తిరుపతిలోని ఆరు డివిజన్లలో నామినేషన్లకు మరో అవకాశం

ABN , First Publish Date - 2021-03-02T08:17:06+05:30 IST

అధికార పార్టీ ఆగడాలతో నామినేషన్లు వేయలేక పోయిన కొందరికి మాత్రమే ఎస్‌ఈసీ మరో అవకాశం ఇచ్చింది.

తిరుపతిలోని ఆరు డివిజన్లలో నామినేషన్లకు మరో అవకాశం

ఐదుచోట్ల టీడీపీకి, ఒక బీజేపీ అభ్యర్థికి అనుమతి

నేడు నామినేషన్ల దాఖలుకు ఉత్తర్వులిచ్చిన ఎస్‌ఈసీ

అందుబాటులో లేని ముగ్గురు టీడీపీ అభ్యర్థులు!


తిరుపతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): అధికార పార్టీ ఆగడాలతో నామినేషన్లు వేయలేక పోయిన కొందరికి మాత్రమే ఎస్‌ఈసీ మరో అవకాశం ఇచ్చింది. తిరుపతి నగరపాలక సంస్థలోని 2, 8, 10, 21, 41, 45 డివిజన్లకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం నామినేషన్‌ వేయవచ్చని ఎస్‌ఈసీ ఉత్తర్వులిచ్చింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల్లోపు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన, బుధవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణలకు గడువుంది. వీటిలో పదో డివిజన్‌కు బీజేపీ అభ్యర్థికి, తక్కినవాటికి గతంలో ఇబ్బందులుపడ్డ టీడీపీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. 


టీడీపీ నగర ప్రధాన కార్యదర్శికి నోచాన్స్‌

ఫ పదో డివిజన్‌కు నామినేషన్‌ వేసేందుకు వచ్చిన టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి మన్నెం శ్రీనివాసులు ఆధారాలతోసహా ఫిర్యాదు చేసినా అతడికి అవకాశం ఇవ్వలేదు. టీడీపీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు కావడం వల్లే మన్నెంకు అవకాశం రాలేదని తెలుస్తోంది. అయితే టీడీపీ పేరుతో ఒక సెట్‌ నామినేషన్‌ సమర్పించిన అభ్యర్థి అధికార పార్టీ కనుసన్నల్లో ఉన్నట్టు సమాచారం. ఇదే డివిజన్‌కు బీజేపీ అభ్యర్థిగా సీఎన్‌ శరవణ నామినేషన్‌ వేసేందుకు వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు అతడిని కిందపడదోసి, నామినేషన్‌ పత్రాలతోపాటు మొబైల్‌ ఫోన్‌, ఏటీఎం లాక్కున్నారు. అక్కడున్న ఎస్పీకి శరవణ మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు అతడికి మళ్లీ అవకాశం వచ్చింది. 

41వ డివిజన్‌కు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వచ్చిన టీటీడీ ఉద్యోగుల సంఘ నేత వెంకటేష్‌ భార్య చంద్రికను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. నామినేషన్‌ పత్రాలను చింపి బయటకు పంపారు. అలాగే టీడీపీ అభ్యర్థి సూర్యకుమారి కూడా వేయలేకపోయారు. ఇప్పుడు ఆమెకు మళ్లీ అవకాశం వచ్చినప్పటికీ అందుబాటులో లేరని పార్టీ నాయకత్వం ఆందోళన చెందుతోంది. 

8వ డివిజన్‌ నుంచి టీడీపీ అభ్యర్థి రుద్రకోటి సదాశివం నామినేషన్‌ వేసేందుకు వస్తుండగా పత్రాలతోపాటు ప్రపోజర్లను కూడా మాయం చేశారు. దీనిపై ఆయన ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేస్తే తిరిగి అవకాశం వచ్చింది. అయితే మళ్లీ బెదిరింపులు రావడంతో ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

45, 21, 2వ వార్డులకు చెందిన అభ్యర్థుల ఫిర్యాదు మేరకు మళ్లీ అవకాశం వచ్చినప్పటికీ వీరిలో ఒకరు పత్తాలేకుండా పోయారని సమాచారం. మొత్తానికి టీడీపీకి ఐదుచోట్ల అవకాశాలొచ్చినా.. రెండు, మూడు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - 2021-03-02T08:17:06+05:30 IST