ఈ ఏడాది చివరినాటికి 3 లక్షల మరణాలు: ఫౌసీ

ABN , First Publish Date - 2020-11-25T00:13:29+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా వైరస్ గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ యూఎస్‌లో కొవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతుండడం ఆరోగ్యశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఈ ఏడాది చివరినాటికి 3 లక్షల మరణాలు: ఫౌసీ

కరోనా విలయం ఇలాగే కొనసాగితే.. 3 లక్షల మరణాలు: ఆంథోనీ ఫౌసీ 

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా వైరస్ గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ యూఎస్‌లో కొవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతుండడం ఆరోగ్యశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అలాగే మరణాలు కూడా క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. ఈ నేపథ్యంలో అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా విలయం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి మరణాలు 3 లక్షలకు చేరుతాయని వెల్లడించారు. "ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య రెండున్నర లక్షలకు పైగా ఉంది. గడిచిన నెల రోజుల నుంచి ప్రతిరోజు వెయ్యి నుంచి 2 వేల కొవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ఉధృతి ఇలాగే కొనసాగితే ఏడాది చివరి నాటికి కరోనా మరణాలు 3 లక్షలకు చేరుతాయని" ఫౌసీ అన్నారు. 


కానీ, అగ్రరాజ్యానికి ఈ గణాంకాలను అదుపులోకి తేచ్చే సత్తా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి ప్రజలు తోడ్పాటు కావాలని తెలిపారు. జనాలు సామాజిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్‌లు ధరించడం వంటి కొవిడ్ నిబంధనలను తూచ తప్పకుండా పాటిస్తే మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందన్నారు. దీని ద్వారా ఆటోమేటిక్‌గా కొత్త కేసులు తగ్గుతాయని, అదే సమయంలో మరణాలు కూడా తగ్గిపోతాయని ఫౌసీ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే... అమెరికాలో కరాళ నృత్యం చేస్తున్న కరోనా ఇప్పటికే 2.63 లక్షల మందిని కబళించింది. కోటి 27 లక్షల మందికి సోకింది. 



Updated Date - 2020-11-25T00:13:29+05:30 IST