కరోనాపై కార్యాచరణ ఏదీ...?

ABN , First Publish Date - 2021-04-19T06:08:09+05:30 IST

కరోనా విజృంభిస్తున్న వేళ మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది.

కరోనాపై కార్యాచరణ ఏదీ...?
కార్పొరేషన్‌ కార్యాలయంలో ఉన్న హైపో క్లోరైడ్‌ స్ర్పే చేసే వాహనం

-  మంత్రి ఆదేశాలు బేఖాతరు

-  స్పందించని రామగుండం కార్పొరేషన్‌

-  మొదలుకాని డిసిన్ఫెక్షన్‌ ప్రక్రియ

-  కార్యాలయ ఆవరణలోనే వాహనాలు...

-  సెలవులు రద్దు చేసినా విధులకు రాని అధికారులు

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 18: కరోనా విజృంభిస్తున్న వేళ మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. అత్యవసర పరిస్థితులు ఉన్నాయని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో అప్రమత్తం కావాలని ఆదేశించారు. వెంటనే వైరస్‌ వ్యాప్తి చెందకుండా డిసిన్ఫెక్షన్‌ ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలిచ్చారు. కానీ రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మాత్రం మంత్రి ఆదేశాలను యంత్రాంగం బేఖాతరు చేస్తుంది. రామగుండంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించి ఇప్పటికి 8మంది మృత్యువాత పడ్డారు. ఒక్క శని, ఆదివారాల్లోనే ఇద్దరు మృతి చెందారు. ప్రతి రోజు వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. మున్సిపల్‌ డైరెక్టర్‌ కూడా కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అయినా కార్పొరేషన్‌ యంత్రాంగం కనీసం స్పందించడం లేదు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో హైపోక్లోరైడ్‌తో డిసిన్ఫెక్షన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. రామగుండంలో మాత్రం అలాంటి చర్యలు చేపట్టలేదు. హైపోక్లోరైడ్‌ ద్రావనాన్ని పిచికారి చేసేందుకు ఏర్పాటుచేసిన అన్ని వాహనాలు కూడా కార్యాలయ ఆవరణలోనే ఉన్నాయి. కనీసం అధికారులు కూడా కార్యాలయానికి వచ్చిన పరిస్థితి లేదు.

పర్యవేక్షణ లేకపోవడంతో పనులు నామమాత్రంగానే..

కరోనా అత్యవసర పరిస్థితుల దృష్ట్యా సెలవులు రద్దు చేశామని, కరోనా నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించడంతో అధికారులు ఫోన్‌లలో కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చిన సెలవులు తీసుకున్నారు. దీంతో పలు జోన్లలో పారిశుధ్య సూపర్‌వైజర్లు కొందరు ట్రాలీ డ్రైవర్లు, సిబ్బందిని పిలిపించారు. 20కిపైగా ట్రాలీలను బయటకు తీశారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు అక్కడే ఉండిపోయాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నామామత్రంగా విధులు ముగించుకుని వెళ్లిపోయారు. దీంతో పలు ప్రాంతాల్లో పాజిటివ్‌లు నమోదు అవుతున్న ఏరియాల నుంచి సంబంధిత పజాప్రతినిధులకు బాధితులు ఫోన్లు చేసినా కార్పొరేషన్‌లో సిబ్బంది అందుబాటులో లేరంటూ ప్రజాప్రతినిధులు చేతులెత్తేశారు.

ఫొటోలకే పరిమితం..

రామగుండం నగరపాలక సంస్థలో పాలన వ్యవహారాల్లో కొత్త తరహా సంస్కరణలు మొదలయ్యాయి. పారిశుధ్యంపై కమిషనర్‌ మొదలు అధికారులంతా ఉదయం 5గంటలకే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాలని మున్సిపల్‌ డైరెక్టర్‌ నుంచి ఆదేశాలున్నాయి. కానీ రామగుండంలో పరిస్థితి భిన్నం. రెవెన్యూ, కార్పొరేషన్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్టు కార్పొరేషన్‌కు సంబంధించి సోషల్‌ మీడియా గ్రూపుల్లో ఫోటోలు పోస్టు చేయాలని ఆదేశాలిచ్చారు. యధావిధిగా విధులు నిర్వహించే సిబ్బంది ఉదయం 5గంటలకే డ్యూటీలకు వచ్చి పోస్టులు పెడతారు. కానీ అధికారులు మాత్రం ఆ సమయానికి విధులు నిర్వహించడం, పోస్టులు పెట్టిన పరిస్థితులు మాత్రం లేదు. 

మొదటి దశలో హైపోక్లోరైడ్‌ స్ర్పేకు ఏడు ట్రాక్టర్లు

రామగుండం నగరపాలక సంస్థలో కరోనా మొదటి దశలో హైపో క్లోరైడ్‌ స్ర్పేకే ఏడు ట్రాక్టర్లను అద్దెకు పెట్టుకున్నారు. ఇందులో వివిధ డివిజన్లలో స్ర్పేకు ఐదు ట్రాక్టర్లను వాడేవారు. రెండు ట్రాక్టర్లు ఎప్పుడు కార్యాలయ ఆవరణలోనే ఉండేవి. ఈ సారి కూడా అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కొన్ని వాహనాలను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ ఆదే శించారు. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కొవిడ్‌ నియంత్రణ, వ్యాప్తి నిరోధక చర్యలపై సీరియస్‌నెస్‌ లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్‌ మంచినీటి సరఫరాలో తగిన పర్యవేక్షణ లేకపోవడంతో శివారు కాలనీల్లో కామెర్ల వ్యాధి విజృంభిస్తోంది. కామెర్ల వ్యాధి వ్యాప్తికి పారిశుధ్య లోపం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఇప్పు డు కరోనా విజృంభిస్తున్న వేళ యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించకపోతే పరిస్థితులు మరింత దిగజారేలా ఉంది.

Updated Date - 2021-04-19T06:08:09+05:30 IST