Abn logo
Aug 2 2020 @ 12:41PM

వన్‌ అండ్‌ ఓన్లీ... అనుష్కశర్మ

‘పాతాళ్‌లోక్‌’ వెబ్‌ సిరీస్‌లో అనుష్కలోని కొత్తషేడ్స్‌ ఆవిష్కృతం అయ్యాయి. ఆమె నిత్య నూతన ప్రయాణం ఎలా సాగుతోంది..


అనుష్కశర్మ... యువతులందరూ ఆమెలాంటి జీవితం కావాలని ఆశపడతారు. టాప్‌ మోడల్‌... హీరోయిన్‌... తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోలందరితో జతకట్టింది. కెరీర్‌ ఉన్నత స్థితిలో ఉండగానే క్రికెటర్‌ విరాట్‌ కొహ్లిని పెళ్లిచేసుకుంది. అయినా నటనకు ఫుల్‌స్టాప్‌ పెట్టలేదు. ప్రొడ్యూసర్‌గా విజయాల బాట పట్టింది. తాజాగా వెబ్‌సిరీస్‌ ‘పాతాళ్‌లోక్‌’తో సక్సెస్‌ కొట్టింది. సినీనేపథ్యం లేకుండా ఎదిగిన అనుష్క పట్టిందల్లా బంగారమే..


ప్రతి చెడులోనూ కొంత మంచి దాగుందని అంటారు. కరోనా వల్ల ప్రపంచం అంతా అల్లాడిపోతోంది. అయితే ఈ కరోనా కఠోర సమయంలో నేనూ విరాట్‌ కలిసి ఒకే చోట ఉంటున్నాం. ఈ మూడు నెలల్లో మా జీవనం నందనవనంలా మారింది.


జీవిత పాఠం

విరాట్‌ వరల్డ్‌ ఫేమస్‌ క్రికెట్‌ స్టార్‌. తన ష్కెడ్యూల్స్‌లో ఎంతో బిజీగా ఉంటాడు. ఇతర దేశాల టూర్లూ ఉంటాయి. సినిమా తదితరాల వల్ల చాలా సార్లు నేను ఇక్కడే ఉన్నా. తను విదేశాల్లో క్రికెట్‌ టూర్‌లో ఉన్నప్పుడు నేను వెళ్లినా, ఏ కాస్తో ఖాళీ దొరికి నా దగ్గరకి తను వచ్చినా జనాలంతా వీళ్లకి పండగే అని అనుకునేవారు. వాస్తవం అది కాదు. కేవలం ఒక భోజన సమయానికి మాత్రమే మేం కలుసుకునేవాళ్లం, అదే అపురూపం. మా పెళ్లైన మొదటి ఆరు నెలల కాలంలో 21 రోజులు మాత్రమే కలిసి ఉన్నాం. వీటన్నిటినీ నేను జాగ్రత్తగా లేక్కేశాను. టాప్‌ క్రికెటర్‌గా కోహ్లి లైఫ్‌ స్టెయిల్‌ అటువంటిది. అలాంటి మా షెడ్యూళ్లను కరోనా మార్చేసింది. మమ్మల్ని ఓ చోట బంధించింది. గత మూడు నెలలుగా వేరే ఏ పనులూ లేకుండా మాతో మేం గడుపుతున్నాం. మాకుగా మేం జీవిస్తున్నాం. తనతో గడిపిన ప్రతి క్షణాన్నీ అలా ఒడిసిపట్టుకుంటున్నా. చిన్న చిన్న అసౌకర్యాల గురించి అస్సలు ఆలోచించడం లేదు. చాలా మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కొంత మంది తమ సొంత ఊర్లకు వెళ్లలేకపోతున్నారు. కొంత మంది కుటుంబాలకు దూరంగా గడుపుతున్నారు. డబ్బుల్లేక, తిండిలేక విలవిలలాడుతున్న వాళ్లెందరో. మరి కొంత మంది కొవిడ్‌ వల్ల కుటుంబీకుల్ని, స్నేహితుల్ని పోగొట్టుకుంటున్నారు. వాళ్ల బాధ, నష్టం ముందు మన అసౌకర్యాలు లెక్కలోకి కూడా రావు. మొదటి నుంచీ రియాలిటీలో జీవించడమే నాకు ఇష్టం. కానీ కరోనా జీవితాలకి సంబంధించిన కఠోర నిజాలను అవగతం అయ్యేలా చేసింది. జీవితాంతం ఈ రోజులు గుర్తుండిపోతాయి.


చేయూతలో..

కరోనా మహమ్మారి సమయంలో ఇద్దరూ కలిసి తమ వంతుగా కొన్ని సేవలందించారు. కొవిడ్‌ - 19 ఫండ్స్‌కి నిఽధులు అందజేశారు. ముంబయి పోలీస్‌ వెల్ఫేర్‌ ఫండ్స్‌కి దానం చేశారు. దక్షిణ ఆఫ్రికా క్రికెట్‌ కెప్టెన్‌ ఎబి డి విల్లియర్స్‌తో కలిసి క్రికెట్‌ ఎక్విప్‌మెంట్‌ని వేలం వేయగా వచ్చిన నిధులను పేద ప్రజల సేవలకు అందజేశారు. ‘గత మూడేళ్లలో నా జీవన దృక్పథంలో ఎంతో మార్పు వచ్చింది. జీవితంలో సాధించిన విజయాల ద్వారానే గుర్తింపుపొందాలని అనుకోవడం లేదు. మానసికంగా సంతోషంగా ఉండడానికి ఎల్లవేళలా  ప్రయత్నిస్తున్నా. మరింత కారుణ్యంతో మెలిగేలా చేసింది ఈ మహమ్మారి సమయం’ అంటుంది అనుష్క.


రిచ్‌ కపుల్‌

భారతదేశంలో విరాట్‌ కొహ్లి, అనుష్క శర్మ పాపులర్‌ కపులే కాదు అత్యధిక ధనవంతులైన దంపతులు. వీళ్లిద్దరి సంపద సుమారు రూ.1200 కోట్లు. విరాట్‌ కోహ్లి 900 కోట్ల రూపాయల అఽధిపతి అయితే అనుష్క రూ. 350 కోట్లకు రాణి. ప్రస్తుతం ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఇద్దరూ ముంబయిలోని తమ సొంత ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఏడు వేల చదరపు అడుగుల లగ్జరీ ఫ్లాట్‌ ఇది. ఈ ఫ్లాట్‌ విలువ రూ.34 కోట్లు. దిల్లీ సమీపంలోని గుర్గావ్‌లో 80 కోట్ల ప్రాపర్టీ ఉందట. ఈ పవర్‌ కపుల్‌ కలిసి, వేరు వేరుగా ఎన్నో కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్నారు. రెండు ప్రొడక్షన్‌ సంస్థల అధినేత అనుష్క. రెండు రెస్టారెంట్లను నిర్వహిస్తున్నాడు కోహ్లి. ‘నుష్‌’ పేరున అనుష్క సొంత ష్యాషన్‌ బ్రాండ్‌ను నిర్వహిస్తోంది.


ఆమె అద్భుత మహిళ..

టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఏ సందర్భం దొరికినా తన భార్య అనుష్కను పొగుడుతూనే ఉంటాడు. అతడి మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది.


అనుష్క నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆమె పరిచయం కాకమునుపు చిరాకులుపరాకులతో ఉండేవాడిని. తను నెమ్మదితనాన్ని ఇచ్చింది. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునేలా చేసింది.

తన చిత్రాలన్నిటిలోకీ ‘ఏ దిల్‌ హై ముస్కిల్‌’లోని పాత్రంటే చాలా ఇష్టం. ఆ పాత్ర కోసం తనను తాను సిద్ధమైనతీరు .. అనుష్కతో ప్రేమలో పడేలా చేసింది.

గత నాలుగేళ్లుగా తను శాకాహారిగానే ఉంది. అనుష్క జంతుప్రేమని చూసి నేనూ రెండేళ్ల క్రితం వెజిటేరియన్‌గా మారిపోయా.

ఏ పనిచేసినా దానిపై వంద శాతం అంకిత భావంతో చేస్తుంది. అలాగే భవిష్యత్తుపై నిర్దిష్టమైన ఆలోచనలు ఉన్నాయి.

మా ఇద్దరికీ ప్రయాణాలంటే భలే ఇష్టం. చాలా మటుకు అభిరుచులూ ఒక్కటే. అందుకే మా మధ్య ఎదుటి వ్యక్తిని ఎలా ఒప్పించాలనే సమస్య రాదు.

మా అనుబంధం ప్రేమకు ప్రతిరూపం. కొన్ని యుగాలుగా కలిసే ఉన్నామన్న భావన మా ఇద్దరిలో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది.Advertisement
Advertisement
Advertisement