వరంగల్‌ జిల్లాలో ఆంత్రాక్స్‌ కలకలం

ABN , First Publish Date - 2021-10-27T08:11:02+05:30 IST

వరంగల్‌ జిల్లాలో ఆంత్రాక్స్‌ వ్యాధి కలకలం రేపుతోంది. నాలుగు రోజులుగా దుగ్గొండి మండలం చాపలబండంలో పశువుల కాపరి గడల సాంబయ్యకు చెందిన నాలుగు గొర్రెలు రక్తం కక్కుతూ మృతి చెందాయి. ఉమ్మడి వరంగల్‌ ..

వరంగల్‌ జిల్లాలో ఆంత్రాక్స్‌ కలకలం

  • చాపలబండలో మాట్లాడుతున్న జేడీ బాలకృష్ణ, ఏడీ నాగమణి 
  • దుగ్గొండి మండలంలో గొర్రెలకు సోకిన వ్యాధి
  • రక్తం కక్కుతూ చనిపోతున్న మూగజీవాలు
  • ఆ గొర్రెలను ముట్టుకుంటే మనుషులకు వ్యాప్తి 
  • అయినా ఆందోళన అవసరం లేదు : ఏడీ నాగమణి


వరంగల్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లాలో ఆంత్రాక్స్‌ వ్యాధి కలకలం రేపుతోంది. నాలుగు రోజులుగా దుగ్గొండి మండలం చాపలబండంలో పశువుల కాపరి గడల సాంబయ్యకు చెందిన నాలుగు గొర్రెలు రక్తం కక్కుతూ మృతి చెందాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లి, రేగొండ మండలాల్లో గతంలో ఈ వ్యాధి వెలుగు చూసింది. గొర్రెల కొనుగోలు పథకం కింద వాటిని కొనుగోలు చేసే సమయంలో చిత్తూరు, తమిళనాడు నుంచి ఆంత్రాక్స్‌ బ్యాక్టీరియా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు వ్యాప్తి చెందిందని పశువైద్య సహాయ సంచాలకురాలు (ఏడీ) బి.నాగమణి తెలిపారు. ఆంత్రాక్స్‌తో గొర్రెలు చనిపోతుండడం, ఇది మనుషులకు సోకుతుందనే ప్రచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చనిపోయిన గొర్రెలను తాకకూడదని, అవి మేత కోసం తిరిగిన ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల మేర శానిటేషన్‌ చేస్తామని పశు వైద్య నిపుణులు పేర్కొన్నారు. కాగా, మంగళవారం పశువైద్య నిపుణులు, జేడీ బాలకృష్ణ, ఏడీ నాగమణిలు మృతి చెందిన గొర్రెల నుంచి రక్తం నమునాలను సేకరించి, హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. ‘‘గొర్రెలకు ఆంత్రాక్స్‌ వ్యాధి సోకుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


ఆంత్రాక్స్‌ ఉన్న గొర్రెలను ముట్టుకుంటే మాత్రం వ్యాధి సోకుతుంది. వ్యాధి వెలుగు చూసిన గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల మేర శానిటేషన్‌ చేశాం. చనిపోయిన గొర్రెలను గ్రామానికి దూరంగా గొయ్యి తీసి పాతిపెడుతున్నాం. వ్యాధి నివారణకు ప్రతి 9 నెలలకోసారి చొప్పున ఐదేళ్ల పాటు గొర్రెలకు టీకాలు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాపలబండలోని గొర్రెలన్నింటికీ టీకాను వేస్తున్నాం. ప్రజలకు సోకే అవకాశం చాలా తక్కువ. అంగడీలో గొర్రెలను కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని నాగమణి వివరించారు.

Updated Date - 2021-10-27T08:11:02+05:30 IST