భూముల తాకట్టు ద్వారా రుణాలు పొందాలని నిర్ణయించింది.  ఈ మొత్తం 16 కొత్త కాలేజీలతోపాటు ప్రస్తుతం ఉన్న 11 మెడికల్‌ కాలేజీల్లో నాడు - నేడు కింద అభివృద్ధి పనులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాడు - నేడులో మేజర్‌గా విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్‌ కాలేజీ, కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజీ, కర్నూలులోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, తిరుపతిలోని స్విమ్స్‌లో ఓపీ, ఐపీ బ్లాక్‌లను తొలగించి, వాటి స్థానంలో పది అంతస్తుల భవనాలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. 


పదేపదే మార్చేస్తూ..

ప్రభుత్వం నాడు - నేడులో ఎప్పటికప్పుడు ప్రతిపాదనలను మార్చేస్తోంది. తొలుత రూ.16 వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అవి అందితే నాడు - నేడుకు రూ.8 వేల కోట్లు, కొత్త కాలేజీలకు రూ.8 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. కానీ బ్యాంకులు ముందుకు రాకపోవడంతో నాడు - నేడు ప్రతిపాదనలను రూ.ఐదు వేల కోట్లుకు తగ్గించింది. కొత్త ప్రతిపాదనలకు ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో ఇప్పుడు రూ.3200 కోట్లుకు ఆరోగ్యశాఖ మూడోసారి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో అధికారంలోకి వచ్చాము... ఏదో ఒకటి చేయాలన్న తపన తప్ప ప్రభుత్వంలో ఎక్కడా నిబద్ధత కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు రాకపోతే.. ప్రభుత్వం తన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చుకదా అనే సూచనలు వస్తున్నాయి.


108 ఎకరాలు తాకట్టు...

ప్రభుత్వం కోరిన విధంగా రుణాలు ఇచ్చేందుకు కొన్ని బ్యాంకులు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం సర్కారుకు రూ. 12వేల కోట్ల అప్పు కావాలి. అంతే మొత్తానికి గ్యారంటీ చూపితే అడిగిన రుణం ఇస్తామని ఆ బ్యాంకులు తేల్చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి దిక్కుతోచక.. తిరిగి అభివృద్ధి చేయాలనుకునే భూములను గ్యారంటీగా పెడుతోంది. ప్రతి కాలేజీలో నాలుగు ఎకరాల చొప్పున బ్యాంకులకు తాకట్టు పెడుతోంది. ప్రస్తుతం ఉన్న 11 మెడికల్‌ కాలేజీలు, కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌ కాలేజీలు కలిపి మొత్తంగా 27 మెడికల్‌ కాలేజీల భూములు ఇలా తాకట్టులోకి వెళ్లిపోతున్నాయి. ప్రతి కాలేజీలో నాలుగు ఎకరాల చొప్పున మొత్తం 108ఎకరాలను తాకట్టు పెడుతున్నారు. మరోవైపు గ్యారంటీగా చూపే స్థలాలు ప్రైమ్‌ ఏరియాలో ఉం డాలని కొన్ని బ్యాంకులు షరతు పెడుతున్నాయి.

Updated Date - 2021-01-09T08:09:28+05:30 IST