మీ-సేవల నుంచి అడంగల్‌ సవరణల తొలగింపు

ABN , First Publish Date - 2020-09-21T09:47:09+05:30 IST

మీ-సేవల నుంచి అడంగల్‌ సవరణల తొలగింపు

మీ-సేవల నుంచి అడంగల్‌ సవరణల తొలగింపు

అడంగల్‌ సవరణల్లో జాప్యం భూ అనుభవదారులు, హక్కుదారులు, సాగుదారులకు పెద్ద సమస్యగా మారింది. కేవలం అడంగల్‌ సవరణలు జరగని కారణంగానే అనేక మంది రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు పొందాలన్నా, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పొందాలన్నా దుర్లభంగా మారుతోంది. జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్న భూ హక్కుదారులు, అనుభవదారులు అడంగల్‌ సవరణల కోసం నిరీక్షిస్తున్నారు.


రెవెన్యూ శాఖ పరిధిలో ఉండే అడంగల్‌ సవరణలను మొదట్లో మీ-సేవల ద్వారా నిర్వహించేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చిన తర్వాత ‘మీ-సేవ’లో వీటిని నిలిపివేశారు. సచివాలయాల పరిధిలోనే వీటిని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటికే జిల్లావ్యాప్తంగా మీ-సేవల ద్వారా వందలాది దరఖాస్తులు రెవెన్యూ శాఖకు చేరాయి. మీ-సేవలో వీటిని నిలిపివేసినట్టు తెలియటంతో రెవెన్యూ అధికారులు ఈ దరఖాస్తులను పక్కన పెట్టారు. ఇదేమీ తెలియక అనేకమంది భూ హక్కుదారులు, అనుభవదారులు రెవెన్యూ కార్యాలయాలకు వచ్చి ఆరా తీయగా, స్థానిక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సమాధానం వచ్చింది. తీరా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే క్రమంలో రిజిస్ర్టేషన్‌ ధరల పెంపుదల అంశం తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలో పక్షం రోజుల పాటు సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో అనేక మంది ఆందోళన చెందుతున్నారు.


అడంగల్‌ సవరణలు ఎందుకు? 

 అడంగల్‌లో సాధారణంగా అనుభవదారులు, హక్కుదారులు, భూ యజమానుల పేర్లలో తప్పులు దొర్లుతుంటాయి. అలాగే రెవెన్యూ సిబ్బంది పొరపాటు కారణంగా హక్కుదారుల భూములను నిషేధిత (22ఏ) భూముల జాబితాలో చేర్చినపుడు, క్లాసిఫికేషన్స్‌ మార్చాల్సినపుడు అడంగల్‌ సవరణల కోసం భూ అనుభవదారులు, హక్కుదారులు, యజమానులు దరఖాస్తు చేసుకుంటారు. 


సచివాలయాల ఉద్యోగులకు శిక్షణ కరువు..

సచివాలయాలకు అడంగల్‌ సవరణలను బదలాయించినా, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వకపోవటంతో భూ యజమానులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చాలా సచివాలయాల్లో డిజిటల్‌ కేంద్రాల సిబ్బందికి అడంగల్‌ సవరణలు ఎలా చేయాలో తెలియకపోవడమే ఇందుకు కారణం. 


సర్వర్‌ సమస్యలతోనూ తంటా  

సచివాలయాల్లో డిజిటల్‌ సేవలకు సర్వర్‌ సమస్యలు తలెత్తడం మరో తలనొప్పిగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఉపయోగించిన సర్వర్లనే ఇప్పటికీ ఉపయోగించటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని సచివాలయ సిబ్బంది సైతం వాపోతున్నారు. 

Updated Date - 2020-09-21T09:47:09+05:30 IST