మీ వాచీలోని అంకెలు ఉన్నట్టుండి తారుమారైతే, ముల్లులు రివర్స్‌లో తిరిగితే... ఊహించుకోండి.. గోండ్వానా వాచీల రహస్యమిదే!

ABN , First Publish Date - 2021-10-30T17:35:06+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో జరుగుతున్న..

మీ వాచీలోని అంకెలు ఉన్నట్టుండి తారుమారైతే, ముల్లులు రివర్స్‌లో తిరిగితే... ఊహించుకోండి.. గోండ్వానా వాచీల రహస్యమిదే!

ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో జరుగుతున్న ఆదివాసీ మహోత్సవంలో రకరకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటిలోని ఒక స్టాల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ స్టాల్‌లోని వాచీలను చూసినవారంతా అవాక్కవుతున్నారు. ఆదివాసీ గోండ్వానా సమాజం సభ్యులు తయారు చేసిన ఈ వాచీలు సాధారణ వాచీలకు భిన్నంగా ఉంటాయి. ఈ వాచీలలోని ముల్లులు రివర్స్‌లో తిరుగుతుంటాయి. ఈ వాచీలోని అంకెలు కూడా ఎడమ నుంచి కుడివైపునకు ఉంటాయి. ముల్లులు కూడా అదే రీతిలో తిరుగుతుంటాయి. యాంటీ క్లాక్ వైజ్‌లో ఇవి పనిచేస్తుంటాయి.  


ఇటువంటి వాచీల రూపకల్పన వెనుక ఆదివాసీ సంస్కృతి రహస్యాలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. గోండ్వానా సమాజానికి చెందిన వారంతా  ఈ తరహా వాచీలనే వినియోగిస్తుంటారు. ఈ స్టాల్ నిర్వాహకుడు బసంత్ పర్త్ మీడియాతో మాట్లాడుతూ ఈ వాచీలను తాము గోండ్వానా టైమ్స్ పేరుతో పిలుస్తుంటామన్నారు. ఆంగ్లేయులు రూపొందించిన కుడి నుంచి ఎడమకు ముల్లులు తిరిగే వాచీలను గోండ్వానా సమాజంలోని వారు వ్యతిరేకిస్తారని, అందుకే దీనికి వ్యతిరేక దిశలో పనిచేసే వాచీలను వినియోగిస్తామని తెలిపారు. ఈ గోండ్వానా వాచీలను ప్రత్యేకంగా తయారు చేస్తారన్నారు. ప్రకృతి నియమాలను అనుసరించి ఈ వాచీల రూపకల్పన జరిగిందని, భూమి కూడా ఎడమ నుంచి కుడివైపునకు తిరుగుతుంటుందన్నారు. ఇదేవిధంగా సూర్యచంద్రులు, నక్షత్రాలు కూడా తిరుగుతుంటాయన్నారు. గోండ్వానా ఆదివాసీయులు తమ ఇంట జరిగే వివాహాలలో.. వధూవరులు ఎడమ నుంచి కుడివైపునకు తిరుగుతారన్నారు.



Updated Date - 2021-10-30T17:35:06+05:30 IST