మార్చిలో మళ్ళీ చైనాతో బాహాబాహీ... సిద్ధమవుతున్న భారత సైన్యం...

ABN , First Publish Date - 2021-01-19T20:10:11+05:30 IST

గత ఏడాది భారత సైన్యం చేతిలో దెబ్బతిన్న చైనా మరోసారి కాలు దువ్వేందుకు

మార్చిలో మళ్ళీ చైనాతో బాహాబాహీ... సిద్ధమవుతున్న భారత సైన్యం...

న్యూఢిల్లీ : గత ఏడాది భారత సైన్యం చేతిలో దెబ్బతిన్న చైనా మరోసారి కాలు దువ్వేందుకు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల సైన్యాలు ధృవపు మంచు చలిలో ప్రశాంతంగా కాలం గడుపుతున్నప్పటికీ, తమను దెబ్బకొట్టిన భారత సైన్యానికి బుద్ధి చెప్పాలని చైనా ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు. చైనా మీడియా కథనాల్లో కూడా దీనికి సంబంధించిన హెచ్చరికలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు చైనా కమ్యూనిస్టు పార్టీ పరిపాలన 100వ వార్షికోత్సవాల్లో దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రసంగం కూడా చాలా ముఖ్యమైనదని చెప్తున్నారు. 


మన దేశ భద్రత నిపుణుల అంచనా ప్రకారం ఈ ఏడాది మార్చి నుంచి మంచు కరగడం ప్రారంభమవుతుంది, అప్పటి నుంచి చైనా సైన్యం కార్యకలాపాలు ఊపందుకుంటాయి. గత ఏడాది మే నెల నుంచి ఇరు దేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన కొనసాగుతున్న దశలో చైనా సైన్యం ఇప్పటికీ వివాదాస్పద ప్రాంతాల్లోనే తిష్ఠ వేసుకుని కూర్చుంది. ఈ ప్రతిష్టంభనను చైనా బాగా వినియోగించుకుంటోంది. తియాన్‌వెండియన్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో అత్యాధునిక ల్యాండింగ్ గ్రౌండ్స్‌ను నిర్మిస్తోంది. సైన్యం ఉండేందుకు భారీ నిర్మాణాలను చేపట్టింది. హోటాన్ వైమానిక స్థావరం నుంచి కారకోరం కనుమ వరకు అనుసంధానం చేసింది. భారత సైన్యంలోని సీనియర్ కమాండర్ ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, డెప్సాంగ్ బల్జ్‌కు ఉత్తర దిశలో సైనిక ఘర్షణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 


భారత్-చైనా మధ్య ప్రస్తుత ప్రతిష్టంభనను తొలగించేందుకు తొమ్మిదో విడత చర్చలకు తేదీలు ఖరారు కాబోతున్నట్లు కొందరు భావిస్తున్నప్పటికీ, భారత ప్రభుత్వంలోని మరికొందరి అంచనా ప్రకారం, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ప్రస్తుత వివాద ప్రాంతాల నుంచి వైదొలగేందుకు ఇష్టపడటం లేదు. చైనా కమ్యూనిస్టు పార్టీ పరిపాలన వందేళ్ళ సంబరాల్లో దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రసంగించే వరకు ఈ ప్రతిష్టంభనను కొనసాగించాలని పీఎల్ఏ భావిస్తోంది. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న జో బైడెన్ పాలనా యంత్రాంగం చైనా పట్ల చూపే వైఖరినిబట్టి కూడా చైనా వ్యవహార శైలి ఉంటుంది. 


ఈ నేపథ్యంలో భారత సైన్యం తూర్పు లడఖ్‌లో సుదీర్ఘ కాలం కొనసాగాలని నిర్ణయించుకుంది. చైనాతో సరిహద్దులను కాపాడుకోవడానికి అమెరికాపై అతిగా ఆధారపడకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్వయం సమృద్ధ భారత దేశం పథకంలో భాగంగా దేశీయంగా యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలను అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. డ్రోన్లు, యుద్ధ విమానాలను దేశీయంగానే తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ భారం డీఆర్‌డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్), హెచ్ఏఎల్ (హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్)లపైనే ఉంది. అంతేకాకుండా ప్రైవేటు కంపెనీలను కూడా ఈ రంగంలోకి ఆహ్వానిస్తోంది.


భారత సైన్యానికి గుణపాఠం చెబుతామంటూ చైనా మీడియా తరచూ హెచ్చరిస్తోంది. అయితే భారత  సైన్యంతో పెట్టుకుంటే దెబ్బతినక తప్పదని అర్థమవడంతో, ఇతర మార్గాలను అనుసరించాలని పీఎల్ఏ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తనను తాను ప్రపంచ సూపర్ పవర్‌గా ఊహించుకుంటున్న సమయంలో భారత దేశంతో ఓడిపోతే చైనా  మరింత ఎక్కువ నష్టాన్ని మూట కట్టుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. 




Updated Date - 2021-01-19T20:10:11+05:30 IST