ట్రంప్‌కు ఆంథోనీ ఫౌచీ అభ్యర్థన !

ABN , First Publish Date - 2021-03-16T16:52:58+05:30 IST

అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ దేశానికి కొవిడ్-19 కొత్త వేవ్ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.

ట్రంప్‌కు ఆంథోనీ ఫౌచీ అభ్యర్థన !

ట్రంప్.. మీ మద్దతుదారులకు ఆ విషయం చెప్పండి: ఆంథోనీ ఫౌచీ

వాషింగ్టన్: అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ దేశానికి కొవిడ్-19 కొత్త వేవ్ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫౌచీ ఓ అభ్యర్థన చేశారు. ఆయన మద్దతుదారులను తప్పకుండా టీకా వేసుకోవాలని సూచించాలంటూ అభ్యర్థించారు. ఆదివారం ప్రముఖ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఫౌచీ.. యూరోపియన్ యూనియన్ దేశాల్లో మహమ్మారి విజృంభణను గుర్తు చేశారు. యూరప్‌లో ఉనికిని చాటిన కొన్ని వారాల తర్వాత యూఎస్‌లో కూడా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందడం ఇంతకుముందు జరిగిందని తెలిపారు. ఇప్పుడు కూడా అదే జరగబోతుందని ఆయన జోస్యం చెప్పారు. కనుక ఈ సమయంలో మహమ్మారిపై పైచేయి సాధించినట్లు ప్రకటించడం మంచిది కాదన్నారు. ఇప్పటికీ ఇంకా కరోనా ప్రభావం పూర్తిగా తొలిగిపోలేదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే మరోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. 


ఇక వ్యాక్సినేషన్‌పై దేశంలో కొనసాగుతున్న నిరాసక్తత చాలా ప్రమాదకరం అన్నారు. ప్రధానంగా రిపబ్లికన్స్ ఈ విషయంలో చాలా ఆశ్రద్ధగా ఉన్నట్లు ఫౌచీ పేర్కొన్నారు. అందుకే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ సందర్భంగా ఓ అభ్యర్థన చేశారు. మీ మద్దతుదారులను టీకా వేయించుకోవాల్సిందిగా కోరాలని ట్రంప్‌కు ఫౌచీ అభ్యర్థించారు. చాలా మంది రిపబ్లికన్స్ బహిరంగంగానే తాము వ్యాక్సిన్ వేసుకోబోమని ప్రకటించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. మహమ్మారి నుంచి మనల్ని రక్షించేది కేవలం టీకా మాత్రమేనని ఈ సందర్భంగా ఫౌచీ స్పష్టం చేశారు. కనుక వ్యాక్సిన్ విషయంలో అలసత్వం ప్రదర్శించొద్దని దేశ ప్రజలను విన్నవించారు.  

Updated Date - 2021-03-16T16:52:58+05:30 IST