యూపీలో మరో ‘నిర్భయ’ బలి

ABN , First Publish Date - 2021-01-07T07:54:54+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో మరో నిర్భయ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. హథ్రాస్‌, బల్‌రామ్‌పూర్‌ సామూహిక అత్యాచారం, హత్య ఘటనలు మరువక

యూపీలో మరో ‘నిర్భయ’ బలి

  • 50 ఏళ్ల మహిళపై గ్యాంగ్‌రేప్‌, హత్య
  • ఆలయానికి వెళ్లిన ఆమెపై పూజారి,
  • అతని ఇద్దరు అనుచరుల ఘాతుకం
  • జననావయవంలో రాడ్డు చొప్పించి దారుణం
  • ఇద్దరి అరెస్టు, పరారీలో పూజారి
  • హైదరాబాద్‌ యువతిపై మూడు రోజుల పాటు అత్యాచారం
  • షార్జాలో సూడాన్‌ వ్యక్తి అఘాయిత్యం
  • తనను కాపాడాలని రోదిస్తూ వీడియో సందేశం

 

బదాయూ, జనవరి 6: ఉత్తరప్రదేశ్‌లో మరో నిర్భయ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. హథ్రాస్‌, బల్‌రామ్‌పూర్‌ సామూహిక అత్యాచారం, హత్య ఘటనలు మరువక ముందే తాజాగా బదాయూలో మరో దారుణం జరిగింది. బుధవారం ఈ ఘోరం వెలుగు చూసింది. 3న ఆలయానికి వెళ్లిన ఓ అంగన్‌వాడీ మహిళ (50) పై పూజారితో పాటు ఇద్దరు అనుచరులు సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. ఘోరాన్ని అడ్డుకోవడానికి యత్నించిన ఆమెను నిందితులు కాలు, పక్కటెముకలను విరగొట్టారు. ఆమె జననావయవంలో రాడ్డు జొప్పించి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు.


అనంతరం ఆ మహిళను హత్య చేసి, మృతదేహాన్ని అదేరోజు రాత్రి ఆమె ఇంటికి తీసుకెళ్లి అప్పగించారు. ఏమైందని ఆమె కుమారుడు ప్రశ్నించగా.. ఎండిపోయిన ఓ బావిలో పడి ఆమె చనిపోయిందని చెప్పి నిందితులు పరారయ్యారు. వారిపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తర్వాతి రోజు (సోమవారం) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను ఆలయ పూజారి, ఇద్దరు అనుచరులు అత్యాచారం చేసి చంపేశారని ఆరోపించారు. దీంతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి, అదేరోజు రాత్రి ఇద్దరు అనుచరులను అరెస్టు చేశారు. పూజారి పరారీలోనే ఉన్నాడు.




‘‘ఆ మహిళపై అత్యాచారం జరిగిందని శవపరీక్షలో తేలింది. దాంతోపాటు ఆమె జననావయవాలను నిందితులు గాయపర్చారు. పక్కటెముకలను, కాలును విరగొట్టారు. ఊపిరితిత్తులకూ గాయాలయ్యాయి. పూజారిని పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశాం. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై సామూహిక అత్యాచారం, హత్య కేసులను నమోదు చేశాం’’ అని బదాయూ సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ (ఎస్‌ఎస్పీ) సంకల్ప్‌ శర్మ తెలిపారు.


ఈ ఘటనపై యోగి సర్కారు దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. దోషులకు కఠిన శిక్షపడేలా చూస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హామీ ఇచ్చారు. జాతీయ మహిళా సంఘం కూడా ఈ ఘోరంపై కన్నెర్ర చేసింది. ఘటనపై దర్యాప్తునకు ఓ బృందాన్ని పంపనుంది. కాగా మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు గురించి ఉన్నతాధికారులకు తెలియజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఉఘైటీ పీఎస్‌ హౌజ్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేశారు. బాధితకుటుంబానికి ఎలాంటి సహాయమైనా చేస్తామని కలెక్టర్‌ కుమార్‌ప్రశాంత్‌ తెలిపారు. 


ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసిన విపక్షాలు


మరోవైపు ఈ ఘటనపై యోగి ఆదిత్యనాథ్‌ సర్కారును విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఇది 2012 నాటి నిర్భయ ఘటనను తలపిస్తోందని, మానవాళికి ఈ ఘటన సిగ్గుచేటని కాంగ్రెస్‌ పేర్కొంది. మహిళల భద్రతను పట్టించుకోకుండా యోగి ప్రభుత్వం నిద్రపోతోందని యూపీ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా గాంధీ ధ్వజమెత్తారు.


‘‘హథ్రాస్‌ ఘటన జరిగినపుడు బాధితుల గోడును ప్రభుత్వం వినలేదు. అప్పుడు అధికారులను రక్షించి బాధితుల గొంతు నొక్కేశారు. ఇపుడు బదాయూలోనూ స్టేషన్‌ అధికారి వారి గోడు పట్టించుకోలేదు. కనీసం ఘటన జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించలేదు’’ అని ప్రియాంక ట్వీట్‌ చేశారు.


‘‘ఇంకెంతమంది నిర్భయలు బలికావాలి? ఇంకా ఎన్నాళ్లీ ఘోరాలు? యోగి ప్రభుత్వం మేల్కొనదా?’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా ట్వీట్‌ చేశారు. హైకోర్టు సిటింగ్‌ జడ్జితో ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని కోరారు. నేరస్థులను కఠినంగా శిక్షించాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) డిమాండ్‌ చేసింది. ఈ ఘటన అత్యంత విషాదకరమని, ఖండనీయమని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (ఎస్పీ) అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. మళ్లీ ఇటువంటి ఘటనలు జరగకుండా దోషులను అత్యంత కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.


Updated Date - 2021-01-07T07:54:54+05:30 IST