మరో ఆరుగురికి..గుంటూరులో ముగ్గురికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-06-02T09:06:03+05:30 IST

జిల్లాను కరోనా వీడనంటోంది. సోమవారం జిల్లాలో ఆరు కేసులను అధికారికంగా ప్రకటించారు. అనధికారికంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో

మరో ఆరుగురికి..గుంటూరులో ముగ్గురికి పాజిటివ్‌

కూరగాయల మార్కట్‌లోనూ కరోనా

ముందస్తుగా వ్యాపారులందరికీ పరీక్షలు

న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ నర్సుకు


గుంటూరు(సంగడిగుంట), తెనాలి టౌన్‌, చిలకలూరిపేట, రొంపిచర్ల, మాచవరం, ఈపూరు, జూన్‌ 1: జిల్లాను కరోనా వీడనంటోంది. సోమవారం జిల్లాలో ఆరు కేసులను అధికారికంగా ప్రకటించారు. అనధికారికంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో కేసులు ఉన్నట్లు సమాచారం. ఇక తాజా కేసుల్లో గుంటూరు జాతీయ రహదారి వెంట ఉన్న హోల్‌సేల్‌ కూరగాయల మార్కట్‌ వ్యాపారుల్లో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. మరో కోయంబేడులా గుంటూరు మార్కెట్‌ మారనున్నదన్న అనుమానాలతో వ్యాపారులందరికీ వైద్య పరీక్షలు చేపట్టారు. ఫలితాలు ఆందోళనగానే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ రెండు షాపుల పరిసరాల వారితో పాటు వారు నివసిస్తున్న గోరంట్ల ్జ్జకుమ్మర్లబజార్‌, శ్రీలక్ష్మీనగర్‌వాసులకు కూడా పరీక్షలు నిర్వహించారు.


ఇద్దరు వ్యాపారుల్లో ఓ కుటుంబ యజమాని 15 రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. కరోనా భయంతో వారం క్రితం శ్రీలక్ష్మీనగర్‌కు మారాడు. దీనితో ఈ రెండు ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్‌ సమీపంలోని సీతారామనగర్‌లో ఓ నర్సుకు పాజిటివ్‌ వచ్చింది. ఈమె ఓల్డ్‌క్లబ్‌రోడ్డులోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తూ ఇంటివద్ద కూడా ప్రాక్టీస్‌ చేస్తుంది. దీనితో ఆ ప్రాంతంలోని వారికి కూడా వైద్య పరీక్షలు చేపట్టారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి కూడా పాజిటివ్‌ వచ్చింది. నరసరావుపేటలో ఇద్దరికి పాజిటివ్‌గా అధికారులు ప్రకటించారు. దీంతో సోమవారానికి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 482కు చేరింది. ఈపూరు మండలం వనికుంటలో ముగ్గురికి పాజిటీవ్‌ నిర్ధారణ అయిన నేపథ్యంలో రెండో విడతగా సోమవారం 98 మందికి పరీక్షలు చేసినట్లు వైద్యులు డీ నాగేంద్రబాబు తెలిపారు. 


కొనసాగుతున్న కరోనా.. కల్లోలం

తెనాలి పరిధిలో మరో పాజిటివ్‌ కేసు నమోదైనట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో నరసింహానాయక్‌ తెలిపారు. కఠెవరం శివారు బాలాజీరావుపేటలో నివసించే ఓ యువకుడికి పాజిటివ్‌ ఉన్నట్లుగా పరీక్షల్లో గుర్తించామన్నారు. ఇతడు ఓ ప్రైవేట్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడన్నారు. ఇతడితో కలిసి నివసించే యువకుడితో పాటు ఐదుగురు సహ ఉద్యోగులను క్వారంటైన్‌కి తరలించినట్లు చెప్పారు. ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించామన్నారు. నిన్నటి వరకు పట్టణానికే పరిమితమైన కరోనా కేసులు ఇప్పుడు మండలంలోని గ్రామాలకు వ్యాప్తి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.   


చిలకలూరిపేటలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చినపీరుసాహెబ్‌వీధికి చెందిన కరోనా సోకిన మహిళ కుమారుడికి సోమవారం వెల్లడించిన ఫలితాలలో పాజిటివ్‌ వచ్చింది. దీనితో పట్టణంలో కరోనా కేసుల సంఖ్య ఐదుకు చేరాయి. కంటైన్‌మెంట్‌ జోన్లలోని 101మందికి ఆదివారం జరిపిన పరీక్షల నివేదికలు రెండు మూడు రోజులలో రానున్నాయి.


రొంపిచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో ఇటీవల పూణే నుంచి వచ్చిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో ఉన్నట్లు స్థానికులు అధికారులకు తెలిపారు. దీంతో అతడ్ని నరసరావుపేటలోని క్వారంటైన్‌ సెంటర్‌కు పంపారు. నమూనాలను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపటం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి నివాసం ఉండే ప్రాంతాన్ని తహసీల్దార్‌ జాన్‌ సైదులు, ఎంపీడీవో బీ అర్జునరావు, ఎస్‌ఐ వెంకటరావులు పరిశీలించారు. గ్రామంలో పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు. 


మాచవరం మండలం ఇద్దరికి పాజిటివ్‌గా గుర్తించినట్లు  వైద్యాధికారి అనూష సోమవారం తెలిపారు. సింగరాయపాలెం తండాకి చెందిన ఓ యువకుడు ఢిల్లీలో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకొని గత నెల 29న స్వగ్రామానికి చేరుకునేందుకు విజయవాడ వచ్చాడు. అక్కడ జరిపిన పరీక్షల్లో పాజిటివ్‌ రావటంతో క్వారంటైన్‌కి తరలించారన్నారు. గుజరాత్‌ నుంచి పిన్నెల్లిలోని ఇంటికి వస్తున్న ఓ వ్యక్తిని నంబూరు వద్ద పరీక్షలు చేయగా పాజిటివ్‌ రావటంతో  క్వారంటైన్‌కి తరలించినట్లు తెలిపారు. తహసీల్దారు లెవీ ఆయా గ్రామాల్లోని వారి గృహాలకు వెళ్లి వారి బంధువులను కలసి విషయాన్ని తెలియజేసి ధైర్యం చెప్పారు. 

Updated Date - 2020-06-02T09:06:03+05:30 IST