మరోముప్పు

ABN , First Publish Date - 2021-06-18T05:58:51+05:30 IST

కొవిడ్‌ ప్రస్తుత సెకండ్‌ వేవ్‌ కల్లోలం తర్వాత మూడో వేవ్‌ ముప్పు కూడా పొంచి ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది.

మరోముప్పు

  • కొవిడ్‌ మూడో దశను ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు సన్నాహాలు
  • అక్టోబరు, నవంబరుల్లో మళ్లీ వైరస్‌ విజృంభిస్తుందనే అంచనాతో ఇప్పటి నుంచే హైఅలర్ట్‌
  • జిల్లాలో రెండు లక్షల మందికి కొవిడ్‌ సోకవచ్చని అంచనా వేసిన అధికారులు
  • ఇందులో 50వేల మంది పిల్లలకు పాజిటివ్‌ వచ్చే ప్రమాదముందని అంచనా
  • వీరిలో 45 వేల మందికి హోం ఐసోలేషన్‌, 4వేల మందికి బెడ్‌లు అవసరం ఉంటుందని లెక్క
  • వెయ్యి మంది పిల్లలు కొవిడ్‌ తీవ్రతతో ఐసీయూ వరకు వెళ్లొచ్చని విశ్లేషణ
  • తీవ్రత తగ్గించేందుకు జులై, ఆగస్టు, సెప్టెంబరుల్లో భారీ ప్రణాళికలు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ ప్రస్తుత సెకండ్‌ వేవ్‌ కల్లోలం తర్వాత మూడో వేవ్‌ ముప్పు కూడా పొంచి ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య,  ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటి ద్వారా కేసుల సంఖ్యను గణనీయంగా నియంత్రించవచ్చని భావిస్తోంది. గడిచిన మొదటి, రెండో దశల్లో జిల్లావ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌లు, ఆసుపత్రుల్లో పడకల రద్దీ తదితర గణాంకాలన్నీ విశ్లేషించిన వైద్య, ఆరోగ్య శాఖ అక్టోబరు, నవంబరుల్లో మూడో దశ ముప్పు మొదలయ్యే అవకాశం ఉందని అంచనాకు వచ్చింది. ఈ క్రమంలో జిల్లాలో రెండు లక్షల కొవిడ్‌ కేసులు వచ్చే ప్రమాదం ఉందని భావిస్తోంది. ఇందులో 50వేల మంది వరకు పిల్లలు వైరస్‌ బారిన పడవచ్చని లెక్కగట్టింది. ప్రస్తుతం కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో జిల్లా అల్లకల్లోలంగా మారింది. రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్‌లు ఇక్కడే నమోదవుతున్నాయి. గడిచిన రెండున్నర నెలల్లో ఏకంగా 1.24లక్షల కేసులు రాగా, మేలో 80వేల మంది వైరస్‌ బారిన పడ్డారు. అంచనాకు అందని కేసులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడా పడకలు చాలక బాధితులు నరకయాతన పడుతున్నారు. బెడ్‌లు దొరక్క వేలాదిమంది కన్నుమూశారు. గతేడాది తొలి దశలో జిల్లాలో లక్షకు పైగా పాజిటివ్‌లు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ విశ్లేషించిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మూడో ముప్పులో జిల్లామొత్తం కలిపి రెండు లక్షల మంది వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉందని తాజాగా అంచనాకు వచ్చి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ముఖ్యంగా అక్టోబరు, నవంబరుల్లో వైరస్‌ దాడి ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందులో భాగంగా రెండు లక్షల పాజిటివ్‌ల్లో 50వేల మంది 18 ఏళ్లలోపు పిల్లలు కొవిడ్‌ బారిన పడతారని అధికారులు అంచనా వేశారు. ఇందులో 45వేల మందికి ఇంట్లోనే హోం ఐసోలేషన్‌ కిట్లతో నయం అవ్వవచ్చని ప్రాథమికంగా విశ్లేషించారు. మరో నాలుగు వేల మంది పిల్లలకు ఆసుపత్రుల్లో పడకలు అవసరం అవుతాయని, ఇంకో వెయ్యి మంది పిల్లల్లో కొవిడ్‌ తీవ్రత పెరిగి ఐసీయూ వరకు వెళ్లే ప్రమాదం ఉందని ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పిడియాట్రిక్‌ బెడ్‌ల లభ్యత, పిల్లల వైద్యులను గుర్తిస్తున్నారు. ప్రాథమిక లెక్కల ప్రకారం వంద మందిని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. 

గ్రామాల వారీగా లాక్‌డౌన్‌..

మూడోవేవ్‌ ముప్పు ప్రారంభానికి ముందే సచివాలయాల స్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ వలంటీర్లు ఇంటింటికి వెళ్లి జ్వరం కేసులను గుర్తించి నియంత్రణ జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక గ్రామంలో వారంపాటు లాక్‌డౌన్‌ విధించి జ్వరాలు తగ్గేలా చేసి, ఆ తర్వాత మరో వారం పక్క గ్రామంలో లాక్‌డౌన్‌ అమలు చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్కూళ్లు, కళాశాలలు తెరిచిన తర్వాత తరగతుల ప్రారంభానికి ముందు, స్కూలు ముగియడానికి ముందు కొవిడ్‌ను ఎదుర్కోవడంపై రోజూ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఒకవేళ విద్యార్థి ఎవరైనా ఆర ోజు స్కూలుకు హాజరుకాకపోతే జ్వరమే కారణమా అని ఆరాతీసే పక్కా ప్రణాళికలు కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. మరోపక్క ముప్పు మొదలవడానికి ముందుగానే జులై, ఆగస్టు, సెప్టెంబరుల్లో జిల్లాప్తంగా చిన్నారులకు ఇన్‌ఫ్లుయెంజా, న్యూమోకోకల్‌ తదితర టీకాలు కూడా పూర్తిస్థాయిలో అందరికీ అందించాలని నిర్ణయించారు. తద్వారా కొవిడ్‌ను ఎదుర్కొనే శక్తిని పెంపొందిస్తే ముప్పు తగ్గుతుందని భావిస్తున్నారు.

Updated Date - 2021-06-18T05:58:51+05:30 IST