రిజర్వేషన్ల చరిత్రలో మరో మలుపు

ABN , First Publish Date - 2021-05-14T06:22:46+05:30 IST

విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లపై ఈ నెల 5న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలుస్తుంది. మహారాష్ట్రలో మరాఠాలకు కల్పించిన రిజర్వేషన్ల విషయంలో...

రిజర్వేషన్ల చరిత్రలో మరో మలుపు

విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లపై ఈ నెల 5న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలుస్తుంది. మహారాష్ట్రలో మరాఠాలకు కల్పించిన రిజర్వేషన్ల విషయంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వెలువరించిన ఆ తీర్పులో రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలపైన స్పష్టత ఇచ్చారు. ఈ తీర్పు మరాఠాల రిజర్వేషన్లను రద్దు చేయడం వరకే పరిమితం కాకుండా 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఏజెన్సీ ఏరియాలో 100 శాతం గిరిజన రిజర్వేషన్లు, తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్ల వంటి అంశాలను కూడా ప్రభావితం చేసే అవకాశం వుంది. 


కేంద్ర ప్రభుత్వం దేశమంతటా షెడ్యూల్డ్ కులాలకు 15శాతం, షెడ్యూల్డ్ తెగలకు 7.5శాతం మొత్తం 22.5శాతం చొప్పున విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అవి జనాభా ప్రాతిపదికన కల్పించబడిన సామాజిక రిజర్వేషన్లు. రాజ్యాంగం ప్రసాదించిన సామాజిక రిజర్వేషన్లు తరాల తరబడి పీడనకు వంచనకూ గురైన అణగారిన తరగతుల వారికి తాత్కాలిక ఊతంగా ఉపయోగపడుతున్నాయి. కాగా మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు 1992 నుండి ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వారికి 27శాతం రిజర్వేషన్లు కల్పించారు. దానితో మొత్తం రిజర్వేషన్లు 49.5 శాతానికి చేరినవి. దేశ జనాభాలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వారు 27 శాతం కంటే ఎక్కువే ఉంటారు. కానీ రిజర్వేషన్లు 50శాతం మించకూడదు అనే పరిమితి దృష్ట్యా ఈబీసీ జనాభాలో క్రీమీ లేయర్‍ని మినహాయించి 27శాతం మంది పేదలకే రిజర్వేషన్ సదుపాయాన్ని అనుమతించింది. అయితే 50శాతం గరిష్ఠ పరిమితి తొలగించాలని, ఇంకా చాలామందికి రిజర్వేషన్ సదుపాయాన్ని అనుమతించాలని కోరుతూ గడిచిన మూడు దశాబ్దాల కాలంలో వివిధ సందర్భాల్లో న్యాయస్థానాల్లో పలు వ్యాజ్యాలు నడిచినవి. వాటన్నింటిని సుప్రీం కోర్టు తోసిపుచ్చుతూ వచ్చింది. కాగా మరాఠా రిజర్వేషన్ల వ్యాజ్యం వాదనల్లో రిజర్వేషన్లపై గరిష్ఠ పరిమితిని పునఃపరిశీలించాలనే అభ్యర్థనను సుప్రీంకోర్టు మరింత విస్పష్టంగా తిరస్కరించింది. 


మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదంటూ ఇందిరా సాహ్ని కేసులో తొమ్మిదిమంది సభ్యుల ధర్మాసనం 1992లో యిచ్చిన తీర్పు రిజర్వేషన్ల విషయంలో చరిత్రాత్మక తీర్పుగా ప్రసిద్ధిగాంచింది. అనంతరం జరిగిన రాజ్యాంగ సవరణలు, సామాజికంగా వచ్చిన మార్పుల కారణంగా ఈ తీర్పును పరిశీలించాలన్న వాదనలు చాలా సందర్భాల్లో వచ్చాయి. అయినా ఆ తీర్పును బలపరుస్తూ కనీసం నాలుగు సందర్భాల్లో రాజ్యాంగ ధర్మాసనాల నిర్ణయాలు వెలువడినందున దీనిని మరోసారి పరిశించాల్సిన అవసరం లేదు. అందువలన పదకొండుమంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి పంపించాల్సిన పని లేదని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్త, జస్టిస్ రవీంద్ర భట్‍లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తిరస్కరించింది. ‘50 శాతం పరిమితిని తొలగిస్తే అది సమానత్వ ప్రాతిపదికన కాకుండా కుల ఆధారిత సమాజం ఆధారంగా తొలగించినట్టు అవుతుంది. రాజకీయ ఒత్తిళ్లతో రిజర్వేషన్లను పెంచుకుంటూ పొతే అసమానతలను తగ్గించడం కష్టమవుతుంది. పురోగమనం కాకుండా అందరూ వెనుకబాటుతనాన్ని కోరుకుంటే దేశంలో స్తబ్ధత ఏర్పడుతుంది. అది రాజ్యాంగ ఆశయాలకు విరుద్ధం’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ఒక్క రిజర్వేషన్లే సరిపోవని, ఇతర సంక్షేమ చర్యలు ఉండాలని సూచించింది. కాగా రిజర్వేషన్లకు అర్హతగల వెనుకబడిన తరగతుల అభివృద్ధిలో కాలానుగుణంగా ఏర్పడే హెచ్చుతగ్గులను బట్టి చేర్పులు మార్పులు చేయవచ్చు. అందుకు 102వ రాజ్యాంగ సవరణ ఎలాగూ ఉంది. అయితే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కులాలను నిర్ణయించే అధికారం మాత్రం రాష్ట్రపతికే (కేంద్రప్రభుత్వం) ఉండాలని చెప్పింది. అందుకోసం వెనుకబడిన వర్గాల జాతీయ కమీషన్ వేసి, అది చేసే సిఫార్సుల ఆధారంగానే చేయాల్సి ఉంటుందని వివరించింది. ఫలానా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ప్రతిపాదనలు చేయవచ్చు. కానీ తమకు తామే అమలు చేసుకొనే అధికారం రాష్ట్రాలకు లేదనే విషయాన్ని నొక్కి వక్కాణించింది. అందువల్లనే అది రిజర్వేషన్ల విషయంలో మరో చారిత్రక తీర్పుగా నిలుస్తుంది. 


విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పుతో ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన కొన్ని రిజర్వేషన్లు రద్దయ్యే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. వాటిలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్) పేరుతో అగ్రకులాలకు కల్పించిన 10శాతం రిజర్వేషన్లు ముందు వరుసలో ఉంటాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదనే చట్టాన్ని రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వమే ఉల్లంఘించడం ఏమిటనే వ్యాజ్యం సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది. తాజా తీర్పు నేపథ్యంలో 10శాతం రిజర్వేషన్లు ఎగిరిపోయే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏజన్సీ ఏరియాలో గిరిజనులకు కల్పించిన 100 శాతం రిజర్వేషన్లు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు (బీసీ-ఈ) కల్పించిన 4 శాతం రిజర్వేషన్లు కూడా 50 శాతం పరిమితిని అతిక్రమించినవే. అలాగే తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్ 12 శాతానికి పెంచాలనే ప్రతిపాదన కూడా ప్రశ్నార్థకమే. కాగా రాజస్థాన్‌లో గుజ్జర్లకు, హర్యానాలో జాట్‍లకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్యమాలు, ఆంధ్రప్రదేశ్‍లో కాపులకు రిజర్వేషన్లు కావాలనే డిమాండు మున్నగునవి వెనుకపట్టు పట్టే పరిస్థితి ఎదురవుతుంది. అయితే రిజర్వేషన్లపై స్పష్టత ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంత గొప్పదైనా దాని అమలు విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిజాయితీ, చిత్తశుద్ధి పైన ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కేంద్రంలోను, అనేక రాష్ట్రాల్లోను కులాల ఆసరాగా అధికారాలు నిలబెట్టుకుంటున్న ప్రభుత్వాలు ఉన్నందున సుప్రీం తీర్పు ఎలా అమలవుతుందో వేచి చూడాల్సిందే.

నాగటి నారాయణ

Updated Date - 2021-05-14T06:22:46+05:30 IST