అనుకున్నది ఒక్కటి... అయినది ఒక్కటి

ABN , First Publish Date - 2021-07-31T04:45:01+05:30 IST

అనుకున్నది ఒక్కటి... అయినది ఒక్కటిగా....

అనుకున్నది ఒక్కటి... అయినది ఒక్కటి
నగర పంచాయతీ వైస్‌చైర్మన్‌-2గా ఎంపికైన కాతా దీపికను అభినందిస్తున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి

- ఊహించని విధంగా వైస్‌చైర్మన్‌-2గా దీపిక ఎంపిక


గిద్దలూరు టౌన్‌, జూలై 30 : అనుకున్నది ఒక్కటి... అయినది ఒక్కటిగా గిద్దలూరు నగర పంచాయతీ వైస్‌చైర్మన్‌-2 ఎంపిక జరిగింది. నగర పంచాయతీ పరిధిలోని 19వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన కాతా దీపికను వైస్‌చైర్మన్‌-2గా ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించడంతో ఆమె శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. దీపిక చేత మార్కాపురం ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి ప్రమాణం చేయించారు. గిద్దలూరు నగర పంచాయతీ 2వ వైస్‌చైర్మన్‌ పదవిపై ఉత్కంఠ నెలకొన్నది. పలువురు కౌన్సిలర్లు పీఠం దక్కించుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేశారు. ఈనెల 30న రెండో వైస్‌చైర్మన్‌ ఎన్నికలు నిర్వహించనున్నారని ప్రభుత్వం ప్రకటించడంతో పలువురు పావులు కదిపారు. గతంలో చైర్మన్‌తోపాటు ఒక వైస్‌చైర్మన్‌ మాత్రమే ఉండేవారు. కొత్త ప్రభుత్వం ఇద్దరు వైస్‌చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 10న నగర పంచాయతీ ఎన్నికలు జరుగగా 14న ఓట్ల లెక్కింపు జరిగింది.


గిద్దలూరు పట్టణంలో 20 వార్డులు ఉండగా 17 వార్డులలో వైకాపా అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. మార్చి 18న చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక జరుగగా చైర్మన్‌గా ఊహించని విధంగా 16వ వార్డు కౌన్సిలర్‌ పాముల వెంకటసుబ్బయ్య, వైస్‌చైర్మన్‌గా 1వ వార్డు కౌన్సిలర్‌ ఆర్‌.డి.రామకృష్ణ ఎన్నికయ్యారు. తాజాగా శుక్రవారం రెండో వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిర్వహించి దీపికను ఎంపిక చేశారు. అయితే మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన నాటి నుంచి వైస్‌చైర్మన్‌గా 5వ వార్డు కౌన్సిలర్‌ పరుచూరి సుభాషినిని నియమిస్తున్నట్లు ఆపార్టీకి చెందిన నాయకులు చెబుతుండేవారు. ఆమేరకు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఎన్నికల సమయంలో కూడా కౌన్సిలర్‌ సుభాషిని భర్త పరుచూరి నాగేశ్వరరావు తనవంతుగా ఎన్నికలకు సంబంధించి డబ్బు కూడా ఖర్చు చేసినట్లు తెలిసింది. 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలో కూడా 5వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి సుభాషిని గెలుపొందింది. అప్పటి నుంచిసుభాషిని భర్త పరుచూరి నాగేశ్వరరావు పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఉండేవారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో కూడా అన్నా రాంబాబు గెలుపునకు తనవంతుగా కృషి చేశాడు. వైశ్యసామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ప్రభావితం చేయడంలో తనవంతు ప్రయత్నం చేశారు.


ఇదిలావుండగా.. గిద్దలూరు వైస్‌చైర్మన్‌-2 పదవి కోసం సామాజిక వర్గాల వారీగా ప్రయత్నాలు చేశారు. ఓసీ, ఎస్సీ, ముస్లింలు కూడా వేర్వేరుగా తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆ పదవిని మహిళలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి  కేటాయించినట్లు సమాచారం. శుక్రవారం జరిగిన ప్రమాణ స్వీకారంలో చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, వైస్‌చైర్మన్‌ ఆర్‌.డి.రామకృష్ణ, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T04:45:01+05:30 IST