ప్రజల గోడు ఆలకించేదెవరూ..?

ABN , First Publish Date - 2021-12-07T06:04:40+05:30 IST

కందుకూరు నియోజకవర్గంలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తుండగా పనిఒత్తిడి సాకుగా చూపుతూ ఉన్నవారు కూడా ప్రజలకు దర్శనభాగ్యం కల్పించడం లేదు.

ప్రజల గోడు ఆలకించేదెవరూ..?
పీసీపల్లిలో 10.40 సమయంలో ఖాళీగా ఉన్న కుర్చీలు

కందుకూరు, డిసెంబరు 6 : కందుకూరు నియోజకవర్గంలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తుండగా పనిఒత్తిడి సాకుగా చూపుతూ ఉన్నవారు కూడా ప్రజలకు దర్శనభాగ్యం కల్పించడం లేదు. దీంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగక తప్పడం లేదు. పలు మండలాల్లో మధ్యాహ్నం వరకు కూడా ఎవరూ రాని పరిస్థితి నెలకొంది. కందుకూరు మండలంలో డీటీ, ఒక ఆర్‌ఐ పోస్టులు ఖాళీగా ఉండగా ఉన్న ఒక్క ఆర్‌ఐ కూడా ఇటీవల బదిలీ అయ్యాడు.  మండలంలో భూముల ఆన్‌లైన్‌ సమస్యలపై ప్రజలు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పలుకూరుకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి తనకున్న ఎకరం భూమిని అమ్ముకోగా రిజిస్ర్టేషన్‌ చేయాలంటే ఆర్‌లైన్‌లో లేకపోవడంతో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కొండికందుకూరుకు చెందిన బక్కమంతుల శ్రీనివాసులు 92 సెంట్లు భూమిని గ్రామంలోని రైతులు వద్ద కొనుగోలు చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ఇలాంటి సమస్యలతో పలువురు రైతులు తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. వలేటివారిపాలెం తహసీల్దార్‌ కార్యాలయానికి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక్కరూ రాలేదు. జూనియర్‌ అసిస్టెంట్‌, ఏఎ్‌సవో 12 గంటలకు రాగా డీటీ, ఆర్‌ఐ, సర్వేయర్‌ కొండారెడ్డిపాలెంలో డంపింగ్‌యార్డ్‌ స్థల సేకరణకు వెళ్లారు. తహసీల్దార్‌ సెలువపై ఉన్నాడని తెలిపారు. దీంతో పాసుపుస్తకాలు, సర్టిఫికేట్‌ల కోసం వచ్చిన వారు ఉసూరుమంటూ వెనుదిరిగారు. లింగసముద్రం మండలంలో డీటీ, ఆర్‌ఐలు మెడికల్‌ లీవులో ఉండగా సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఏఎ్‌సవో 11 తరువాత వచ్చాడు. తహసీల్దార్‌, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ 10.40 కి వచ్చారు. పాస్‌బుక్‌లు, ఇతర సమస్యలపై వచ్చిన పదిమంది వరకు రైతులు డీటీ, ఆర్‌ఐలు లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. ఉలవపాడులో తహసీల్దార్‌, ఆర్‌ఐ, ఏఎ్‌సవో, సీనియర్‌ అసిస్టెంట్‌, కొందరు వీఆర్‌వోలు 10 గంటలలోపు కార్యాలయానికి వచ్చి అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఓటీఎ్‌సపై గ్రామాల విజిట్‌కు తహసీల్దార్‌ వెళ్లగా సమస్యలపై ప్రజలు కార్యాలయం వద్దకు తక్కువ సంఖ్యలోనే కనిపించారు. ఇక్కడ డీటీ డిప్యూటేషన్‌పై వెళ్లగా ఈ పోస్టు రెండేళ్లగా ఖాళీగా ఉంది. గుడ్లూరు మండలంలో కూడా తహసీల్దార్‌ కార్యాలయానికి సిబ్బంది ఆలస్యంగా వచ్చారు. ఉదయం 10.30 గంటల తర్వాత ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చాడు.

వెలవెలబోతున్న కార్యాలయాలు

కొండపి : మండల రెవెన్యూ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. సోమవారం ఆంధ్రజ్యోతి నిర్వహించిన తహసీల్దార్‌ కార్యాలయాల విజిట్‌లో మర్రిపూడి, పొన్నలూరు మండలాల్లో తహసీల్దార్‌, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో కార్యాలయాల పనితీరు నామ్‌కేవాస్తిగా మారింది. మర్రిపూడి తహసీల్దార్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న డీటీ ఏడు నెలల క్రితం బదిలీ కావడంతో కొండపి తహసీల్దార్‌ వి. కామేశ్వరరావుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయనకు రెండు మండలాల్లో పనులు చేయడం ఇబ్బందికరంగా మారింది. సోమవారం కొండపిలో తహసీల్దార్‌ కామేశ్వరావు విధులకు హాజరు కాగా, మర్రిపూడిలో రెవెన్యూ సిబ్బంది చుట్టూ తహసీల్దార్‌ సంతకాల కోసం పలువురు తిరగడం కనిపించింది. అదేవిధంగా పొన్నలూరు తహసీల్దార్‌ గత నెల 30న ఉద్యోగ విరమణ చేయగా కందుకూరు తహసీల్దార్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. ఇక్కడ కూడా తహసీల్దార్‌ కోసం ప్రజలు కార్యాలయం చుట్టూ తిరిగారు. పొన్నలూరు మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌, ఏఆరై, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీంతో కార్యాలయం వెలవెలబోయింది. కాగా కొండపి, సింగరాయకొండ తహసీల్దార్లు సకాలంలో కార్యాలయాలకు హాజరు కాగా, బిట్రగుంటలో నిర్వహించిన కలెక్టర్‌ కార్యక్రమంలో జరుగుమల్లి తహసీల్దార్‌ పాల్గొన్నారు.

అధ్వానంగా పనితీరు

మర్రిపూడి  : కీలకమైన మండల రెవెన్యూ శాఖలో సిబ్బంది పనితీరు అస్తవ్యస్తంగా తయారైంది. రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేకపోవడంతో సిబ్బంది విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. బొత్తిగా సమయపాలన పాటించడం లేదు. వివిధ పనుల కోసం వచ్చే అవసరార్థులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఆంధ్రజ్యోతి విజిట్‌లో రెవెన్యూ కార్యాలయం సిబ్బంది పనితీరు డొల్లతనం బట్టబయలైంది. ఉదయం 10.30 నిమిషాలకు తాతాక్కాలిక కంప్యూటర్‌ ఆపరేటర్‌ సుల్తాన్‌ ఒక్కరే కార్యాలయానికి హాజరయ్యారు. 11 గంటలకు సర్వేయర్‌ వెంకటరెడ్డి వచ్చారు. 11.15 లకు డిప్యూటి తహసీల్దార్‌ షాజిద విధులకు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో నలుగురు తహసీల్దార్‌లు మారారు. ప్రస్తుతం కూడా ఇన్‌చార్జి తహసీల్దారే ఉన్నారు. దీనికితోడు జూనియర్‌ సహాయకులు, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవసరార్థులకు సకాలంలో పనులు కావడం లేదు.

సీఎ్‌సపురం : స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో వివిధ పనులపై వచ్చిన అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి కూడా సమయానికి రావడం లేదు. సామవారం 11 గంటల వరకు ప్రధాన అధికారులెవరూ లేక కార్యాలయంలోని కుర్చిలు ఖాళీగా కనిపించాయి. ఒక్క డిప్యూటీ తహసీల్దార్‌ మాత్రమే అందుబాటులో ఉన్నారు. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన అర్జీదారులు గంటల తరబడి కార్యాలయం ముందు నిరీక్షించలేక అధికారుల వ్యవహార తీరుపై పలు విమర్శలు చేస్తున్నారు. 

వెంటాడుతున్న సిబ్బంది కొరత

లింగసముద్రం : లింగసముద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రజ్యోతి సోమవారం ఉదయం 10:40కి విజిట్‌ చేయగా తహసీల్దార్‌ ఆర్‌ బ్రహ్మయ్య, జూనియర్‌ అసిస్టెంట్‌, ఎలక్షన్‌ ఆపరేటర్‌, 10:45కి కంప్యూటర్‌ ఆపరేటర్‌లు వచ్చారు. 11 గంటల తర్వాత ఏఎస్‌వో వచ్చారు. పులువురు సిబ్బంది డిప్యూటేషన్‌పై వెళ్లారు. అయితే ఉదయం 11 గంటల తర్వాత ఇద్దరు కొత్త పాస్‌పుస్తకాలకు ధరఖాస్తు చేసేందుకు, మరో ఇద్దరు మరణ ధృవీకరణ పత్రాలకు వచ్చారు. అయితే ఇంకొకరు 1బీ నమూనా కోసం, మరొకరు కొత్తగా వచ్చిన డిజిటల్‌ పాస్‌పుస్తకం వచ్చారు.

సమయపాలన పాటిస్తే ఓట్టు

వలేటివారిపాలెం : తహసీల్దార్‌ కార్యాలయం సిబ్బంది సమయ పాలన పాటించడంలేదు.తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆంధ్రజ్యోతి సోమవారం విజిట్‌ చేసింది. కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎవరూ లేరు. కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. తహసీల్దార్‌ సెలవులో ఉన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌, ఆర్‌ఐ, సర్వేయర్‌ ముగ్గురూ కొండారెడ్డిపాలెంలో డంపింగ్‌యార్డు నిర్మాణానికి స్దలం సేకరణ పరిశీలనకు వెళ్లారు. మిగిలిన జూనియర్‌ అసిస్టెంట్‌లు ఇద్దరూ, వీఆర్వోలు, ఏఎస్‌ఓలు సమయానికి విదులకు హజరు కాలేదు. ఉదయం 11 గంటలు సమయం దాటిన తరువాత ఒక్కొక్కరుగా విదులకు హజరయ్యారు. ఆదాయం దృవీకరణ పత్రం కోసం కొందరూ, పొలం ఆధార్‌ లింక్‌ చేయించుకోవడానికి మరికొందరూ తదితర సమస్యలపై ప్రజలు అదికారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పీసీపల్లి : తహసీల్దార్‌ కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన మండల రెవెన్యూ అధికారులు సమయపాలన పాటించడంలేదు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ఉదయం 10 గంటలకు తహసీల్దార్‌ కార్యాలయాన్ని విజిట్‌ చేసింది. ఆ సమయానికి అటెండర్‌ మాలకొండయ్య కార్యాలయం తలుపులు తీసి అధికారుల రాకకోసం ఎదురు చూస్తూ కుర్చున్నారు. 10 గంటల 42 నిమిషాలకు డిప్యూటీ తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. తహసీల్దార్‌ సింగారావు నేరేడుపల్లి సచివాలయంలో ఓటీఎస్‌పై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. ఇన్‌చార్జ్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ 11 గంటల వరకు కూడా కార్యాలయానికి రాలేదు. తరచూ అధికారులు ఆలస్యంగానే కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు వస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా కార్యాలయంలో పలు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఆర్‌ఐ, సర్వేయర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ఎఎస్‌ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పట్టిచుకొనే నాథుడు కరువు

కురిచేడు : సంవత్సరాల తరబడి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రజల సమస్యలను పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు.  సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ తహసీలార్‌ కార్యాలయాన్ని విజిట్‌ చేయగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. కురిచేడు మండలం బోదనంపాడు గ్రామంలో ఉన్నత పాఠశాల నిర్మాణానికి 3 సంవత్సరాల క్రితం మాజి మంత్రి శిద్ధా రాఘవరావు తన ట్రస్ట్‌ ద్వారా సర్వే నంబరు 158/2బిలో 12.64 సెంట్ల భూమిని కొనుగోలు చేసి రిజిస్టర్‌ చేయించి పాఠశాలకు అప్పగించారు. ఆ స్ధలాన్ని కన్వర్షన్‌ చేయడానికి తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది 3 సంవత్సరాలుగా తిప్పుతున్నారని బోదనంపాడు గ్రామస్థుడు వేమా వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజలకు ఉపయోగపడే పనులు కూడా సంవత్సరాలు నానబెట్టి పనులు చేయకుండా తిప్పడం ఏంటని ఆయన ప్రశ్నించాడు. రెండు సార్లు చలానా కట్టామన్నారు. 

దర్శి : తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కొరతతో పనులు జరగక ప్రజలు అల్లాడుతున్నారు. పలువురు నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న విషయం ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో వెల్లడైంది. తహసీల్దార్‌ వీడీబీ వరకుమార్‌ ఇతర అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నందున మధ్యాహ్నం వరకు కార్యాలయానికి రాలేదు. ఆయన అంబేడ్కర్‌ వర్థంతి వేడుకల్లో పాల్గొని అనంతరం మోడల్‌స్కూల్లో భోజనాలు పనరిశీలించి మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత కార్యాలయానికి చేరుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్‌ దేవప్రసాద్‌ను డిప్యుటేషన్‌పై పొదిలికి పంపారు. ఆర్‌ఐ శ్రీకాంత్‌ను డిప్యుటేషన్‌పై కురిచేడు వేశారు. నెలరోజులుగా కీలకమైన అధికారులు లేకపోవడంతో పనులు కుంటుపడ్డాయి. 

దొనకొండ : దొనకొండ తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌ చేయగా తహసీల్దార్‌ కే.వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్‌ పి.సురేష్‌, ఆర్‌ఐ నాగార్జునరెడ్డిలు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఏఆర్‌ఐ పోస్టులు గత కొంతకాలంగా ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత కారణంగా సకాలంలో సేవలు అందడం లేదని పలువురు ప్రజలు తెలిపారు. 

ముండ్లమూరు : స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రధాన పోస్టులైనడిప్యూటీ తహసీల్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ఒక ఆర్‌ఐ, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లడంతో వారి స్థానంలో ఇంతవరకు ఎవరిని నియమించలేదు. దీంతో రెవెన్యూకు సంబందించిన పనులు స్తంభించి పోయాయి. తహసీల్దార్‌ పీ పార్వతి, ఆర్‌ఐ ఏ స్రవంతి, ఏఎ్‌సవో మాత్రమే ఉన్నారు. 


Updated Date - 2021-12-07T06:04:40+05:30 IST