Abn logo
Jun 10 2021 @ 00:21AM

మననుండే మరో నాయకుడు...!

తెలంగాణ రాష్ట్ర స‌మితికి, శాస‌న స‌భా ప్రాతినిధ్యానికీ రాజీనామా చేస్తున్న సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈటల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్యలు వాడిగా, వేడిగా మాత్ర‌మే కాదు అర్థవంతంగానూ ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు ప్ర‌జా రాజ‌కీయాలను ప్రేమించే బుద్ధి జీవుల అంచ‌నాల‌ను తాకుతూ భ‌విష్య‌త్తులో తెలంగాణ‌లో ప్ర‌జాస్వామిక పాల‌న‌ను ప‌రిపుష్టం చేసేవి. 


రాజవంశం, ఇష్టారాజ్యం శిక్ష‌లు, కొత్త దేవుడి రాజ్యం... వంటి ఆ మాట‌లన్నీ ముందే వినబడివుంటే, మరీముఖ్యంగా ఢిల్లీ ద‌ర్బార్‌కు పోక‌ముందే అయితే ఎంత బాగుండేదో? ఇప్పుడు ఏమ‌ని ఏమిలాభం? న‌ష్టాన్ని పూడ్చుకోవ‌డానికైనా ఆస్కారం ఉన్న‌దా? ఢిల్లీకి వెళ్ళి ఓన‌ర్ అయినావా? క్లీన‌ర్‌ అయినావా? అన్న స‌వాళ్ళ‌కు జ‌వాబు ఇవ్వ‌డం ఎట్లా? వేల‌ కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు విస్త‌రించినా, త‌మ పునాది కులాల ఆర్థిక, రాజ‌కీయ స్థితి నుండి ఎంత ఎదిగినా, ప్ర‌తిఘ‌టించ‌డంలో వెన్ను చూపిన ఈటల స్థితి తెలంగాణ‌లో ఉద్య‌మ‌కారుల భ‌విష్య‌త్తు కంటే, బ‌హుజ‌న రాజ‌కీయ శ‌క్తుల నైతిక స్థైర్యాన్ని ఎక్కువ‌ దెబ్బ‌తీసింది. అదే సమయంలో, కూడదీసుకోవ‌ల‌సిన ధైర్యం, వ్యూహం, ధ‌నం, జ‌నం, ఐక్య‌త, బేరీజు వేసుకోవ‌డానికి అవ‌కాశమూ ఇచ్చింది. 


వ‌ర‌వ‌ర‌రావును విడుద‌ల చేయ‌మ‌ని అడుగ‌లేని కేసీఆర్‌ ముచ్చ‌ట స‌రే, అనేక మంది వ‌ర‌వ‌ర‌రావుల‌ను అన్యాయంగా జైళ్ళలో ఉంచిన మోదీ, అమిత్‌షాలను మ‌నం రేపు అడ‌గాలి క‌దా! తెలంగాణ ఉద్య‌మంలో ఆర్ఎస్ఎస్ నుండి ఆర్‌ఎస్‌యు వరకూ పోషించిన పాత్ర గుర్తు చేయడం వెనుక తాను ఢిల్లీ పాల‌కుల‌కు ద‌గ్గ‌ర‌వ‌డంలో త‌ప్పేమీ లేద‌న్న సూచన ఉండవచ్చు. కాని, తెలంగాణ స్వ‌యం ప్ర‌తిప‌త్తిని, రాజ‌కీయ అస్తిత్వాన్ని, ఆర్థిక పురోగ‌తిని మోదీ స‌ర్కార్ అడ్డుకుంటున్న‌దని స‌గ‌టు పౌరుడు బ‌లంగా అనుకుంటున్నాడు. బిజెపి అయినా కేసీఆర్‌కు ముకుతాడు వేయాల‌ని చాలామంది కోరుకుంటూనే, వంద భ‌యాలు వెలిబుచ్చుతున్నారు. ఆ పార్టీ రాజ‌కీయ పంథా ఉద్య‌మ‌కారుల ఆమోదం పొంద‌లేకపోతున్న‌ది. అది కాషాయ వ్య‌తిరేకతో, సాంప్ర‌దాయ వామ‌పక్ష వాదమో కాదు. తెలంగాణ నేల‌, గాలి, సోయి, ప్ర‌కృతి. ఇది గ‌మ‌నించే అధికారపార్టీకి చెందిన అవ‌కాశ‌వాద నాయ‌కులు బీసీల‌కు చట్ట‌స‌భల్లో రిజర్వేషన్‌ గురించిన హామీ దొరికిందా? న‌ల్ల చ‌ట్టాల‌ను తెల్ల‌గా చేస్తామ‌ని హామీ ఇచ్చిన్రా? అంటూ మాట్లాడుతున్నారు. తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘానికి ఇప్పుడు క‌ల్వకుంట్ల క‌విత నాయకురాలు. ఆర్టీసీలో యూనియ‌న్‌లు లేవు. కేసీఆర్‌, కొప్పుల పెట్టిన విద్యుత్ సంఘాన్నే కాదు, నాయ‌ని, హ‌రీశ్‌, చెరుకు సుధాక‌ర్ పెట్టిన ఓసిటియ‌ల్ యూనియ‌న్‌ను కూడా ఇంట్లోనే కూసోని, అప్పుడ‌ప్పుడు సంస్థ య‌జ‌మానుల‌కు మ‌హాజ‌ర్లు మాత్రమే ఇవ్వాలని కార్మిక నాయ‌కుల‌కు హుజూర్ గారి ఆర్డ‌ర్లు. రేపు ఈటల బిజెపికి పోయి కార్మిక హ‌క్కుల‌, రైతాంగ డిమాండ్ల సాధ‌న‌కు బండి సంజ‌య్‌తో క‌లిసి ఉద్య‌మం చేస్తానంటే, ప్ర‌జ‌ల త‌రుపు పోరాడ‌తానంటే వ‌ద్దంటామా? కానీ అది అయ్యేప‌నేనా? ప్ర‌మాదం ముంచుకొస్తున్న‌నాడే ఈటల‌ ఉద్య‌మ‌కారుల‌ను అక్కున చేర్చుకోవ‌ల‌సి ఉండె. ఇప్పుడు మ‌న‌ అక్కెర‌కు అంద‌రిని రాండ్రీ! రాండ్రీ! అంటే అవ‌కాశ‌వాద లెక్క‌లు, అభిజాత్యాల మ‌ధ్య గంప కింద కప్పబ‌డిన తల్లికోళ్ళు ఎన్నో? బ్రాయిల‌ర్ కోళ్ళు ఎన్నో? రాజేంద‌ర్‌కు తెలువ‌దా?


పేద ముదిరాజ్ కుటుంబం నుండి ఎదిగి వ‌చ్చిన త‌న‌కు ఈ ఆస్తులు ఒక లెక్క కాద‌ని తెగేసి చెప్పే ధైర్యం లేక‌పోవ‌డం, మ‌ళ్ళీ హుజూరాబాద్‌లో గెలువ‌పోతే రాజ‌కీయ భ‌విష్య‌త్తే లేద‌నే నైరాశ్యం ఉద్య‌మ‌కారుడి ధీరోదాత్త‌త‌ను తెలియ‌జేయ‌దు. అధికారపక్షం నాయకులు ఎగతాళి చేస్తున్నట్టుగా గాలివాటంగా, కేసీఆర్‌ ఫోటోతో, తెలంగాణ ఉద్య‌మ ఉధృతితో గెలిచిన‌వాళ్ళే కాని ప్ర‌జా పునాది ఉన్న వాళ్ళు కాద‌ని ఋజువు చేయ‌బ‌డితే రానున్న కాలంలో అదే పెద్ద ప్ర‌మాదం. మ‌రో పార్టీ తీర్థం పుచ్చుకొని రేపు హుజూర్‌బాద్ ఎన్నిక‌ల్లో పోటీ ధ‌ర్మానికి, అధ‌ర్మానికి మ‌ధ్య అని స‌వాల్ విసిరినా ఫ‌లితాలు ఎలా ఉంటాయో చెప్ప‌లేం.  


ఏది ఏమైనా, అవ‌కాశాన్ని సవ్యంగా అందిపుచ్చుకొని స్వ‌తంత్రంగా, స‌మష్టిగా ముందుకు తీసుకుపోయే బ‌దులు, ఢిల్లీ ప్ర‌భువుల పంచన ఈటల సేద తీరితే దూప‌గొన్న తెలంగాణ నేల‌కు నాయ‌క‌త్వ‌మే లేద‌న్న‌ట్లు ఎవ‌రూ దిగాలు ప‌డొద్దు, పేద రాత‌లు రాయొద్దు. సుదీర్ఘ‌కాలంగా ప్ర‌జా ఉద్య‌మాల్లో ప‌ని చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి పాలకుడి నియంతృత్వ ధోరణులను ఎండ‌గ‌డుతున్న ఉద్య‌మ‌కారుల‌ను నాయ‌కులుగా గుర్తించ‌కుండా, కేసీఆర్‌తో అంట‌కాగి, ఆస్తులు పోగేసుకొని, అధికారం అనుభ‌వించి, ఏదో సంఘ‌ర్ష‌ణ నుండి బ‌య‌ట‌కు రాగానే గొప్ప నాయ‌కుడు వ‌చ్చిండ‌నే భావ‌దారిద్ర్యం, అవ‌కాశవాదం వ‌దిలిపెడ‌దాం. ఈటల చేజార్చుకున్న అవకాశం అందుకోవడం కోసం మ‌న సామూహిక చైత‌న్య‌మే కొత్త నాయ‌కుడిని మ‌న‌నుండే నిల‌బెడుతుంది. అది పున‌రుత్థానం కంటే గొప్ప‌ది. ఆర్త‌నాదాల్ని నినాదాలుగా మారుస్తుంది. అమ‌రుల లోగిల్ల నిండా ఆత్మ‌గౌర‌వ ప‌తాకాలే. తెలంగాణ ఉద్య‌మ నిట్టాడుకు ద‌న్నుగా నిటారుగా నిల‌బడ్డ ఈటలు ఎన్నో!

డా. చెరుకు సుధాక‌ర్

Advertisement