బ్రెజిల్‌లో మరో కొత్త స్ట్రెయిన్‌!

ABN , First Publish Date - 2021-01-17T07:48:30+05:30 IST

కొత్తరూపుతో బ్రిటన్‌ను వణికిస్తూ ప్రపంచదేశాలకు వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు బ్రెజిల్‌లోనూ రూపు మార్చుకుంది. గత మాసంలోనే శాస్త్రవేత్తలు బ్రెజిల్‌లో ఓ కొత్త

బ్రెజిల్‌లో మరో కొత్త స్ట్రెయిన్‌!

  • ఇప్పటికే పది రకాలుగా రూపాంతరం
  • వ్యాక్సిన్లకు లొంగడం కష్టమే: నిపుణులు


హైదరాబాద్‌, జనవరి 16: కొత్తరూపుతో బ్రిటన్‌ను వణికిస్తూ ప్రపంచదేశాలకు వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు బ్రెజిల్‌లోనూ రూపు మార్చుకుంది. గత మాసంలోనే శాస్త్రవేత్తలు బ్రెజిల్‌లో ఓ కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించారు. ఇప్పటికే అది 10 రకాలుగా రూపాంతరం చెందిందని తేల్చారు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని, ఇది ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకు లొంగుతుందన్న నమ్మకం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. భారత శాస్త్రవేత్తలు కూడా ప్రయోగాలు మొదలెట్టారు.


బ్రిటన్‌, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌లతో పోల్చితే ఈ బ్రెజిల్‌ స్ట్రెయిన్‌లో అనేక రకాల జన్యుమార్పులను గుర్తించామని వారు తెలిపారు. ఇప్పటివరకు ఈ ‘నెక్ట్స్‌ స్ట్రెయిన్‌’ కేసులు భారత్‌లో ఒక్కటి కూడా నమోదుకాలేదని, జపాన్‌లో మాత్రమే ఈ బ్రెజిల్‌ స్ట్రెయిన్‌ కేసులు వెలుగు చూశాయని, అందుకే అక్కడ అకస్మాత్తుగా కేసులు పెరిగాయని చెప్పారు. గతంలో కొవిడ్‌ బారిన పడ్డ వాళ్లకు కూడా ఇది సోకే ప్రమాదం ఉందని వైద్యులు అన్నారు.


బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లలో గుర్తించిన కరోనా కొత్త వేరియంట్ల ప్రభావాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎమర్జెన్సీస్‌ చీఫ్‌ డాక్టర్‌ మైకేల్‌ రియాన్‌ తెలిపారు. ఇన్‌ఫెక్షన్‌ పెరుగుదలకు మనుషుల ప్రవర్తన కూడా ఒక కారణమని చెప్పారు. కొత్త వేరియంట్‌పై ఆరోపణలు చేయడం చాలా సులభమన్నారు. భౌతిక దూరం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం వంటి చర్యలను తప్పనిసరిగా పాటించాలని ప్రజారోగ్య అధికారులు ప్రజలకు పిలుపునివ్వాలని కోరారు.

Updated Date - 2021-01-17T07:48:30+05:30 IST