యాంటీ వైరస్ సృష్టికర్త జాన్ మెక్‌ఎఫీ అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-06-24T18:11:20+05:30 IST

మెక్‌ఎఫీ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ సృష్టికర్త జాన్ మెక్‌ఎఫీ

యాంటీ వైరస్ సృష్టికర్త జాన్ మెక్‌ఎఫీ అనుమానాస్పద మృతి

బార్సిలోనా : మెక్‌ఎఫీ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ సృష్టికర్త జాన్ మెక్‌ఎఫీ (75) బార్సిలోనాలోని ఓ జైలు గదిలో బుధవారం అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. 


అంతకుముందు ఓ స్పానిష్ కోర్టు ఇచ్చిన తీర్పులో పన్ను ఎగవేత ఆరోపణలపై విచారణను ఎదుర్కొనేందుకు జాన్ మెక్ఎఫీని అమెరికాకు అప్పగించవచ్చునని  చెప్పింది. ఆయన తన ఆదాయంపై పన్ను చెల్లించడంలో విఫలమైనట్లు గత ఏడాది అక్టోబరులో టెనెసీలో కేసు నమోదైంది. ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు నమోదయ్యాయి. ఆయనను స్పెయిన్‌లో గత ఏడాది అక్టోబరులో అరెస్టు చేశారు. అమెరికాకు అప్పగించడంపై తీర్పు కోసం ఆయన ఎదురు చూశారు. 


స్పానిష్ మీడియా కథనాల ప్రకారం, జాన్ మెక్ఎఫీ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలనుబట్టి తెలుస్తోంది. ఆయన 1987లో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మెక్ఎఫీని స్థాపించారు. ఆయన ఆ కంపెనీ నుంచి 1994లో వైదొలగారు. ఈ సంస్థను ఇంటెల్ 2010లో కొనుగోలు చేసింది. 


తన ఇరుగు పొరుగున నివసించే గ్రెగరీ ఫౌల్ మరణానికి సంబంధించిన కేసులో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో మెక్ఎఫీ దేశం విడిచి పారిపోయారు. బెలిజ్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, తన ప్రాణాలకు ముప్పు ఉందనే భయంతో తాను దేశం నుంచి వెళ్ళిపోయానని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. సెంట్రల్ అమెరికా ఈశాన్య తీరంలో బెలిజ్ దేశం ఉంది. 


Updated Date - 2021-06-24T18:11:20+05:30 IST