శ్రీవారి ఆలయ భద్రతకు యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌

ABN , First Publish Date - 2021-07-24T06:43:16+05:30 IST

తిరుమల భద్రతను పటిష్ఠం చేయడంలో భాగంగా యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది.

శ్రీవారి ఆలయ భద్రతకు యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌
యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌

తిరుమల, జూలై 23(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల పుణ్యక్షేత్ర భద్రతను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగా టీటీడీ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల డ్రోన్‌ ద్వారా ఉగ్రదాడులు జరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన టీటీడీ తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటక లోని కోలార్‌లో డీఆర్డీవో నిర్వహించిన యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ ప్రదర్శనకు టీటీడీ విజిలెన్స్‌ విభాగం కూడా హాజరైంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ భద్రతా దళాలతో పాటు ప్రదర్శనలో పాల్గొన్న ఏకైక ధార్మిక సంస్థ టీటీడీ కావడం గమనార్హం.దాదాపు రూ.25 కోట్ల విలువ కలిగిన యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను తిరుమలలో కూడా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై ఇప్పటికే చర్చ మొదలైంది. దాదాపు 4 కిలోమీటర్ల ఎత్తు, మూడు కిలోమీటర్ల పరిధిలో ఎగిరే వాటిని యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ గుర్తిస్తుంది. తొలుత ‘సాఫ్ట్‌కిల్‌’ ద్వారా జీపీఎస్‌ను డీయాక్టివేట్‌ చేయడంతో పాటు ఎనిమీ డ్రోన్‌ డైరెక్షన్స్‌ మారిపోయేలా చేస్తుంది. తర్వాత దశలో ‘హార్డ్‌కిల్‌’ ద్వారా టార్గెట్‌ను నాశనం చేస్తుంది.యాంట్రీ డ్రోన్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తే  భవిష్యత్తులో ఆలయ భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉందని టీటీడీ భావిస్తోంది.త్వరలో ఈ అంశంపై చర్చించి భారత్‌ ఎలక్ర్టానిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ ద్వారా డీఆర్డీవో నుంచి యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను కొనుగోలు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-07-24T06:43:16+05:30 IST