అయినా.. గర్వపడుతున్నా

ABN , First Publish Date - 2021-10-13T06:44:04+05:30 IST

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ ప్రస్థానం ముగిసింది. టీమిండియా సారథిగా జట్టును ఎన్నోసార్లు విజయవంతంగా నడిపించిన విరాట్‌..

అయినా.. గర్వపడుతున్నా

విరాట్‌ భావోద్వేగ సందేశం

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ ప్రస్థానం ముగిసింది. టీమిండియా సారథిగా జట్టును ఎన్నోసార్లు విజయవంతంగా నడిపించిన విరాట్‌.. ఐపీఎల్‌లో మాత్రం బెంగళూరుకు కప్పు అందించకుండానే కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. సోమవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు సారథి విరాట్‌.. అందరికీ కృతజ్ఞతలు చెబుతూ సోషల్‌ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పోస్ట్‌ చేశాడు. ‘మేం కోరుకున్న ఫలితం ఇది కాదు. కానీ, టోర్నీ ఆద్యంతం మా జట్టు ఆటగాళ్లు చూపిన ప్రదర్శనకు గర్వపడుతున్నా. నిరుత్సాహపరిచే ముగింపే అయినా మనం తలెత్తుకునే ఉండాలి. చివరిదాకా మద్దతు ఇచ్చిన అభిమానులు, జట్టు యాజమాన్యం, సిబ్బందికి నా ధన్యవాదాలు’ అని విరాట్‌ ట్వీట్‌ చేశాడు. ఇక, లీగ్‌లో జట్టు సభ్యునిగా, కెప్టెన్‌గా తాను చేయగలిగిందంతా చేశానని మ్యాచ్‌ అనంతరం కోహ్లీ తెలిపాడు. తాను రిటైరయ్యే దాకా ఆర్‌సీబీకే ఆడతానని జట్టు పట్ల తనకున్న కృతజ్ఞతను చాటుకున్నాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టు మూడుసార్లు (2009, 2011,  2016) ఫైనల్‌ చేరినా, ఒక్కసారి కూడా విజేత కాలేకపోయింది.  విరాట్‌ కోహ్లీ సారథ్యంలో 2016లో ఆర్‌సీబీ టైటిల్‌ ఫైట్‌లో నిలిచింది.


సోదరినైనందుకు గర్వంగా ఉంది..

‘ఆర్‌సీబీ కెప్టెన్‌గా నీ శక్తిమేరకు పనిచేశావు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జట్టు బాధ్యతను భుజాలపై వేసుకొని నడిపించావు. ఆర్‌సీబీ గొప్ప కెప్టెన్లలో ఒకడిగా నిలిచిపోతావు. గౌరవాభిమానాలకు ఎప్పటికీ అర్హుడివే. నీకు సోదరిగా పుట్టినందుకు గర్వపడుతున్నా’

- ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌ కోహ్లీ సోదరి భావనా కోహ్లీ

Updated Date - 2021-10-13T06:44:04+05:30 IST