Abn logo
May 7 2021 @ 04:01AM

ఏడాదైనా చర్యలు శూన్యం

ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనకు నేటితో ఏడాది

నాడు స్టైరిన్‌ వాయువు లీకై 15 మంది మృతి

పలువురికి ఇప్పటికీ అందని పరిహారం

హైపవర్‌ కమిటీ సూచనలు బుట్టదాఖలు

ఉపాధి లేక అల్లాడుతున్న పలువురు బాధితులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కరోనా వల్ల ఊపిరి అందక గిలగిలలాడుతూ ఆస్పత్రుల ఆవరణల్లో, ఆరుబయట ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తుంటే...సరిగ్గా ఏడాది క్రితం విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాద ఘటన గుర్తుకువస్తోంది. గతేడాది మే 7వ తేదీ తెల్లవారుజామున ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి విషవాయువు స్టైరిన్‌ వెలువడటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊపిరి అందక ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని రోడ్లపైకి పరుగులు తీశారు. అలానే రోడ్ల పక్కన కుప్పకూలిపోయారు. ఆ ఘటనపై యావత్‌ ప్రపంచం దిగ్ర్భాంతి చెందింది. దక్షిణ కొరియాకు చెందిన ఆ కంపెనీ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించి ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమను నడుపుతోందని విచారణలో వెల్లడైంది. ఆ ఘటనలో అదే రోజు 12 మంది, తరువాత ఆస్పత్రుల్లో మరో ముగ్గురు... మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కొందరికి పరిహారం అందింది. మరికొంతమంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు.


అమలుకు నోచని ఎన్జీటీ సూచనలు..

ఆ ఘటనను జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. పరిశ్రమను తక్షణమే అక్కడి నుంచి నివాసాలకు దూరంగా తరలించాలని సూచించింది. కానీ, ఇప్పటివరకు అది అమల్లోకి రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అనుమతివ్వడంతో కంపెనీకి నష్టం జరగకుండా ఉండేందుకు, అక్కడ నిల్వ ఉన్న రూ.100 కోట్ల విలువైన స్టైరిన్‌ను ప్రత్యేక నౌకల ద్వారా సింగపూర్‌ మీదుగా తరలించేశారు. ఆ తరువాత యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించి, అక్కడ ఇంకా విలువైన యంత్రాలు, ఇతర పరికరాలు ఉన్నాయని చెప్పి, వాటిని తీసుకుపోవడానికి అనుమతి పొందింది.


అధ్యయనానికి ఆరు కమిటీలు..

స్టైరిన్‌ వాయువు వల్ల మనుషులపై, వాతావరణంలో, భూమిలో, నీటిలో దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని నిపుణులు చెప్పడంతో మొత్తం ఆరు కమిటీల ద్వారా అన్నింటినీ అధ్యయనం చేయుంచాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని హైపవర్‌ కమిటీ సూచించింది. ఆరోగ్య కమిటీకి అధ్యక్షుడిగా డాక్టర్‌ పురుషోత్తంను నియమించగా, ఆయన పది నెలల క్రితం మరణించారు. దీంతో ఆ కమిటీ అతీగతీ లేదు. ప్రమాదం జరిగిన తరువాత ఏడు గ్రామాల బాధితులను పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది.


ఉపాధి కూడా కరవే..

సమీప గ్రామాల ప్రజలు సుమారు 500 మంది ఎల్‌జీ పాలిమర్స్‌లో ఉపాధి పొందేవారు. ప్రమాదం తరువాత వారికి ఉపాధిలేదు. ఏదైనా చేసుకుందామంటే కొందరికి ఆరోగ్యం సహకరించడంలేదు. వారంతా జీవనోపాధి చూపించాలని అభ్యర్థిస్తున్నారు.


సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏదీ?

స్టైరిన్‌ ప్రభావం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గుర్తించిన ప్రభుత్వం వెంకటాపురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని ప్రకటించింది. అప్పటివరకు నలుగురు వైద్యులతో ఆస్పత్రి నడుపుతామని చెప్పింది. అయితే కనీసం బీపీ పరికరం కూడా ఇవ్వకుండా డెస్పెన్సరీ ఏర్పాటుచేసింది. దాంతో ఎవరూ ఆ ఛాయలకు కూడా వెళ్లడం లేదు. కంపెనీ 120 ఎకరాల్లో విస్తరించి ఉండగా, అందులో 80 ఎకరాలు ప్రభుత్వ భూమే. దానిని వెనక్కి తీసుకొని అందులోనే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని వామపక్ష నాయకులు, మానవ హక్కుల వేదిక, గ్రామ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Advertisement