క్రమంగా విజృంభణ

ABN , First Publish Date - 2020-06-30T10:52:01+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా క్రమంగా విస్తరిస్తోంది. పారిశ్రామిక ప్రాంతాలైన కొత్తగూడెం సింగరేణి, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు తదితర పట్టణాల్లో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.

క్రమంగా విజృంభణ

భద్రాద్రి జిల్లాలో మరో ఆరుగురికి పాజిటివ్‌ 


కొత్తగూడెం/ పాల్వంచ, జూన్‌ 29: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా క్రమంగా విస్తరిస్తోంది. పారిశ్రామిక ప్రాంతాలైన కొత్తగూడెం సింగరేణి, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు తదితర పట్టణాల్లో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. అయినా జనం భౌతిక దూరాన్ని పాటించకుండా ఇష్టారీతిన రాకపోకలు సాగిస్తున్నారు. జిల్లా లోని వ్యాపార వర్గాలు ఉదయం 8నుంచి సాయంత్రం 5గంటల వర కు దుకాణాలు నిర్వహించాలని తీర్మానాలు చేసుకున్నా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. విజయవాడ, హైదరాబాద్‌, తదితర ప్రాంతా ల నుంచి వచ్చేవారి ద్వారా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి.  


జిల్లాలో మరో ఆరుగురికి పాజిటివ్‌  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీటితో  కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 28కి చేరింది. కొత్తగూడెం సింగరేణి ఏరియా పరిధిలోని గౌతంపూర్‌కు చెందిన సింగరేణి కార్మికుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఇటీ వల ఆ కార్మికుడికి వైద్యం చేసిన సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో ఒక వైద్యుడికి వైరస్‌ సోకింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ద్వారా కొత్తగూడెంలోని బాబుక్యాంపునకు చెందిన ఒకరికి వైరస్‌ వ్యాపించింది. కొత్తగూడెం పట్టణంలోని గణేష్‌ టెంపుల్‌ సమీపంలోని కూలీలైన్‌ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న నలుగురికి పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి సూచించారు.  


డేంజర్‌ జోన్‌లో కేటీపీఎస్‌

పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)లో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. 10రోజుల్లో మూడు పాజిటివ్‌ కేసులు నమోదవ్వడంతో కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నా యి. కేటీపీఎస్‌ ఏడోదశలో ఓ ఇంజనీర్‌కి పదిరోజుల క్రితం పాజిటివ్‌ రాగా అతడి ద్వారా కుటుంబంలో నలుగురికి వైరస్‌ సోకింది. అతడికి డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తికి కూడా వైరస్‌ సోకి ఉంటుందనే అనుమానంతో డ్రైవర్‌ను కలిసిన కాలనీ వాసులు, చికిత్స చేసిన వైద్యుడితో పాటు వైద్య సిబ్బంది హోం క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.


ఇక సదరు ఇంజనీర్‌ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని కుటుంబాలను వైరస్‌ భయం వెంటాడుతోంది. తాజాగా కేటీపీఎస్‌ ఏడోదశ ఐఎన్‌సీ విభాగంలో పనిచేసే ఓ ఇంజనీర్‌కు పాజిటివ్‌ రావటంతో మరోసారి కలకలం రేగింది. అతనితో పాటు ఏసీలో కలిసి పనిచేసిన ఇంజనీర్లు పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ప్రస్తుతం కేటీపీఎస్‌లో ఎవరికైనా దగ్గు, జలుబు వస్తే వణికిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాల వారు మరింత ఆందోళన చెందుతున్నారు.  

Updated Date - 2020-06-30T10:52:01+05:30 IST