మనం ఎక్కడ తినబోతున్నాం.. ఈ ఒక్క మాటతో నెట్టింట వైరల్‌గా మారిన ఈ పిల్లాడి గురించి చేదువార్త..!

ABN , First Publish Date - 2021-11-24T00:29:50+05:30 IST

ఇంటర్నెట్‌లో ఎందరో అభిమానులను సంపాదించుకున్న చిన్నారి కన్నుమూత.. కన్నీరుమున్నీరు అవుతున్న నెటిజన్లు

మనం ఎక్కడ తినబోతున్నాం.. ఈ ఒక్క మాటతో నెట్టింట వైరల్‌గా మారిన ఈ పిల్లాడి గురించి చేదువార్త..!

ఇంటర్నెట్ డెస్క్: మనం ఎక్కడ తినబోతున్నాం..? కొన్నాళ్ల క్రితం చిన్నారి ఆంట్వెయిన్ ఫౌలర్(6) అన్న మాటలు ఇవి.  అతడి ముద్దుముద్దు మాటలు విని ప్రపంచమే మురిసిపోయింది. ఆ చిన్నారి వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. అదే కాదు.. ఆంట్వెయిన్‌కు చెందిన అనేక ఫన్నీ వీడియోలు ఇంటర్నెట్‌లో సెన్సేషన్ సృష్టించాయి. లక్షల మంది ఆ చిన్నారి యూట్యూబ్ ఛానల్‌ను ఫాలో అవుతుంటారు.  కానీ.. అతడు ఇటీవలే కన్నుమూశాడు. దీంతో.. నెటిజన్లు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆరేళ్ల వయసులోనే అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినందుకు కన్నీరు మున్నీరవుతున్నారు.  అతడి మరణవార్తను ఆంట్వెయిన్ తల్లి చైనా ఆదివారం తెలియజేశారు.  ‘‘ఇటువంటి వేదన నాకింతకముందు తెలియదు. ఛాతిని చీల్చి గుండెను బయటకు తీసినట్టుంది. భరించలేకపోతున్నాను’’ అంటూ ఆమె తన బాధను ఆంట్వెయిన్ ఇన్‌స్టా అకౌంట్ ద్వారా పంచుకున్నారు.  


ఆంట్వెయిన్‌ది అమెరికా. ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామీ నగరం అతడి స్వస్థలం. గత కొన్నేళ్లుగా అతడు ఆటోఇమ్యూన్ ఎంటిరోపతీ అనే జన్యు సంబంధిత వ్యాధితో పోరాడుతూ ఇటీవలే మృతి చెందాడు. 2015లో అతడికి ఈ వ్యాధి ఉన్నట్టు బయటపడింది. అయితే.. ఓ రోజున అతడు ‘మనం ఎక్కడ తినబోతున్నాం’ అంటూ అడుగుతుండగా రికార్డు చేసిన అతడి తల్లి ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ చిన్నారి రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయాడు. ఆంట్వెయిన్‌ ముద్దుమాటలు విన్న అనేక మంది అతడికి ఫాలోవర్లుగా మారిపోయారు. ‘‘నాకు చీజ్ తినాలని ఉంది. ఇక్కడ ఉందా..’’ అంటూ అతడు అడిగిన వీడియో కూడా నెట్టింట్లో బాగా పాపులర్ అయింది. ఆంట్వెయిన్ యూట్యూబ్ ఛానల్‌ను 2.4 లక్షల పైచిలుకు మంది ఫాలోఅవుతుంటారు. ఇక సోషల్ మీడియాలోనూ అదే స్థాయిలో ఆంట్వెయిన్‌కు అభిమానులున్నారు.


చిన్నప్పటి నుంచీ ఈ వ్యాధితో పోరాడుతున్న ఆంట్వెయిన్‌కు గత ఐదేళ్లలో ఏకంగా 25 ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. అతడు ఎన్నిసార్లు ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చిందో లెక్కేలేదని ఆంట్వెయిన్‌ తల్లి పేర్కొన్నారు. ఈ వ్యాధి ఉన్న వాళ్లు ఆహారంలోని విటమిన్లు, ఇతర పౌష్టికపదార్థాలను శరీరంలోకి గ్రహించలేరు. అంతేకాకుండా.. రోగులకు తరచూ నీళ్ల విరేచనాలతో సతమతమవుతుంటారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఆంట్వెయిన్ చేసిన పోరాటాన్ని అతడి తల్లి వివిధ సోషల్ మీడియా వేదికల్లో పంచుకున్నారు. వైద్య ఖర్చుల కోసం ఆమె ‘గోఫండ్‌మీ’ ద్వారా విరాళాలు సేకరించారు. ప్రజలు పెద్ద ఎత్తున స్పందించడంతో ఏకంగా ఆంట్వెయిన్‌ చికిత్సకు 60 వేల డాలర్లు విరాళాల రూపంలో వచ్చి పడ్డాయి. కానీ.. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోవడంతో చిరుప్రాయంలోనే ఆంట్వెయిన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ‘‘అమాయకమైన ముద్దుమాటలతో మా జీవితాల్లో ఆనందం నింపిన నువ్వు అప్పుడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా’’ అంటూ ప్రస్తుతం అనేక మంది కన్నీరు కారుస్తున్నారు. మరి కొంత మంది ఆంట్వెయిన్‌ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ అతడి వీడియోల్లో తమకు నచ్చినవి మళ్లీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. 



Updated Date - 2021-11-24T00:29:50+05:30 IST