దివ్యాంగుడి మృతి ఘటనపై చర్యలేవీ?

ABN , First Publish Date - 2021-10-23T06:16:52+05:30 IST

దివ్యాంగుడైన కార్తీక్‌గౌడ్‌ మృతి చెంది ఐదు రోజులవుతున్నా కారణమైన పోలీస్‌ సిబ్బందిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్‌పీఎస్‌) నాయకులు గుట్ట పోలీస్‌స్టేషన్‌ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.

దివ్యాంగుడి మృతి ఘటనపై చర్యలేవీ?
గుట్ట పోలీ్‌సస్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు

గుట్ట పోలీ్‌సస్టేషన్‌ ఎదుట దివ్యాంగుల ధర్నా


యాదాద్రి రూరల్‌, అక్టోబరు 22 : దివ్యాంగుడైన కార్తీక్‌గౌడ్‌ మృతి చెంది ఐదు రోజులవుతున్నా కారణమైన పోలీస్‌ సిబ్బందిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్‌పీఎస్‌) నాయకులు గుట్ట పోలీస్‌స్టేషన్‌ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షుడు ఎల్‌.గోపాల్‌రాజు, రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం ఖాశీం మాట్లాడుతూ దైవ దర్శనార్ధం వచ్చిన కార్తీక్‌గౌడ్‌ను అన్యాయంగా కర్రలతో దాడి చేయడంతో మృతిచెందాడన్నారు. సంఘటన జరిగి ఐదు రోజులైనా నిందితులపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం మృతుడి కుటుంబానికి ఉద్యోగంతో పాటు, రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం కింద కేసు నమోదు చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. నిందితులను రెండు రోజుల్లో పట్టుకుంటామని సీఐ నర్సయ్య హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఐకి అందించారు. కార్యక్రమంలో నాయకులు అందె రాంబాబు, కాళ్ల జంగయ్య, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కొత్త వెంకన్నయాదవ్‌, కొడగళ్ల నరేష్‌, సతీష్‌, అశోక్‌, గవ్వల యాదయ్య, రవీందర్‌రెడ్డి, తాళ్లపల్లి కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T06:16:52+05:30 IST