మరో పరీక్ష

ABN , First Publish Date - 2020-11-18T05:43:49+05:30 IST

వస్తాయని తెలుసు, వచ్చే కాలమని తెలుసు. కానీ, ఇట్లా ముంచుకువస్తాయని అనుకోము. పోయిన నెలలో హైదరాబాద్‌లో కురిసిన కుండపోతల...

మరో పరీక్ష

వస్తాయని తెలుసు, వచ్చే కాలమని తెలుసు. కానీ, ఇట్లా ముంచుకువస్తాయని అనుకోము. పోయిన నెలలో హైదరాబాద్‌లో కురిసిన కుండపోతల విషయంలోనే కాదు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికల విషయంలోనూ అది నిజం. మంగళవారం పొద్దున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇట్లా కాలపట్టిక ప్రకటిస్తారని, బుధవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలై, మూడు రోజుల్లో ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. అభ్యర్థుల పరిశీలన, ఎంపిక మొదలైనవి తీరుబడిగా చేసుకునేందుకు ఇప్పుడు పెద్దగా సమయం లేదు. అంతా పదిహేడు రోజులలో సమాప్తం. 


దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఆ విధంగా రావడం, ఈ వేగానికి కారణమని అర్థమవుతూనే ఉన్నది. వచ్చే ఫిబ్రవరి పదోతేదీకి జిహెచ్ఎంసి గడువు ముగుస్తుంది. గడువు ముగియడానికి మూడు నెలల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి. కాబట్టి, నిబంధనలకు లోబడి ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 4న కాకుండా ఆ నెల చివరలోనో, లేదా జనవరి మధ్యలోనో జరుపుదామని మునుపు భావించి ఉండవచ్చు. గత నెలలో భారీవర్షాలకు నగరం వరదమయమై జనం ఇబ్బందులు పడ్డాక, ఈ చేదు జ్ఞాపకం మరుగున పడినతరువాతే ఎన్నికలు జరిపితే బాగుండునని ప్రభుత్వం భావించడం సహజం. వీలయినంత ఆలస్యంగా జరగాలని అనుకున్న ఎన్నికలు, వీలయినంత తొందరగా జరపవలసి రావడమే విశేషం. దుబ్బాకలో గెలిచి ఉత్సాహం మీద ఉన్న భారతీయ జనతాపార్టీ (బిజెపి)కి బల్దియా సమరానికి తగ్గట్టుగా బలాన్ని కూడగట్టుకునే వ్యవధి ఇవ్వకుండా, సుడిగాలి ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావించిందనిపిస్తుంది. ప్రమాదాన్ని ఎదుర్కొనడం కంటె, దాన్ని నివారించడం మేలు అని అధికారపార్టీ వ్యూహకర్తలు అనుకుని ఉండవచ్చు. అధికారంలో ఉన్న పార్టీకి ఉండే వెసులుబాటు, ఎన్నికల తేదీలను నిర్ణయించగలగడం. ఆ లోపు తన వరకు తాను సన్నద్ధతను పెంచుకోవడం. ఆ సదుపాయాన్ని టిఆర్ఎస్ పూర్తిగా, సమర్థంగా వినియోగించుకుంది. ఎన్నికలు ఆలస్యంగా జరగవచ్చుననే ప్రచారాన్ని అనుమతిస్తూ ప్రత్యర్థులు ఆదమరిచేట్టు చేసింది. హైకోర్టులో పడిన పిల్‌ను కొట్టివేసిన మరునాడే హఠాత్తుగా తేదీని వెల్లడయ్యేట్టు చేసింది. షెడ్యూలు ప్రకటనకు ముందు రెండు రోజుల నాడు ప్రభుత్వం అనేక కీలకమయిన వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. జిహెచ్ఎంసిలో గెలుపు టిఆర్ఎస్‌కు ప్రాణావసరం. 


గ్రామీణ నియోజకవర్గం అయిన దుబ్బాకలోనే సకల శక్తులు మోహరించి గెలవగలిగిన భారతీయ జనతాపార్టీకి జంటనగరాలు సులువైన రంగస్థలాలు అవుతాయని అంచనా వేయడంలో పొరపాటేమీ లేదు. ఆ పార్టీ వ్యూహానికి తగ్గట్టుగా ఉద్వేగాల మీద ఆధారపడడానికి జిహెచ్ఎంసిలో వీలు ఎక్కువ. అధికార తెలంగాణ రాష్ట్రసమితికి, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌కు ఉన్న మైత్రి బిజెపికి ఒక బలమైన విమర్శాంశం. ఎన్నికలు ఇంకా సమీపించకముందే, హైదరాబాద్ పేరు మార్చాలని ఒక నాయకుడు వివాదాన్ని రగిలించబోయాడు. అయితే, కేవలం ఉద్రేక భావాల వల్ల మాత్రమే విజయాలు సమకూరవు. కొంతకాలంగా బిజెపి, జంటనగరాలలో క్షేత్రస్థాయిలో పట్టు కోల్పోతున్న మాట వాస్తవం. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనం. ఎన్నికలు జరగవలసిన 150 డివిజన్లలో కొన్ని చోట్ల అభ్యర్థులు దొరకడం కూడా కష్టమని అంటున్నారు. టిఆర్ఎస్‌లో తిరిగి టికెట్ దొరకని ప్రస్తుత కార్పొరేటర్లు, కాంగ్రెస్‌లో ఉన్న బలమైన అభ్యర్థులు తమవైపు వస్తారన్న ఆశ బిజెపిలో ఉన్నది. దుబ్బాక ద్వారా ఏర్పడిన ఉత్సాహ వాతావరణంలో, అభ్యర్థులను సంపాదించుకోవడం, సమకూర్చుకోవడం బిజెపికి కష్టమేమీ కాదు, సరైన ఎంపికలకు, ఆచితూచి వ్యూహరచన చేయడానికి తగిన సమయం లేకపోవడం పెద్ద సమస్య. ఎన్నికల తేదీల ప్రకటన జరగగానే నగరంలోని బిజెపి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున జనసమ్మర్దం ఏర్పడిందంటే, అంచనాలను అర్థం చేసుకోవచ్చు. 


జిహెచ్ఎంసి ఎన్నికల గురించి మాట్లాడినప్పుడు, ప్రధాన ప్రత్యర్థులుగా టిఆర్ఎస్, బిజెపిలను గుర్తించడం, కాంగ్రెస్ పార్టీకి ఏమంత సౌకర్యంగా ఉండదు. నిజానికి, కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలమైన కార్యకర్తల శ్రేణి ఒకప్పుడు జంటనగరాలలో ఉండేది. ఇప్పటికీ ఆ పార్టీకి బలమైన స్థావరాలు ఉన్నాయి కానీ, అది జాతీయస్థాయిలో ప్రేరణారాహిత్యంతోను, తెలంగాణలో నాయకత్వ రాహిత్యంతోను బాధపడుతోంది. తన ఉనికిని గౌరవనీయమైన స్థాయిలో ఎంతవరకు నిలుపుకోగలదో కాంగ్రెస్‌కు ఒక సవాలే. 


పేరుకు మహానగరపాలక సంస్థ. తెలంగాణ అభివృద్ధి అంతా ఆధారపడిన నగరాభివృద్ధిపై ఈ స్థానిక సంస్థకు ఎటువంటి పట్టు లేదు. ఆస్తిపన్ను, లైసెన్సు ఫీజులు తప్ప ఆదాయం లేదు. మేయర్ ఉత్సవ విగ్రహమే తప్ప, కీలకమయిన నిర్ణయాలలో ఎటువంటి చొరవకూ ఆస్కారం లేదు. న్యూయార్క్, లండన్ వంటి మహానగరాలలో మేయర్లు అమితమైన అధికారాలను కలిగిఉంటారు. ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రులే హైదరాబాద్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటే, స్థానిక సంస్థల ఉనికికి అర్థమేమిటి? స్థానిక సంస్థ ఉండడం రాజ్యాంగ బద్ధ అనివార్యత కాబట్టి, భవిష్యత్ రాజకీయవాదులకు శిక్షణారంగంగా బల్దియా ఎన్నికలు పనికివస్తాయి కాబట్టి ఈ తతంగం. పౌరభాగస్వామ్యంతో నిజమైన ప్రజాస్వామిక వేదికగా జిహెచ్ఎంసి నిలబడగలిగే రోజుకోసం దీర్ఘకాలం నిరీక్షించవలసిందే!

Updated Date - 2020-11-18T05:43:49+05:30 IST