పారదర్శకత ఏదీ?

ABN , First Publish Date - 2021-09-08T05:33:13+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీస్‌లు) కీలక పాత్ర వహిస్తున్నాయి. రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నాయి. ఏటా ఖరీఫ్‌, రబీలో స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను తక్కువ వడ్డీకి అందిస్తూ రైతాంగాన్ని ఆదుకుంటున్నాయి.

పారదర్శకత ఏదీ?
ఇచ్ఛాపురం పీఏసీఎస్‌ కార్యాలయం




కంప్యూటరీకరణకు నోచుకోని పీఏసీఎస్‌లు

సక్రమంగా సాగని ఆర్థిక లావాదేవీలు

పక్కదారి పడుతున్న నిధులు

పట్టించుకోని ‘సహకార’ శాఖ అధికారులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీస్‌లు) కీలక పాత్ర వహిస్తున్నాయి. రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నాయి. ఏటా ఖరీఫ్‌, రబీలో స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను తక్కువ వడ్డీకి అందిస్తూ రైతాంగాన్ని ఆదుకుంటున్నాయి. చాలాచోట్ల ఆర్థిక లావాదేవీలు సక్రమంగా నిర్వహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పారదర్శకత కోసం పుష్కరకాలం కిందట  ‘కంప్యూటరీకరణ’కు శ్రీకారం చుట్టినా.. ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో పీఏసీఎస్‌ల్లో జవాబుదారీతనం  లోపిస్తోంది.  

పీఏసీఎస్‌లలో పారదర్శకత లోపిస్తోంది. సహకార రంగంలో వినూత్న మార్పులు వచ్చినా ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. జిల్లాలో 50 పీఏసీఎస్‌లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 10 లక్షల మంది రైతులు సేవలు పొందుతున్నారు. ఏటా ఖరీఫ్‌, రబీలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక, వాణిజ్య పంటలపై రుణాలు పొందుతున్నారు. ఆప్కాబ్‌ నుంచి సహకార బ్యాంకుకు, బ్యాంకు నుంచి సొసైటీలకు, సొసైటీల నుంచి రైతులకు రుణాలు మంజూరవుతుంటాయి. అయితే ఇప్పటికీ పురాతన పద్ధతిలోనే కార్యకలాపాలు జరుగుతున్నాయి. 2008లో కంప్యూటరీకరణ ప్రారంభించినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఎక్కడా ఏర్పాటు కాలేదు. జిల్లాలో కేవలం పైడిభీమవరం, పోలాకి పీఏసీఎస్‌ల్లో మాత్రం కంప్యూటరీకరణ పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మిగతా చోట్ల ఎప్పుడు పూర్తిచేస్తారో తెలియని పరిస్థితి. బ్యాంకుల స్థాయిలో కంప్యూటరీకరణ జరిగి ఏళ్లు దాటింది. ప్రస్తుతం సాంకేతిక వ్యవస్థను మెరుగు పరుచుకునేందుకు ఆప్కాబ్‌ కూడా టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే సేవలను సొసైటీలకు అందించాలని... డిజిటలైజ్‌ చేయాలని ఆప్కాబ్‌ కృతనిశ్చయంతో ఉన్నా ఆ దిశగా అడుగులు ముందుకు పడడం లేదు. 

ప్రయోజనాలివీ..

 వాణిజ్య బ్యాంకుల కంటే సహకార సంఘాల్లో డిపాజిట్లపై వడ్డీ ఎక్కువ. అయితే అవకతవకలు జరుగుతాయన్న భయంతో నగదు జమ చేసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సహకార సంఘాల్లో కంప్యూటరీకరణ పూర్తయితే వీటిల్లో పారదర్శకత వస్తుంది. రుణం, చెల్లింపులు, డిపాజిట్లు వంటివన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతాయి. లావాదేవీలపై పర్యవేక్షణ ఉంటుంది. ఉన్నతాధికారులు కూడా సులువుగా తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. రైతులకు లభించే వడ్డీ రాయితీ, ప్రభుత్వ రాయితీలు ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో జమవుతాయి. కంప్యూటరీకరణతో రైతులకు మెరుగైన సేవలు అందించడమేకాక అవినీతిని నిర్మూలించే అవకాశం ఉంది. ప్రస్తుతం రైతు రుణం చెల్లించినా.. కొందరు సిబ్బంది సొసైటీ ఖాతాకు జమ చేయకుండా మింగేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలన్నా.. అవినీతి ఆస్కారం లేకుండా చేయాలన్నా డిజిటలైజేషన్‌ ఉపయుక్తమని పలువురు అభిప్రాయపడుతున్నారు. చెల్లింపులు ఏరోజుకారోజే తెలుసుకోవచ్చు. అంతేకాక డీసీసీబీలు, ఆప్కాబ్‌, నాబార్డు అధికారులు సైతం సొసైటీల తీరును ఎప్పటికప్పుడు తెలుచుకోవచ్చు.

కార్యాచరణ రూపొందిస్తాం

రైతు సంక్షేమ ధ్యేయంగా పీఏసీఎస్‌లు సేవలందిస్తున్నాయి. 2007-08 ఆర్థిక సంవత్సరంలోనే సంఘాల్లో కంప్యూటరీకరణ ప్రారంభించాం. ఇప్పటికే రెండు సంఘాల్లో దిగ్విజయంగా ప్రక్రియ నడుస్తోంది. మిగతా పీఏసీఎస్‌లలో త్వరలో పూర్తిచేస్తాం.

-కె.మురళీకృష్ణారావు, జిల్లా సహకార అధికారి, శ్రీకాకుళం





Updated Date - 2021-09-08T05:33:13+05:30 IST