Sep 19 2021 @ 01:24AM

సింగిల్‌ షాట్‌లో మరో ప్రస్థానం

‘‘సింగిల్‌ షాట్‌లో ఎలాంటి కట్స్‌, రివైండ్స్‌ లేకుండా ‘మరో ప్రస్థానం’ సినిమాను తెరకెక్కించాం. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమే అయినా కథలో అంతర్లీనంగా సామాజిక సందేశం ఉంటుంది’’ అని హీరో తనీష్‌ తెలిపారు. ఆయన హీరోగా నటించిన ‘మరో ప్రస్థానం’ చిత్రం ఈ నెల 24న థియేటర్లలో విడుదలవనుంది. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు.  చిత్ర కథానాయిక ముస్కాన్‌ సేథి మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో తొలిసారి కొత్త తరహా పాత్ర చేస్తున్నాను. యాక్షన్‌ సీన్లలో నటించడం సవాల్‌గా అనిపించింది’ అని అన్నారు. ‘‘ఇందులో సన్నివేశాలు వాస్తవికంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. చిత్రబృందం సినిమా కోసం పడిన శ్రమ తెరపై కనిపిస్తుంది’’ అని చిత్ర దర్శకుడు జానీ అన్నారు. రాజారవీంద్ర, భానుశ్రీ మెహ్రా, కబీర్‌ దుహాన్‌ సింగ్‌ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మిర్త్‌ మీడియా సంస్థ నిర్మించింది.