Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరో మాయ!

కైకలూరు నుంచి మరో ఏడు వేల బస్తాల లెక్క గల్లంతు

పౌరసరఫరాల సంస్థ దాచేసిన నిజం 

మూడు మండలాలకు ఇవ్వాల్సిన రేషన్‌ ఇది

విచారణలో గుర్తించిన 12 వేల బస్తాల్లో ఇవి లేవు 

హుళ క్కేశ్వరరావును కాపాడేందుకు యత్నాలు 

మధ్యాహ్న భోజనం బియ్యం కూడా పక్కదారి

అంగన్‌వాడీ కేంద్రాలకు ఇవ్వాల్సినవీ బొక్కేశారు 

పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ తీరుపై విమర్శలు

డీలర్లతో హుళక్కేశ్వరరావు బేరసారాలు


కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో వెలుగు చూసిన భారీ బియ్యం స్కామ్‌లో అధికారులు బయటపెట్టని మరో మాయ ఇది. ఈ పాయింట్‌ పరిధిలోని కైకలూరు, కలిదిండి, మండవల్లి మండలాల్లో 132 చౌక దుకాణాలకు పంపిణీ చేయాల్సిన ఏడు వేల బస్తాల బియ్యాన్ని, నిత్యావసరాలను పక్కదారి పట్టించేశారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి మాయమయ్యాయని అధికారులు వెల్లడించిన 12 వేల బస్తాలకు ఇవి అదనం. అంటే డీలర్లకు అందాల్సిన ఏడు వేల బస్తాల బియ్యం, ఇతర నిత్యావసరాల దారిమళ్లింపుపై అసలు విచారణే జరగకపోవడం విడ్డూరంగా ఉంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ / కైకలూరు) : మూడు మండలాలకు చెందిన 132 మంది రేషన్‌ డీలర్లకు ఇవ్వాల్సిన ఏడు వేల బస్తాల బియ్యం, ఇతర నిత్యావసరాలు ఏమయ్యాయో తెలియదు. పాఠశాలల విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి అందించాల్సిన బియ్యం, అంగన్‌వాడీ కేంద్రాలకు అందించాల్సిన ఇతర నిత్యావసరాల పరిస్థితీ అంతే. దీనినిబట్టి చూస్తే విచారణ కమిటీ సమగ్ర విచారణ జరపలేదనేది అర్థమవుతోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జిని కాపాడటానికే ఇలా చేస్తున్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 


ఇన్‌చార్జ్‌ని కాపాడే ప్రయత్నాలు

కొందరు అధికారుల జాతకాలు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌ హుళక్కేశ్వరరావు చేతిలో ఉన్నందునే అధికారులు అతనిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వాస్తవమే అనిపిస్తోంది. సస్పెండ్‌ అయిన హుళక్కేశ్వరరావు డీలర్లతో బేరసారాలకు దిగటం కూడా సందేహాలకు తావిస్తోంది. విజయవాడ నగర శివారుల్లో ఉన్న ఖరీదైన తన భవంతిని రూ.కోటికి విక్రయించి ఇవ్వాల్సిన బియ్యానికి డబ్బులు చెల్లిస్తానంటూ ఆయన డీలర్లకు ఆఫర్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒక ఉద్యోగి రూ. కోటి వ్యయంతో అత్యాధునిక భవంతిని కట్టాడంటేనే.. అవినీతి ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. అదే మాదిరిగా ఈ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసిన వెంకట్‌, ప్రైవేటు వ్యక్తి కిషోర్‌ కూడా అవకతవకలకు పాల్పడి భారీగా ఆస్తులను కూడబెట్టుకున్నారని తెలుస్తోంది. కంప్యూటర్‌ ఆపరేటర్‌కు వచ్చే ఆదాయం ఎంత? అతను సంపాదించిన ఆస్తి ఎంత? ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జికి వచ్చే వేతనం ఎంత? అతను అదనంగా సంపాదించినది ఎంత? అనే కోణంలో సివిల్‌ సప్లయిస్‌ జిల్లా అధికారిణి రాజ్యలక్ష్మి ఇప్పటి వరకు విచారణ జరిపించకపోవటం గమనార్హం. ఒక ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌పై విచారణ జరిపించేందుకు ఆమె వెనకాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 


డీలర్లపై ఎదురు దాడి

రేషన్‌ డీలర్లకు నిత్యావసరాలను దిగుమతి చేయించాల్సిన ఉన్నతాధికారిణి, అది సక్రమంగా జరగలేదని గుర్తించిన వెంటనే విచారణ జరపకపోగా, డీలర్లు సంతకాలు చేశారనే వాదనలను ముందుకు తీసుకు రావడం విమర్శలకు తావిస్తోంది. సరుకు ఇస్తామంటేనే డీలర్లు సంతకాలు చేస్తారు. సంతకాలు చేయించుకుని సరకు ఇవ్వకపోతే ఏమి చేస్తారు? బియ్యం స్కామ్‌ వెలుగు చూసిన తర్వాతే డీలర్లకు అసలు విషయం అర్థమైంది. బియ్యం తీసుకోకపోయినా ఈ పోస్‌లో స్టాక్‌ చూపిస్తుండటంతో.. విజిలెన్స్‌ తనిఖీల్లో తాము ఎక్కడ ఇరుక్కుపోతామోననే భయంతో కొందరు కార్డుదారులతో వేలిముద్రలు వేయించారు. బియ్యం వచ్చిన తర్వాత అందిస్తామని బతిమిలాడుకున్నారు. ఈ ఆధారాలు చూపించి, మీ దగ్గరకు సరకు వచ్చేసిందిగా అనే రీతిలో సివిల్‌ సప్లయిస్‌ అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో డీలర్లకు వెళ్లాల్సిన బియ్యం, నిత్యావసరాల మాయం ఘటన అధికారిక రికార్డుల్లోకి చేరటం లేదు. ఈ సమస్యపై విచారణాధికారి ఖాజావలికి మూడు మండలాల డీలర్లు మొరపెట్టుకుంటున్నా ఆయన ఆ దిశగా విచారణ సాగించకపోవటం కూడా అనుమానాలకు తావిస్తోంది. 


డీలర్లకు రావాల్సిన సరుకు లెక్క ఇదీ.. 

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ పరిధిలో ఉన్న మండవల్లి, కలిదిండి, కైకలూరు మండలాలకు రావాల్సిన బియ్యం బస్తాల వివరాలను ఆయా డీలర్ల నుంచి ‘ఆంధ్రజ్యోతి’ సేకరించింది. ఈ సమాచారం ప్రకారం మొత్తం 132 దుకాణాల్లో 27 దుకాణాలకు సగటున 80 బస్తాల చొప్పున తగ్గాయి. ఈ లెక్కన 27 రేషన్‌ దుకాణాలకు 2,160 బస్తాల బియ్యం, ఇతర నిత్యావసరాలు రావాల్సి ఉందని తేలుతోంది. 


ఉద్యోగుల పాత్రపై అనుమానాలు

కైకలూరు బిగ్‌ స్కామ్‌లో డీఎం కార్యాలయంలోని టెక్నికల్‌ విభాగం సిబ్బంది, ఎన్‌ఐసీకి చెందిన ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సివిల్‌ సప్లయిస్‌ హెడ్డాఫీసులో సాంకేతిక వ్యవహారాలను చూసే కొందరి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి బియ్యం, నిత్యావసరాలను రేషన్‌ దుకాణాలకు దిగుమతి చేయకుండానే.. ఆర్వోలు జారీ చేయటాన్ని లోతుగా పరిశీలిస్తే.. ఈ అనుమానాలు కలుగుతున్నాయి. డీలర్లు ముందుగా సంతకాలు చేస్తేనే సరుకు ఇస్తారు. సంతకాలు చేయకుండా సరుకు ఇచ్చినా తప్పే అవుతుంది. కానీ సంతకాలు చేశారని సరుకు డిస్పాచ్‌ చేయకుండా ముందస్తుగా ఆర్వోలు జారీ చేయడమే ఆలోచించాల్సిన అంశం.

Advertisement
Advertisement