మూడు నెలల ముచ్చటే.. YSRCPలో కీలక పదవికి మహిళా నేత రాజీనామా..!

ABN , First Publish Date - 2021-12-24T12:43:32+05:30 IST

మూడు నెలల ముచ్చటే.. YSRCPలో కీలక పదవికి మహిళా నేత రాజీనామా..!

మూడు నెలల ముచ్చటే.. YSRCPలో కీలక పదవికి మహిళా నేత రాజీనామా..!

చిత్తూరు జిల్లా/గుర్రంకొండ : గుర్రంకొండ ఎంపీపీ పదవికి నక్కా వెంకటలక్ష్మమ్మ రాజీనామా చేశారు. 13వ తేదీన జడ్పీ సీఈవోకు అందజేసిన ఆమె రాజీనామాను గురువారం ఆమోదించినట్లు ఎంపీడీవో గంగయ్య గురువారం తెలిపారు. నూతన ఎంపీపీ ఎన్నికయ్యే వరకూ వైస్‌ ఎంపీపీ బి.సరస్వతమ్మ ఇన్‌చార్జి ఎంపీపీగా కొనసాగుతారని తెలిపారు. ఎంపీపీ పదవిలో వెంకటలక్ష్మమ్మ మూడు నెలలు మాత్రమే కొనసాగడం వెనుక అధికార పార్టీ నేతల మధ్య ఒప్పందమే కారణమైంది. బీసీ మహిళకు కేటాయించిన ఎంపీపీ పదవిని అమిలేపల్లెకు చెందిన ఎస్‌. సీతమ్మకు ఇవ్వాలని ఎంపీ మిథున్‌రెడ్డి నిర్ణయించారు.


గత ఏడాది మార్చిలో జరిగిన ఆమెను సరిమడుగు ఎంపీటీసీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థినిగా నామినేషన్‌ వేయించారు. అయితే  పరిశీలన దశలోనే సీతమ్మ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో డమ్మీ అభ్యర్థి వెంకటలక్ష్మమ్మ ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 6 వైసీపీకి ఏకగ్రీవం కాగా నాల్గింటికి ఎన్నికలు జరిగాయి. 2 స్థానాలకు టీడీపీ, వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలనలోనే తిరస్కరణకు గురవడంతో ఎన్నికలు జరగలేదు. 


గుర్రంకొండ ఎంపీటీసీ-2లో ఎస్‌. సీతమ్మ ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచిన తరువాత ఎంపీపీగా నియమించేందుకు, అప్పటి వరకు వెంకటలక్ష్మమ్మ ఎంపీపీగా వుండేటట్లు వైసీపీ నేతలు ఒప్పందం కుదిర్చారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబరు నెలలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వెంకటలక్ష్మమ్మను ఎంపీపీగా ఎన్నుకొన్నారు. ఇది జరిగిన నెలకే గుర్రంకొండ ఎంపీటీసీ-1,-2 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.ఎంపీటీసీ-2 స్థానం నుంచి ఎస్‌.సీతమ్మ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఒప్పందం ప్రకారం సీతమ్మ  పదవి కోసం వెంకటలక్ష్మమ్మ రాజీనామా చేశారు. త్వరలో సీతమ్మ ఎంపీపీగా బాధ్యతలను చేపట్టనున్నారు.


Updated Date - 2021-12-24T12:43:32+05:30 IST