మరో తప్పుడు నిర్ణయం

ABN , First Publish Date - 2020-04-04T05:47:09+05:30 IST

దేశం యావత్తూ కరోనా భయంలో నిండా మునిగి, ఇళ్ళకు పరిమితమై ఉన్న కాలంలో, కశ్మీర్‌ విషయంలో కేంద్రం మరో అడుగు ముందుకు వేసి, స్థానికత నిర్వచనాన్ని తిరగరాసింది. మొన్నటివరకూ...

మరో తప్పుడు నిర్ణయం

దేశం యావత్తూ కరోనా భయంలో నిండా మునిగి, ఇళ్ళకు పరిమితమై ఉన్న కాలంలో, కశ్మీర్‌ విషయంలో కేంద్రం మరో అడుగు ముందుకు వేసి, స్థానికత నిర్వచనాన్ని తిరగరాసింది. మొన్నటివరకూ ఆ రాష్ట్రం చట్టాల్లో ఉన్న ‘పర్మెనెంట్‌ రెసిడెన్స్‌’ అన్న పదాన్ని కేంద్రం బుధవారం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ‘డొమిసైల్‌’గా మార్చింది. జమ్మూకశ్మీర్‌లో ఎవరైతే పదిహేనేళ్ళకు పైబడి నివసిస్తారో వారంతా ఇకపై స్థానికులే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, బ్యాంకులు ఇత్యాది సంస్థల్లో రాష్ట్రంలో పదేళ్లు పనిచేస్తే చాలు, వారు స్థానికులు కావడంతో పాటు వారి పిల్లలకు కూడా ఆ హోదా సహజంగానే దఖలుపడుతుంది. ఇలా గతంలో పనిచేసిన వారు కూడా స్థానికతను పొందవచ్చు. దేశంలోని మిగతా ప్రాంతాలకు చెందిన విద్యార్థుల విషయంలో కేంద్రం మరింత ఉదారంగా వ్యవహరించింది. ఏడేళ్ళపాటు అక్కడ చదువుకొని, పది లేదా పన్నెండో తరగతి పరీక్ష రాస్తే చాలు వారికి స్థానికత చేకూరుతుంది. ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ చూడగానే కశ్మీర్‌ నాయకులు చాలా మందికి పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్‌ అనుసరించిన వ్యూహం గుర్తొచ్చింది. 


ఎనిమిదినెలల క్రితం కశ్మీరీలతో, వారి నాయకులతో ఎటువంటి సంప్రదింపులు చేయకుండా, రాష్ట్రాన్ని ఒక్కసారిగా సైన్యంతో దిగ్బంధించి 370 అధికరణను, ఆర్టికల్‌ 35–ఎ ను రద్దుచేస్తూ దానిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చివేసిన గాయం ఇంకా మానకముందే కేంద్రం తీసుకున్న ఈ కొత్త నిర్ణయాన్ని కశ్మీరీ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆగ్రహంతో ఉన్న ప్రజలు లాక్‌డౌన్‌ కారణంగా రోడ్లమీదకు రావడం లేదు కానీ, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నవారిని మాత్రం పోలీసులు వెంటాడుతున్నారు. ఏడాది క్రితం వరకూ ఈ రాష్ట్రంలో బయటివారికి ఇక్కడి ఉద్యోగాలు అందుకొనే, భూములు పొందే అవకాశం లేని విషయం తెలిసిందే. మహారాజా హరిసింగ్‌ కాలం నాటి చట్టాలతో స్థానికతను నిర్వచించుకొనే హక్కు కూడా దానికే ఉండేది. కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన తరువాత, స్థానికతను తిరగరాసిన ఈ కొత్త నోటిఫికేషన్‌తో దేశంలోని అన్ని ప్రాంతాలవారూ క్రమంగా కశ్మీర్‌లో స్థిరపడేందుకు వీలుపడుతుంది. కశ్మీరీలకు నాలుగోతరగతి ఉద్యోగాల్లో మాత్రమే కోటా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పోలీసు డిపార్టుమెంట్‌లో కానిస్టేబుల్‌ మినహా మిగతా పై స్థాయి ఉద్యోగాలు, కశ్మీర్‌ యూనివర్సిటీల్లో హెచ్‌వోడీలు, ప్రొఫెసర్లు, డీన్‌లు, ప్రభుత్వ సెక్రటరీలు ఇంకా ఇలా అనేకానేక పదవులు ఇక బయటివారికే దక్కుతాయని అర్థం. ఒక్కముక్కలో చెప్పుకోవాలంటే, ఇంతకాలం కశ్మీరీలకే పరిమితమైన సర్కారీ వ్యవస్థలో ఇకపై స్థానికేతరులు నిండిపోవడానికి ఇది వీలుకల్పిస్తుంది. ఇక వలసదారులు పునరావాస కమిషనర్‌ వద్ద తమ పేర్లు రిజిస్టర్‌ చేసుకుంటే చాలు, కాలానికి సంబంధించిన పరిమితులేవీ వారికి వర్తించవు. ఇది ప్రధానంగా కశ్మీరీ పండిట్లను దృష్టిలో ఉంచుకొని చేసిన సవరణ అంటున్నారు. 


మానసికంగా ఎంతో దెబ్బతిని ఉన్న కశ్మీరీలమీద ప్రభుత్వం ప్రయోగించిన మరో అస్త్రం ఇది. 370 అధికరణ రద్దుతో ఇక, వెలుపలివారిని తరలించే పని ఆరంభమవుతుందనీ, తమ భూములు, వనరులు, ఉద్యోగాలు వారు తన్నుకుపోయి స్థానికులను మైనారీటులను చేసే కుట్ర జరుగుతుందని కశ్మీరీలు అనుమానించారు, భయపడ్డారు. కానీ, కశ్మీరీలకు వాస్తవాలు విప్పి చెప్పి, ఓదార్పు అందించే పేరిట కేంద్రమంత్రులు వరుసపెట్టి అక్కడ పర్యటనలు చేసి, అటువంటి దుష్ప్రచారాలు ఎంతమాత్రం నమ్మవద్దన్నారు. స్థానికత చట్టాలను తిరగదోడేది లేదనీ, ఎప్పటికీ కశ్మీరీలే స్థానికులని చెప్పివచ్చారు. కశ్మీరీలు ఆ హామీలు నమ్మినా లేకున్నా ఇప్పుడు ప్రభుత్వం చేసింది మాత్రం నమ్మకద్రోహమే. గతంలో స్థానికతను ధృవీకరించే అధికారం జిల్లా మేజిస్ట్రేట్‌కు మాత్రమే ఉంటే, ఇప్పుడు తహసీల్దార్‌ కూడా దానిని కట్టబెట్టారు. నాలుగో తరగతి ఉద్యోగాల్లో కోటా వినా, మిగతా అన్ని స్థాయి ఉద్యోగాల్లోనూ తాము అవకాశాన్ని కోల్పోవడం కశ్మీరీలకు ఆగ్రహాన్ని కలిగించక మానదు. కశ్మీర్‌ ఇంతకాలమూ ఎంతో కోల్పోయిందని ప్రసంగాలు దంచి, ఆగస్టు 5 నిర్ణయం వారి శ్రేయస్సు కోసమేనని నమ్మబలికిన కేంద్రపాలకులు, ఇప్పుడు రాష్ట్ర నాయకులంతా నిర్బంధంలో ఉండగా తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో తమ గత చర్యలన్నీ కశ్మీరీల ప్రయోజనం కోసం కాదని తేల్చిచెప్పేశారు. ఉన్న ఆ కాస్తంత సానుకూలత కూడా తుడిచిపెట్టేశారు.

Updated Date - 2020-04-04T05:47:09+05:30 IST