Abn logo
Sep 24 2021 @ 23:51PM

అంతా ప్రశాంతం

రాపూరు : ఎమ్మెల్యే ఆనం, ఎంపీపీ బాలకృష్ణారెడ్డిలకు గజమాలతో సత్కారం

కొలువుదీరిన మండల పాలకవర్గాలు

చిట్టకూరు, వింజమూరులలో వాయిదా 


నెల్లూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ నాయకుల మధ్య పొత్తు కుదరక చిట్టమూరులో, కోరం లేక వింజమూరులో ఎంపీపీ ఎన్నికలు వాయిదా.. ఈ రెండు ఘటనలు మినహా జిల్లాలోని అన్ని మండలాల్లో మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు  ఏకగ్రీవంగా, ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని మండల పరిషత కార్యాలయాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఒంట గంటకు ఎమ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం, ఆ తరువాత కో-ఆప్షన సభ్యుడి ఎన్నిక, 3 గంటలకు మండల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు  జరిగాయి. 


ఎమ్మెల్సీ ప్రయత్నం విఫలం


చిట్టమూరు : మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైసీపీ 11, టీడీపీ ఒక స్థానం గెలుచుకున్నాయి.  వీరిలో 8 మంది వైసీపీ మండల కన్వీనర్‌ సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి వర్గానికి చెందినవారు కాగా, ముగ్గురు దువ్వూరు శేషురెడ్డి వర్గానికి చెందినవారు. శేషురెడ్డి వర్గానికి చెందిన మల్లాం-1 ఎంపీటీసీ సభ్యురాలు త్రివేణి ఎంపీపీ అభ్యర్థినిగా వైసీపీ అధిష్ఠానం నుంచి బీఫారం తెచ్చుకున్నారు. అయితే, సన్నారెడ్డి వర్గీయులు తమ వర్గానికి చెందిన విజయలక్ష్మిని అధ్యక్షురాలిగా ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో అధ్యక్షుడి ఎన్నికపై ప్రతిష్టంభన ఏర్పడింది.  విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సన్నారెడ్డి మద్దతుదారులకు సూచించగా, వారు వ్యతిరేకించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఎమ్మెల్సీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధిష్ఠానం సూచన మేరకు అధికారులు ఎన్నికలు జరపకుండా కాలయాపన చేశారు. ఇంతలో వాకాడుకు చెందిన నేత భక్తవత్సలరెడ్డి  సన్నారెడ్డి వర్గాన్ని సమావేశ మందిరం నుంచి బయటికి తీసుకెళ్లడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కోరం లేక ఎంపీపీ ఎన్నికను వాయిదా వేశారు. 


వింజమూరులో నేటికి వాయిదా..


పల్లాల కొండారెడ్డి, వనికంట హైమావతిలు వర్గాలుగా విడిపోయి ఎంపీపీ పదవి కోసం ప్రయత్నించారు. కొండారెడ్డికి బీఫారం అందజేసిన అధిష్ఠానం విప్‌ జారీ చేయలేదు. దీంతో మెజారిటీ ఎంపీటీసీలు ఎన్నికలకు హాజరుకాలేదు. మొత్తం 12 మంది ఎంపీటీసీలు ఉండగా ఎంపీపీ ఎన్నికల కార్యక్రమానికి నలుగురు మాత్రమే హాజరయ్యారు. దీంతో మండల పరిషత అధ్యక్ష ఎన్నికలు కోరం లేక శనివారానికి వాయిదా వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసులు తెలిపారు. 


కోటలో నాటకీయంగా..


కోట : మండల పరిషత అధ్యక్షురాలుగా ఊనుగుంటపాళెం ఎంపీటీసీ సభ్యురాలు దాసరి అంజమ్మ  ప్రమాణ స్వీకారం చేశారు. వంజివాక ఎంపీటీసీ వెంబేటి శశి, కొక్కుపాడు ఎంపీటీసీ హిమబిందు ఎంపీపీ రేసులో ఉన్నారని, వారిలో ఒకరికే అవకాశఽం వస్తుందన్న ప్రచారం ముమ్మరంగా సాగింది. ఈ నేపథ్యంలో వైసీపీ సీఈసీ సభ్యుడు కొడవలూరు ధనంజయరెడ్డి హఠాత్తుగా దాసరి అంజమ్మను తెరపైకి తెచ్చారు. దీంతో సభ్యుల ప్రమాణస్వీకారోత్సవానికి నల్లప్పరెడ్డి వర్గం నుంచి ఎవరూ హాజరుకాలేదు. నేదురుమల్లి, పేర్నాటి, కొడవలూరు వర్గాలకు చెందిన నాయకులు హడావుడి చేశారు.