రేపు మరో తుఫాను?.. 1 నుంచి మళ్లీ వర్షాలు

ABN , First Publish Date - 2020-11-28T09:06:10+05:30 IST

రాష్ట్రానికి మరో తుఫాను గండం పొంచి ఉంది. ‘నివర్‌’ ప్రభావం ఉన్న తరుణంలోనే మరో తుఫాను వెంటాడుతోందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం హెచ్చరించింది.

రేపు మరో తుఫాను?.. 1 నుంచి మళ్లీ వర్షాలు

డిసెంబరులో మరో 2 తుఫాన్లు?.. ఐఎండీ వెల్లడి

రేపు మరో తుఫాను?

1 నుంచి కోస్తా, సీమల్లో వర్షాలు.. అంచనాలకు భిన్నంగా ‘నివర్‌’ 

డిసెంబరులో మరో 2 తుఫాన్లు?.. వాతావరణ విభాగం వెల్లడి


విశాఖపట్నం/న్యూఢిల్లీ/అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మరో తుఫాను గండం పొంచి ఉంది. ‘నివర్‌’ ప్రభావం ఉన్న తరుణంలోనే మరో తుఫాను వెంటాడుతోందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం హెచ్చరించింది. భూమధ్య రేఖకు సమీపంలో హిందూ మహాసముద్రం దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ స ముద్రంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే 36గంటల్లో(29న) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా మారి.. బలపడి తుఫానుగా మారుతుందని, వచ్చే నెల 2న తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటనుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో 1 నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు.. 2న, 5వ తేదీన మరో రెండు తుఫాన్లు వచ్చే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. 


దిశ మార్చుకున్న వాయుగుండం 

‘నివర్‌’ తుఫాను గమనం అంచనాలకు భిన్నంగా సాగింది. వాయుగుండంగా బలహీనపడే క్రమంలో దిశ మార్చుకుంది. బుధవారం అర్ధరాత్రి తీరం దాటిన నివర్‌ వాయవ్యంగా పయనించి గురువారం రాత్రి వాయుగుండంగా బలహీనపడింది. ఇది మరింత బలహీనపడే క్రమంలో వాయవ్యంగానే అంటే కర్ణాటక మీదుగా పయనించా ల్సి ఉండగా.. దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనించి దక్షిణ కోస్తా పరిసరాల్లోకి వచ్చింది. తర్వాత తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు, పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఉంది.


దీంతో గురువారం రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రాను న్న 24 గంటల్లో కోస్తా, సీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని.. నెల్లూరు, ప్రకాశం, గుంటూరుల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపిం ది. తీరం వెంబడి 45-55 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారు లు వేటకు వెళ్లవద్దని సూచించింది. కాగా, శుక్రవారం కోస్తా, సీమల్లో వర్షాలతో పాటు చలిగాలుల తీవ్రత కొనసాగింది. గంటకు 35-45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 4 రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. శుక్రవారం పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 1.9 నుంచి 8.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గాయి. 


బురేవి.. టకేటి!

ఈ నెల 29న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం మరింత బలపడి వ చ్చే నెల 2 నాటికి తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని వాతావరణ విభాగం ప్రకటించింది. అయితే ఈనెల 30న వాయుగుండం గా మారాక మరింత బలపడుతుందని చెప్పినా.. అది తుఫానుగా మారుతుందో లేదో స్పష్టత ఇవ్వలేదు. తుఫానుగా మారితే దీనికి ‘బురేవి’ (‘నివర్‌’ తర్వాతిపేరు) అని నామకరణం చేస్తా రు. వచ్చే నెల 5న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది తుఫానుగా మారితే ‘టకేటి’ అని నామకరణం చేస్తారు. 


శుక్రవారం జిల్లాల వారీగాసగటు వర్షపాతం (మిల్లీమీటర్లలో)

కడప               112.3

చిత్తూరు        104.2

నెల్లూరు        100.0

తూర్పుగోదావరి 87.7

పశ్చిమగోదావరి 76.7

గుంటూరు         73.8

కృష్ణా                73.8

ప్రకాశం                9.3

Updated Date - 2020-11-28T09:06:10+05:30 IST