సచివాలయ పరీక్షలు ప్రశాంతం

ABN , First Publish Date - 2020-09-21T11:48:44+05:30 IST

సచివాలయ పరీక్షలు ప్రశాంతం

సచివాలయ పరీక్షలు ప్రశాంతం

ఉదయం 25,016 మంది, మధ్యాహ్నం 11,642 మంది హాజరు

 422 మంది కొవిడ్‌ బాధితులకు ప్రత్యేక గదుల కేటాయింపు

పలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌ ముత్యాలరాజు, జేసీలు


ఏలూరు/ఏలూరు సిటీ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి) గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల నియామకానికి మొదలైన పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా మొదల య్యాయి. జిల్లావ్యాప్తంగా 122 కేంద్రాల్లో  పంచాయతీ సెక్రటరీ కేటగిరి-1 మహిళా పోలీసు, ఉమెన్‌అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌/వార్డు ఉమెన్‌ అండ్‌ వీకర్‌ సెక్షన్స్‌ ప్రొటెక్షన్‌ సెక్రటరీ, వెల్పేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలకు సంబంధించి  జరిగిన పరీక్షలకు 34,249 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 25,016(73.04 శాతం) మంది రాశారు. 9,233 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన కేటగిరి-3 డిజిటల్‌ అసిస్టెంట్‌ పరీక్షకు 16 వేల 128 మందికి గాను 11 వేల 642 మంది (72.19 శాతం) హాజరయ్యారు. 4,486 మంది గైర్హాజరయ్యారు. జిల్లా యంత్రాంగం పగడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. పది గంటలకు కచ్చితంగా గేట్లు మూసివేశారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లు మూసి వేయించారు. పరీక్ష కేంద్రాల వద్ద హాల్‌ టిక్కెట్‌ నెంబర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. పరీక్షలను కొవిడ్‌ నిబంధనల ప్రకారం నిర్వహించారు. కేంద్రాల వద్ద ప్రత్యేక ఐసొలేషన్‌ గదులు, పాజిటివ్‌ లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక గదులు కేటాయించారు. ప్రతి అభ్యర్థి శానిటైజర్‌ చేసుకున్న తర్వాత, థర్మల్‌ స్కానర్‌తో పరిశీలించి, ఆక్సీమీటర్తఓ పరీక్షలు చేసి పరీక్షా కేంద్రాలలోకి పంపించారు. పాజిటివ్‌ లక్షణాలున్న అభ్యర్థులు ప్రత్యేక కేంద్రాలలో ఇన్విజిలేటర్లు పీపీఐ కిట్లు ధరించారు. కేంద్రాల వద్ద ప్రతి అభ్యర్థిని వీడియో తీశారు. అభ్యర్థులందరూమాస్క్‌లు ధరించారు. లేని వారికి అందజేశారు. ఏలూరు ఏఆర్‌డీజీకే, సుబ్బమ్మదేవి స్కూలు, అమలోద్భవి పాఠశాలల్లోని కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు తనిఖీ చేశారు. ఐసొలేషన్‌ రూమ్‌లు, మందులు, ఇతర వసతులను పరిశీలించారు. ఏలూరు సీఆర్‌ఆర్‌ కళాశాల, కేకేఆర్‌ గౌతమ్‌, సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌, చైతన్య కళాశాల, కస్తూర్భా గర్ల్‌ హైస్కూలు, కేపీడీటీ కేంద్రాలను జాయింట్‌ కలెక్టర్‌(అభివృద్ధి) హిమాన్షుశుక్లా పరిశీలించారు. తాడేపల్లిగూడెం, పెంటపాడులలో ఏర్పాటు చేసిన కేంద్రాలను జాయింట్‌  కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తనిఖీ చేశారు. పరీక్షలు ముగిసిన తర్వాత ఆన్సర్‌ పత్రాలను ఏలూరులోని జిల్లా పరిషత్‌ కార్యాలయానికి చేర్చారు. జడ్పీ సీఈవో శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు. 


9,233 మంది గైర్హాజరు : కలెక్టర్‌ 

జిల్లాలో గ్రామ, వార్డు సెక్రటేరియట్‌ ఉద్యోగాల పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు తెలిపారు. ఉదయం 122 కేంద్రాలలో కేటగిరి-1 పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు పోస్టులకు జరిగిన పరీక్షలకు 34,249 మంది హాజరు కావాల్సి ఉండగా 25,016 మంది వచ్చారు. 9,233 మంది గైర్హాజరు అయినట్టు వివరించారు. వీరిలో 296 మంది కొవిడ్‌ పాజిటివ్‌ లక్షణాలు ఉన్నవారు  ప్రత్యేకంగా పరీక్షలు రాశారని వివరించారు. మధ్యాహ్నం కేటగిరి-3 కింద డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 48 కేంద్రాలలో 16,128 మందికి పరీక్షలు నిర్వహించగా 11,642 మంది హాజరు కాగా, 4,486 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు రాసిన వారిలో 126 మంది కొవిడ్‌ పాజిటివ్‌ బాధితులు ఉన్నట్టు వివరించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతోపాటు పోలీసు బందోబస్తు కల్పించామని కలెక్టర్‌ చెప్పారు. 


Updated Date - 2020-09-21T11:48:44+05:30 IST