కరోనా సంక్షోభం.. భారత్‌ ముందున్న మూడు మార్గాలివే: ఫౌసీ

ABN , First Publish Date - 2021-05-04T17:44:24+05:30 IST

భారత్​లో కొనసాగుతున్న కరోనా సంక్షోభంపై అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు డా. ఆంథోనీ ఫౌసీ మరోసారి కీలక సూచన చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో భారీగా నమోదవుతున్న కేసులను తగ్గించేందుకు వెంటనే దేశవ్యాప్తంగా పూర్తి లాక్​డౌన్​ విధించాలని సూచించారు.

కరోనా సంక్షోభం.. భారత్‌ ముందున్న మూడు మార్గాలివే: ఫౌసీ

వాషింగ్టన్: భారత్​లో కొనసాగుతున్న కరోనా సంక్షోభంపై అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు డా. ఆంథోనీ ఫౌసీ మరోసారి కీలక సూచన చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో భారీగా నమోదవుతున్న కేసులను తగ్గించేందుకు వెంటనే దేశవ్యాప్తంగా పూర్తి లాక్​డౌన్​ విధించాలని సూచించారు. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని తెలిపారు. అలాగే కరోనా రోగుల కోసం చైనా మాదిరి తాత్కాలిక పద్ధతిలో ప్రత్యేక ఆస్పత్రులు నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. దీని కోసం సాయుధ దళాల సహాయం తీసుకోవాలని చెప్పారు. ఈ మూడు మార్గాలే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్‌ను మహమ్మారి సంక్షోభం నుంచి గట్టేక్కించగలవని ఫౌసీ వివరించారు. లేకపోతే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా వీటిని అమలు చేయాలని పేర్కొన్నారు.  


ఫౌసీ మాట్లాడుతూ.. "కరోనా వల్ల భారత్​లో పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయని అందరికి తెలుసు. రోజురోజుకూ కరోనా ఉధృతి పెరుగుతోంది. దీంతో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరుకున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దాంతో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సరిపడని దయనీయ పరిస్థితులు తలెత్తుతున్నాయి.​ ఇది భారత్‌లో కరోనా ఎంతటి విలయాన్ని సృష్టిస్తోందో తెలియజేస్తోంది. అందుకే ఈ ఆపత్కాలంలో భారత్​కు యావత్​ ప్రపంచం అండగా నిలవాలి. ఇక భారత్ తక్షణమే సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా ఆలోచించాలి. అలాగే వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేయాలి. దీంతో పాటు కరోనా రోగుల కోసం యుద్ధప్రాతిపదికన కొన్ని తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించడం బెటర్. ఈ మూడు మార్గాల ద్వారా కొన్ని వారాల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది." అని చెప్పుకొచ్చారు. ఇక విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు పలు దేశాలకు భారత్ సాయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఫౌసీ గుర్తు చేశారు. ఇప్పుడు భారత్ సంక్షోభంలో ఉన్నందున ప్రపంచ దేశాలు తమకు తోచిన సాయం చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2021-05-04T17:44:24+05:30 IST