వానలు వరదలా మనకడ్డంకి...

ABN , First Publish Date - 2021-12-07T06:54:56+05:30 IST

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆకాంక్షిస్తూ భూములిచ్చిన రైతులు న్యాయస్థానం నుంచీ దేవస్థానం పేరిట చేపట్టిన మహాపాదయాత్ర మంగళవారం జిల్లాలో ప్రవేశించనుంది.

వానలు వరదలా మనకడ్డంకి...
చదును చేసిన భూమిని గుర్తు తెలియని వ్యక్తులు దున్నించేశారు.

 -పోటెత్తి వస్తున్న అమరావతి పాదయాత్రికులు

-నేడు చిత్తూరు జిల్లా ప్రవేశం

-మూడు రోజులు శ్రీకాళహస్తిలోనే బస

-అప్పుడే మొదలైన అడ్డంకులు 

సవాలక్ష ప్రశ్నలు సంధిస్తున్న పోలీసులు

-  

జోరున కురిసిన వానలకు జంకలేదు.. పోటెత్తిన వరదలకు వెనకడుగు వేయలేదు.. అడుగడుగునా అడ్డుకుని అవాంతరాలు సృష్టిస్తున్నా మడమ తిప్పలేదు.  అన్నం తినడానికి తావు చూపించిన వాళ్లని, రాత్రి పడుకోవడానికి చోటు ఇచ్చినవాళ్లని బెదిరిస్తున్నా  భయపడలేదు. కేసులు పెడుతున్నా,. లాఠీలతో కొడుతున్నా నడక ఆపలేదు.  న్యాయస్థానం ఇచ్చిన అనుమతితో తిరుమల శ్రీనివాసుడి దర్శనం చేసుకోవడానికి అకుంఠిత దీక్షతో కదిలి వస్తున్న అమరావతి రైతులు జిల్లా పోలీసుల సవాలక్ష అభ్యంతరాల నడుమ నేడు చిత్తూరు జిల్లాలో అడుగుపెడుతున్నారు.  35 రోజులుగా అలుపెరుగని నడక... శ్రీనివాసుని దర్శనంతో సేదదీరనుంది. న్యాయస్థానం నుంచీ బయలుదేరిన ఈ  అమరావతి మహాపాదయాత్రికులకు చిత్తూరు జిల్లా ప్రజలు నేడు స్వాగతం పలుకనున్నారు. 


-జగ్గరాజుపల్లె వద్ద జిల్లాలోకి ప్రవేశం

-ఎంపేడులో మధ్యాహ్న భోజనం

- చింతలపాలెంలో రాత్రి బస

-సరిహద్దుల్లో ఘన స్వాగతానికి 

రాజకీయ, ప్రజా సంఘాల ఏర్పాట్లు

-తొలిరోజు 7 కిమీ సాగనున్న యాత్ర


తిరుపతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆకాంక్షిస్తూ  భూములిచ్చిన రైతులు న్యాయస్థానం నుంచీ దేవస్థానం పేరిట చేపట్టిన మహాపాదయాత్ర మంగళవారం జిల్లాలో ప్రవేశించనుంది. ఉదయం 9 గంటలకు నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచీ ప్రారంభమయ్యే పాదయాత్ర 10 - 10.30 గంటల నడుమ సరిహద్దులు దాటి శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె వద్ద జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఘనంగా అమరావతి రైతులకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనికోసం ఉదయానికల్లా రాజకీయ పార్టీల నేతలు,కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున జగ్గరాజుపల్లెకు చేరుకోనున్నారు. టీడీపీకి సంబంధించి జిల్లాలోని ముఖ్యనేతలు సహా నియోజకవర్గాల ఇంఛార్జీలంతా కూడా పాదయాత్రికులకు స్వాగతం పలికి సంఘీభావం పలకనున్నారు. వారి వెంట పెద్దసంఖ్యలో కార్యకర్తలు కూడా తరలివచ్చే అవకాశముంది.


నేడు పాదయాత్ర సాగనున్న ప్రాంతాలివే!

  పాదయాత్ర తొలిరోజు శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల పరిధిలో సుమారు 7 కిలోమీటర్ల మేర సాగనుంది. సరిహద్దులు దాటి జిల్లాలోకి ప్రవేశించిన వెంటనే తొలుత శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లెకు యాత్ర చేరుకుంటుంది. అక్కడ నుంచీ వాంపల్లె, ఈండ్రవారిపల్లెల మీదుగా మధ్యాహ్నానికి ఎంపేడు చేరుతుంది. అక్కడ మధ్యాహ్న భోజనం అయ్యాక కొంతసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి రైతులు యాత్ర ప్రారంభిస్తారు. ఎంపేడు తర్వాత ఏర్పేడు మండలం పల్లం, పల్లంపేట, పల్లం దళితవాడల మీదుగా సాయంత్రానికి చింతలపాలెం చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

అడుగుపెట్టక ముందే అడ్డంకులు

అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్ర జిల్లాకు చేరుకోకముందే అడ్డంకులు ఎదురవుతున్నాయి. తొలిరోజు మంగళవారం మధ్యాహ్నం పాదయాత్ర బృందం శ్రీకాళహస్తి మండలం ఎంపేడు గ్రామ సమీపంలో భోజనం చేసేందుకు స్థానికులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా రోడ్డుపక్కన ఖాళీగా వున్న భూమి యజమాని అనుమతితో డోజర్‌ పెట్టి చదును చేశారు. అయితే చదును చేసిన భూమిని గుర్తు  తెలియని వ్యక్తులు తిరిగి దున్నించేశారని గ్రామస్తులు ఆరోపించారు.


 స్పష్టత ఇవ్వని ఎస్వీయూ, టీటీడీ

అమరావతి రైతుల పాదయాత్రకు పోలీసు అధికారుల నుంచీ పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో బహిరంగసభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని నిర్వాహకులు తిరుపతి అర్బన్‌ ఎస్పీకి లేఖ రాశారు. దానికి ప్రతిగా ఏఎస్పీ నుంచీ నిర్వాహకులకు లేఖ అందింది. అందులో వారు పాదయాత్రకు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చిందని, ముగింపు బహిరంగసభ జరిపేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దానికి తోడు బహిరంగసభ ఏర్పాట్లకు సంబంధించి లేఖలో ఎలాంటి వివరాలూ ఇవ్వలేదని కూడా పేర్కొన్నారు. సభకు ఎవరెవరు వస్తారు? ఎందరు వస్తారు? ముఖ్యమైన నేతలు ఎవరెవరు పాల్గొంటారు? వేదికపై ఎవరు వుంటారు? తిరుపతి రాయలసీమలో భాగం కనుక మూడు రాజధానులకు ఈ ప్రాంతంలో ఎక్కువ మద్దతు వుంటుందని, ఆ నేపధ్యంలో బహిరంగసభలో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు, వ్యాఖ్యలు, నినాదాలు చేస్తే పరిస్థితి ఏమిటి? తదితర పలు ప్రశ్నలు సంధించారు. మరోవైపు ఎస్వీయూ స్టేడియంలో ముగింపు సభ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని పాదయాత్ర నిర్వాహకులు వర్శిటీ వీసీకి లేఖ రాసినా సమాధానం రాలేదని సమాచారం. అలాగే పాదయాత్రికులు తిరుమలలో శ్రీవారి దర్శనార్థమై రూ. 300 టికెట్లు కేటాయించాలని ఈవోకు రాసిన లేఖపైనా ఇంతవరకూ సమాధానం లేదని తెలిసింది.

  తిరుమల పవిత్రతను కాపాడతాం: నిర్వాహకులు

తిరుపతిలో పాదయాత్ర ముగింపు సభకు అనుమతి కోసం సోమవారం నిర్వాహకుల తరపున తిరుపతిరావు బృందం తిరుపతి ఇంఛార్జి ఎస్పీ వి.విద్యాసాగర్‌ను కలిశారు.ఆయన వెంట బీజేపీ ముఖ్యనేత భానుప్రకా్‌షరెడ్డి కూడా వున్నారు. ఈ సందర్భంగా ఇంఛార్జి ఎస్పీతో పాటు తిరుపతి, తిరుమల ఏఎస్పీలు, డీఎస్పీలు,సీఐలూ నిర్వాహకులను ముగింపు సభపై కాకుండా తిరుపతిలో పాదయాత్ర, తిరుమలలో శ్రీవారి దర్శనాలు వంటి అంశాలపై ప్రశ్నించి భద్రతాపరంగా, నిబంధనల పరంగా తమ అభ్యంతరాలు, సందేహాలను వ్యక్తం చేశారు. దీనికి పాదయాత్ర నిర్వాహకులు సూటిగా, స్పష్టంగా సమాధానాలిచ్చి వాటిని నివృత్తి చేశారు. ముఖ్యంగా తిరుపతి నగరంలో ట్రాఫిక్‌ను దృష్టిలో వుంచుకుని ఇబ్బంది కలిగించకుండా రోడ్డుపై రెండు వరుసల్లో నడుచుకుంటూ వెళతామని స్పష్టత ఇచ్చారు. అలాగే వీఐపీలు, ముఖ్య నాయకులు మద్దతు పలికేందుకు రావడం వంటి వాటికి సంబంధించి నేతలు తమకు ముందుగా చెప్పి వస్తే తాము కూడా పోలీసులకు ముందుగానే ఆ సమాచారాన్ని అందజేస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్న భోజనాలు, రాత్రిళ్ళు బస ఎక్కడెక్కడ చేస్తారన్న పోలీసు అధికారులకు నిర్వాహకులు సమాధానమిస్తూ ఆ విషయాలు తాము ముందుగా వెల్లడించలేమన్నారు. ముందుగా చెబితే తమకు ఆశ్రయం ఇచ్చేవారిని బెదిరించి, వేధింపులకు పాల్పడే అవకాశమున్నందున చెప్పలేమన్నారు. తిరుమల దర్శనాల విషయానికొస్తే టీటీడీ నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి వుంటుందని, తిరుమలలో ఇతర కండువాలు ధరించడం, నినాదాలు చేయడం, రాజకీయ వ్యాఖ్యలు చేయడం వంటివి నిషేధమని పోలీసు అధికారులు గుర్తు చేశారు. దీనిపై రైతులు చాలామంది ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నారని, మరికొందరు టికెట్ల కోసం లెటర్లు పెట్టుకున్నారని నిర్వాహకులు వివరించారు. టికెట్లు దొరికిన వారే తిరుమలకు వెళతారని, లేనివారు తిరుపతిలోనే వుంటారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీటీడీ నిబంధనలకు కట్టుబడి వుంటామని, తిరుమల పవిత్రతను కాపాడుతామని నిర్వాహకుల బృందం స్పష్టం చేసింది. కాగా తిరుపతిలో ముగింపు సభకు అనుమతి ఇచ్చే విషయంలో పోలీసు అధికారులు వ్యక్తం చేసిన అభ్యంతరాలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా వున్నామని తిరుపతిరావు తదితరులు స్పష్టం చేశారు. అయితే తిరుపతి అర్బన్‌ ఎస్పీ ప్రస్తుతానికి అందుబాటులో లేనందున తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుందామని పోలీసు అధికారులు ఆ అంశాన్ని వాయిదా వేశారు.

శ్రీకాళహస్తిలో మూడు రాత్రులపై అభ్యంతరాలు

అమరావతి రైతులు 8వ తేదీ రాత్రికి శ్రీకాళహస్తి పట్టణ శివార్లకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 9వ తేదీ పట్టణంలో పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రికి పట్టణ శివార్లలో బస చేస్తారు. 10వ తేదీ అక్కడే విశ్రాంతి తీసుకుంటారు.11వ తేదీ ఉదయం పాదయాత్రను కొనసాగిస్తారు. మూడు రోజుల పాటు శ్రీకాళహస్తిలోనే వుండడం, రాత్రిళ్ళు కూడా అక్కడే బస చేయడంపై శ్రీకాళహస్తి డీఎస్పీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు వుండకూడదని నిర్వాహకులతో పాటు బీజేపీ నేత భానుప్రకా్‌షరెడ్డి కూడా పోలీసు అధికారులను ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో తాము బస చేయడం వల్ల ఎవరికి ఇబ్బందని ప్రశ్నించారు. అందులోనూ మూడు రాత్రులు వున్నా  పట్టణంలో కాకుండా శివార్లలోనే వుంటామని స్పష్టం చేశారు. కానీ పోలీసు అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. పోలీసు అధికారుల తీరు పట్ల తిరుపతి రావు, బీజేపీ నేత భానుప్రకా్‌షరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.


మహాపాదయాత్రకు ఘనస్వాగతం పలకాలి

అమరావతి రైతుల మహా పాదయాత్ర మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె చేరుకుంటుంది.పార్టీలకు అతీతంగా యాత్రకు ఘన స్వాగతం పలకాలి. జిల్లాలోని రైతులతోపాటు టీడీపీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి స్వాగతం పలకాలి. 

- పాచిగుంట మనోహర్‌ నాయుడు, 

తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 





Updated Date - 2021-12-07T06:54:56+05:30 IST