67% జనాభాలో యాంటీబాడీలు

ABN , First Publish Date - 2021-07-21T07:11:02+05:30 IST

దేశంలో ఆరేళ్లు ఆపై వయసు పైబడినవారిలో.. 67.6 శాతం జనాభాలో కొవిడ్‌ ప్రతినిరోధకాలు (యాంటీబాడీలు) ఉన్నట్లు ఐసీఎంఆర్‌ నాలుగో సీరో సర్వేలో తేలింది.

67% జనాభాలో యాంటీబాడీలు

  • 6-17 ఏళ్లలోపు పిల్లలు 50% మందిలోనూ..
  • ఐసీఎంఆర్‌ నాలుగో సీరో సర్వే ఫలితాల వెల్లడి
  • ఇంకా 40 కోట్ల మందికి కరోనా ముప్పు
  • జూన్‌- జూలై మధ్య 70 జిల్లాల్లో సర్వే
  • ఫలితాలు ఆశాజనకమైనా అజాగ్రత్త తగదు
  • 2 డోసులూ తీసుకుంటేనే ప్రయాణాలు: కేంద్రం


న్యూఢిల్లీ, జూలై 20: దేశంలో ఆరేళ్లు ఆపై వయసు పైబడినవారిలో.. 67.6 శాతం జనాభాలో కొవిడ్‌ ప్రతినిరోధకాలు (యాంటీబాడీలు) ఉన్నట్లు ఐసీఎంఆర్‌ నాలుగో సీరో సర్వేలో తేలింది. జూన్‌-జూలై నెలల్లో 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వే వివరాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. దేశ జనాభాలోని ప్రతి ముగ్గురికి గాను ఇద్దరిలో యాంటీబాడీలున్నట్లు పేర్కొంది. ఇంకా 40 కోట్ల మందికి (ప్రతి ముగ్గురిలో ఒకరికి) వైరస్‌ ముప్పు ఉందని స్పష్టం చేసింది. ఈ విడతలో పిల్లలపైనా అధ్యయనం చేశారు. దీంట్లో 50 శాతం మందికి పైగా 6 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో యాంటీబాడీలున్నట్లు వెలుగులోకి రావడం గమనార్హం. ఈ సర్వేలో పిల్లలను రెండు వయో విభాగాలు (6-9, 10-17)గా విభజించారు. 6-9 ఏళ్ల మధ్యవారిలో 57.2 శాతం, 10-17 ఏళ్ల నడుమ వారిలో 61.6 శాతం సీరో ప్రివలెన్స్‌ను గుర్తించారు. కాగా, 28,975 మంది సాధారణ ప్రజలు, జిల్లాకు వందమంది చొప్పున 7,252 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ విడత పరిశీలన సాగించారు. 85 శాతం మంది ఆరోగ్య కార్యకర్తల్లో ప్రతినిరోధకాలు ఉన్నట్లు తేలింది. వయసుల వారీగా చూస్తే.. 45-60 ఏళ్ల మధ్య వారిలో అత్యధిక సీరో ప్రివలెన్స్‌ (77.6 శాతం) ఉన్నట్లు కేంద్రం తెలిపింది. 60 ఏళ్లు దాటినవారిలో 76.7 శాతం, 18-44 ఏళ్ల వారిలో 66.7 శాతం సీరో ప్రివలెన్స్‌ ఉన్నట్లు వివరించింది. కాగా, సీరో ప్రివలెన్స్‌ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మరిన్ని వేవ్‌లు వచ్చే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. టీకా తీసుకోనివారిలో సీరో ప్రివలెన్స్‌ 62.3 శాతం ఉంటే, ఒక డోసు పొందినవారిలో 81 శాతం, రెండు డోసులూ వేసుకున్నవారిలో 89.8 శాతంగా ఉందని పేర్కొంది.


కొవిడ్‌ నిబంధనలను మరవొద్దు

తాజా సర్వే ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. కరోనా నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దని ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ బలరాం భార్గవ హెచ్చరించారు. జనం గుంపుగా చేరే సామాజిక, మతపర, రాజకీయ కార్యక్రమాలను కచ్చితంగా నివారించాలని కేంద్రం స్పష్టం చేసింది. అత్యవసరం కాని ప్రయాణాలను మానుకోవాలని ప్రజలకు సూచించింది. టీకా రెండు డోసులు తీసుకుంటే ప్రయాణం చేయొచ్చని పేర్కొంది. కాగా, ‘‘పిల్లల్లో వైరస్‌ గ్రాహకాలైన ఏస్‌ రిసెప్టర్లు తక్కువగా ఉంటాయి. దీనివల్ల వైరస్‌ సోకే ప్రమాదం తక్కువ. కాబట్టి సిబ్బంది అందరికీ టీకా వేసిన తర్వాత ప్రాథమిక పాఠశాలలను తెరవొచ్చు’’ అని ఐసీఎంఆర్‌ పేర్కొంది.


మిజోరంలో 150 మంది పిల్లలకు కరోనా

మిజోరంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్క రోజే 150 మంది పైగా పిల్లలకు పాజిటివ్‌ వచ్చింది. కాగా, దేశంలో సోమవారం 30,093 కేసులు నమోదయ్యాయి. ఆదివారం పరీక్షలు (14.63 లక్షలు) తక్కువగా చేయడంతో.. దానికితగ్గట్లే కేసులు వచ్చాయి. మరో 374 మంది చనిపోయారు. యాక్టివ్‌ కేసులు 4.06 లక్షలకు తగ్గాయి. గుజరాత్‌ బనస్కాంత జిల్లాలోని బెటాలియన్‌లో రెండు వారాల్లో 433 మంది బీఎ్‌సఎఫ్‌ జవాన్లకు పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రాల వద్ద 2.11 కోట్ల టీకాలు నిల్వ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 42.15 కోట్ల టీకాలు ఇవ్వగా.. వృథాతో కలిపి 40.03 కోట్ల టీకాలు వినియోగమైనట్లు చెప్పింది.


దేశంలో తొలి డబుల్‌ వేరియంట్‌ కేసు 

దేశంలో తొలి డబుల్‌ వేరియంట్‌ (ఒకే రోగికి రెండు కరోనా వేరియంట్లు సోకడం) కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆల్ఫా బారినపడి కోలుకున్న అసోంలోని దిబ్రూగఢ్‌కు చెందిన మహిళా వైద్యురాలికి మేలో డెల్టా నిర్ధారణ అయింది. ఈమెకు టీకా రెండు డోసులు పొందిన నెలకు రెండోసారి వైరస్‌ సోకింది. నమూనాల జన్యు విశ్లేషణ అనంతరం వివరాలను తాజాగా వెల్లడించారు. జనవరిలో బ్రెజిల్‌లో ఒకరు, పోర్చుగల్‌లో 17 ఏళ్ల వ్యక్తి, బెల్జియంలో 90 ఏళ్ల వృద్ధురాలు డబుల్‌ వేరియంట్‌ బారినపడ్డారు.

Updated Date - 2021-07-21T07:11:02+05:30 IST