వైసీపీ గూటికి మరో నేత.. తిరుమలలో జగన్‌తో సమావేశం!

ABN , First Publish Date - 2020-09-24T17:16:51+05:30 IST

వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు నేతలు

వైసీపీ గూటికి మరో నేత.. తిరుమలలో జగన్‌తో సమావేశం!

తిరుమల : వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు నేతలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ సర్కార్‌కు మద్దతిచ్చారు. వీరిలో కొందరు వారి కుటుంబ సభ్యులకు, కుమారులకు వైసీపీ కండువా కప్పించారు. ఇటీవలే టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి మద్దతిచ్చి.. తన ఇద్దరు కుమారులకు వైఎస్ జగన్ సమక్షంలో కండువా కప్పించారు.


అయితే.. తాజాగా మరో నేత వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలియవచ్చింది. టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు డీకే శ్రీనివాసులు త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారని సమాచారం. సీఎం జగన్ తిరుమల పర్యటనలో ఉండగా శ్రీను కలిశారు. ఎంపీ మిథున్‌రెడ్డి.. డీకే శ్రీనివాస్‌ను జగన్‌కు పరిచయం చేశారు. జగన్‌తో 10 నిమిషాల పాటు డీకే సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో మిథున్‌రెడ్డిపై రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున డీకే శ్రీనివాస్‌ తల్లి సత్యప్రభ పోటీ చేశారు. అప్పట్లో మిథున్‌పై డీకే శ్రీనివాసులే పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే ఏం జరిగిందో ఏమోకానీ చివరికి సత్యప్రభే రాజంపేట నుంచి పోటీ చేశారు.


నాన్న చివరి కోరిక అదే..

జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీనివాసులు.. ఆనంద నిలయం అనంతస్వర్ణమయం ప్రాజెక్ట్‌ను పూర్తి చెయ్యాలనేది నాన్న ఆదికేశువులు చివరి కోరిక అన్నారు. ఆ ప్రాజెక్ట్ రాజకీయ కారణాలతో నిలిచిపోయిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చెయ్యాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.  సీఎం నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు. పార్టీ మార్పు విషయంపై ప్రస్తుతం చర్చించలేదన్నారు. ప్రాజెక్ట్ పూర్తి చెయ్యడమే లక్ష్యమని... రాజకీయ భవిష్యత్ గురించి తరువాత మాట్లాడుతానని డీకే శ్రీనివాస్ పేర్కొన్నారు.


డీకే కుటుంబం గురించి..!

కాగా.. ఆదికేశవులు రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్‌గా, రెండు పర్యాయాలు చిత్తూరు ఎంపీగా పనిచేశారు. 2013లో గుండె సంబధిత వ్యాధితో ఆయన మరణించారు. మెకానికల్ ఇంజనీర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆదికేశవులు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. మాల్యా కుటుంబంతో కూడా డీకే కుటుంబానికి సత్సంబంధాలు ఉండేవి. ఇక డీకే సత్యప్రభ విషయానికొస్తే.. ఆమె చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి మిథున్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.



Updated Date - 2020-09-24T17:16:51+05:30 IST