గాజువాక-ఎలమంచిలి రోడ్డులో నరక ప్రయాణం

ABN , First Publish Date - 2020-10-19T10:45:41+05:30 IST

గాజువాక-ఎలమంచిలి రోడ్డులో నరక ప్రయాణం

గాజువాక-ఎలమంచిలి రోడ్డులో నరక ప్రయాణం

అచ్యుతాపురం-పరవాడ మధ్య భారీ గోతులు

సెజ్‌కు వాహనాల రాకపోకలతో మరింత ఛిద్రం

గాజువాక జగ్గుజంక్షన్‌ నుంచి వై జంక్షన్‌ వరకూ ఇదే పరిస్థితి

వర్షం పడితే పరిస్థితి వర్ణనాతీతం

13 ఏళ్లగా పునరుద్ధరణ పనులు చేయని ఆర్‌అండ్‌బీ


విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): గాజువాక నుంచి అచ్యుతాపురం మీదుగా ఎలమంచిలికి ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాహనచోదకులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అచ్యుతాపురం-గాజువాక మధ్య అచ్యుతాపురం-పరవాడ, గాజువాకలో జగ్గు జంక్షన్‌ నుంచి వై జంక్షన్‌ వరకు ఎక్కడ చూసినా గోతులే. అడుగు నుంచి ఆరు అడుగుల పొడవు / వెడల్పుతో వున్నాయి. దీంతో వర్షం పడితే గోతుల్లో నీరు నిలిచిపోయి వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల తారు రోడ్డు ఆనవాళ్లు కనిపించక, మట్టి రోడ్డులా తయారైంది. చినుకుపడితే బురదగా మారి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. అచ్యుతాపురంలో అటు ఎలమంచిలి వైపు, ఇటు గాజువాక వైపు అర కిలోమీటరు మేర బాగున్న రోడ్డుకన్నా, గోతులే అధికంగా వున్నాయి. 


45 కి.మీ. పొడవైన రోడ్‌..

ఎలమంచిలి నుంచి గాజువాక జగ్గు జంక్షన్‌ వరకు 44 కి.మీ. (ఉక్కు టౌన్‌షిప్‌ మినహాయించి) రోడ్డును రోడ్లు, భవనాల శాఖ నిర్వహిస్తోంది. ఎలమంచిలి నుంచి మడుతూరు వరకు ఎలమంచిలి డీఈ, మడుతూరు నుంచి గాజువాక వరకు విశాఖ డీఈ పరిధిలో ఉంది. సాధారణంగా నాలుగైదు సంవత్సరాలకొకసారి రహదారులకు పునరుద్ధరణ పనులు చేస్తుంటారు. అత్యవసరం అనుకుంటే గోతులున్నచోట మరమ్మతులు చేస్తారు. అయితే ఈ రోడ్డును  చివరిసారి 2006-07లో పునరుద్ధరణ పనులు చేశారు. మళ్లీ ఇంతవరకు పట్టించుకోలేదు. అచ్యుతాపురం సెజ్‌లో గత పదేళ్లలో  అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఈ పరిశ్రమలు, కంపెనీల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌, యంత్రసామగ్రి రవాణా, నిర్మాణంపూర్తయిన తరువాత ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు దిగుమతి, తయారైన ఉత్పత్తుల ఎగుమతికి నిత్యం వందలాది భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంకా ఆయా పరిశ్రమలు, కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల కోసం పదుల సంఖ్యలో వాహనాలను నడుపుతున్నారు. రహదారికి కనీస మరమ్మతులు కూడా చేయకపోవడం, భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్డు మొత్తం ధ్వంసమైంది. రోడ్డు దుస్థితిపై ప్రజాప్రతినిధులు, ప్రజలు, పరిశ్రమల యాజమాన్యాల నుంచి వచ్చిన వినతుల మేరకు అభివృద్ధి పనుల కోసం అధికారులు రెండు పర్యాయాలు ప్రతిపాదనలు రూపొందించారు. గత ప్రభుత్వ హయాం చివరిలో రూ.4 కోట్లు మంజూరయ్యాయి. అయితే వైీసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని రద్దు చేసింది. మళ్లీ ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదు.  కాగా రోడ్డు దుస్థితిని ఆర్‌అండ్‌బీ డీఈ ఫణీంద్ర వద్ద ప్రస్తావించగా.... ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. వారం రోజుల్లో గాజువాకలో జగ్గు జంక్షన్‌, పరవాడలో గోతులు పూడ్చుతామన్నారు. ఎలమంచిలి డీఈ విద్యాసాగర్‌ మాట్లాడుతూ, వర్షాలు తగ్గిన వెంటనే మడుతూరు నుంచి అచ్యుతాపురం వరకు మరమ్మతులు చేస్తామన్నారు. 

Updated Date - 2020-10-19T10:45:41+05:30 IST