ఆస్తిపన్ను పెంపు సామాన్యులకు పెనుభారం

ABN , First Publish Date - 2021-12-02T06:12:38+05:30 IST

క్యాపిటల్‌ విలువ ఆధారిత పన్ను చట్టాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది ఎంవీ రాజారామ్‌ డిమాండ్‌ చేశారు.

ఆస్తిపన్ను పెంపు సామాన్యులకు పెనుభారం
సమావేశంలో మాట్లాడుతున్న రాజారాం, మేడా శ్రీనివాస్‌

ఏపీ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రాజారాం

గుంటూరు, డిసెంబరు 1: క్యాపిటల్‌ విలువ ఆధారిత పన్ను చట్టాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది ఎంవీ రాజారామ్‌ డిమాండ్‌ చేశారు. అరండల్‌పేటలోని ఓ హోటల్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నూతన విధానంతో 100, 150 శాతం పన్ను పెరగనుందన్నారు. ఫలితంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంపై గుంటూరుకు చెందిన అవగాహన సంస్థ, ఆంధ్ర న్యాయవాదుల సంఘం, సిటీ హౌస్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌, సర్వీస్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. కనీసం ప్రజాభిప్రాయం తీసుకోకుండా, అసెంబ్లీలో సైతం చర్చలేకుండా ఈ చట్టం చేశారని ఇది అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఆంధ్రఫోరం లాయర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మేడా శ్రీనివాస్‌ మాట్లాడుతూ చట్టాన్ని రద్దు చేసేవరకు న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, న్యాయవాది నడింపల్లి గురుదత్తు, హరి, పీఎస్‌ మూర్తి తదితరులున్నారు. 

 

Updated Date - 2021-12-02T06:12:38+05:30 IST