మరో అడుగు

ABN , First Publish Date - 2021-01-11T05:03:28+05:30 IST

పార్వతీపురం జిల్లా ఏర్పాటు దిశగా మరో అడుగు పడినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వానికి అధికారుల కమిటీ తాజాగా ఇచ్చిన నివేదికలో నాలుగు నియోజకవర్గాలతో పార్వతీపురం జిల్లా ఏర్పాటు చేయాలని పేర్కొంది.

మరో అడుగు
నిర్మాణంలో ఉన్న కొత్త ఐటీడీఏ భవనం

కొత్త జిల్లాల జాబితాలో పార్వతీపురం 

నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటుకు యోచన

 

పార్వతీపురం జిల్లా ఏర్పాటు దిశగా మరో అడుగు పడినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వానికి అధికారుల కమిటీ తాజాగా ఇచ్చిన నివేదికలో నాలుగు నియోజకవర్గాలతో పార్వతీపురం జిల్లా ఏర్పాటు చేయాలని పేర్కొంది. రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికగా 26 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం మొదటి నుంచీ ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని విభజిస్తూ పార్వతీపురం జిల్లా ఏర్పాటు చేయాలని గిరిజనులు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగానే పరిణామాలు చోటుచేసుకుంటుండడంతో వారు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.


(పార్వతీపురం)

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై లోతుగా కసరత్తు జరుగుతోంది. జిల్లాల సరిహద్దులు.. ప్రాధాన్యాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని అధికారులు వివిధ అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రజలు, నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ విషయంపై సుదీర్ఘంగా విచారించిన అధికారుల బృందం తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అందులో పార్వతీపురం జిల్లాను, బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ను ప్రస్తావించింది. దీనిని బట్టి త్వరలోనే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఆవిర్భావం జరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలో అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా రెండో స్థానంలో ఉన్న అరకు పరిధిలోని ప్రాంతాలు రెండు జిల్లాలుగా మారనున్నాయి. ప్రతి పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఒక జిల్లా ఏర్పాటు చేయాలని మొదట ప్రభుత్వం భావించింది. కానీ అరకు విస్తీర్ణం ఎక్కువ కావడం.. ప్రస్తుతం నాలుగు జిల్లాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడంతో అరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని అధికారుల కమిటీ తన ప్రతిపాదనలో పేర్కొంది. అరకు లోక్‌సభ పరిధిలోని పార్వతీపురం, పాలకొండ, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను పార్వతీపురం జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరింది.  ఇది జిల్లా కేంద్రమైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాలకొండ నియోజకవర్గం పరిధిలోని కొన్ని మండలాల ప్రజలకు ఎంతో ఉపయోగం. వారికి సమీపంలోనే జిల్లా కేంద్రం ఉంటుంది. అరకు లోక్‌సభ పరిధిలోని మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పాటు కానున్న పాడేరు జిల్లాలో కలవనున్నాయి. ఆ జిల్లా పరిధిలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలు ఉంటాయి. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలు ఇకపై ఒకే జిల్లాలో ఉంటాయి. 

  ఐటీడీఏ భవనంలో కలెక్టరేట్‌

ప్రస్తుతం రూ. 5 కోట్లతో నిర్మిస్తున్న ఐటీడీఏ నూతన భవనం కొత్త కలెక్టరేట్‌ భవనంగా వినియోగించే అవకాశం ఉంది. భవన నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఉండాల్సిన ఆసుపత్రి సైతం త్వరలోనే నిర్మాణం కానుంది. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి స్థల సమీకరణ పూర్తయింది. భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. పార్వతీపురం ఏఎస్పీ కార్యాలయం.. ఎస్పీ కార్యాలయంగా మారనుంది. అవసరమైన భవనాలు సిద్ధంగా ఉండడంతో జిల్లా కేంద్రం ప్రకటన జరిగిన వెంటనే కార్యాలయ మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయి.



Updated Date - 2021-01-11T05:03:28+05:30 IST