వాయిదాల్లో కొయ్యండి

ABN , First Publish Date - 2021-07-23T08:24:20+05:30 IST

వాయిదాల్లో కొయ్యండి

వాయిదాల్లో కొయ్యండి

అప్పుల పరిమితిపై అభ్యర్థన 

కొత్త రుణాలకు అనుమతివ్వండి.. 

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మొర

అనుమతి రాకపోతే ఆగస్టులో దివాలాయే!

25 వేల కోట్లకు గ్యారెంటీని దాచిన సర్కార్‌

293వ అధికరణ ఉల్లంఘన

కేంద్రం కళ్లకు గంతలు కట్టి..

బ్యాంకులతో మూడు ఒప్పందాలు

పైగా వాటికి కేబినెట్‌ ఆమోదముద్ర

ఇది ఆర్థిక నేరం కూడా: నిపుణులు

కేంద్రానికి తెలిస్తే ఏం చెప్పాలి?

ఆర్థిక శాఖ అధికారుల ఆందోళన


కొత్త అప్పులు తెచ్చుకోవడానికి కేంద్రం అనుమతించకపోతే ఆగస్టు నెలలో రాష్ట్రప్రభుత్వం దివాలాతీసే దుస్థితి నెలకొంది. పరిమితిని మించి అప్పులు తేవడంతో ఇప్పటికే కేంద్రం రాష్ట్ర రుణపరిమితిపై కోత విధించింది. ఆ కోతను ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో అమలు చేయాలని జగన్‌ సర్కారు మొరపెట్టుకుంటోంది. కేంద్రం ఆలకించకపోతే ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటో తేదీన ఠంచనుగా ఇవ్వాల్సిన వేతనాలు, పింఛన్లను నెల మొత్తం విడతలవారీగా చెల్లిస్తున్న రాష్ట్రప్రభుత్వం.. ఇప్పుడు అప్పుల్లో కూడా వాయిదాల పద్ధతిలో కోత కోయాలని కేంద్రప్రభుత్వాన్ని వేడుకుంటోంది. పరిమితికి మించి అప్పులు చేసినందుకు.. ఈ ఆర్థిక సంవత్సరం రుణ పరిమితిలో కేంద్రం రూ.18 వేల కోట్లు కోత విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కోతను ఒక్కసారిగా కాకుండా ఏడాదికి కొంచెంగా లేదా రెండేళ్ల తర్వాత అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ కేంద్ర అధికారులను కోరుతున్నట్లు సమాచారం. జూలైలో అప్పుల పరిమితి పూర్తిగా ముగిసిపోయింది. ఆగస్టు నెలకు కొత్తగా అప్పులకు అనుమతి రాకపోతే రాష్ట్రం దివాలా తీయడమే! ఉద్యోగులకు వేతనాలిస్తే సంక్షేమ పథకాలకు ఇవ్వలేరు.  పథకాలకు ఇస్తే ఉద్యోగులకు వేతనాలివ్వలేరు. దీంతో నాలుగు రోజులుగా మంత్రి, ముఖ్య కార్యదర్శి ఢిల్లీలోనే మకాం వేసి అదనంగా అప్పులకు అనుమతి తెచ్చుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. 


రాజ్యాంగ ఉల్లంఘనకు కేబినెట్‌ ఆమోదమా?

రాజ్యాంగంలోని 293వ అధికరణను ఉల్లంఘించి.. కేంద్రం కళ్లకు గంతలు కట్టి రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌(ఏపీఎ్‌సడీసీ) రూ.25 వేల కోట్ల రుణం తీసుకోవడానికి ఆర్థిక శాఖ గ్యారెంటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి బ్యాంకులతో మూడు ఒప్పందాలు కుదుర్చుకుని.. వాటికి కేబినెట్‌ ఆమోదం కూడా తీసుకున్నారు. 293వ అధికరణ ప్రకారం కేంద్రానికి తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయకూడదు. అలా చేస్తే అది తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. రాష్ట్రప్రభుత్వం ఏపీఎ్‌సడీసీకీ గ్యారెంటీ ఇచ్చిన 25 వేల కోట్లలో రూ.21,500 కోట్లు వాడేసుకోవడం ద్వారా తీవ్ర ఉల్లంఘనకు పాల్పడింది. ఆ విషయం బయటకు రాకుండా ఉండేందుకు బడ్జెట్‌ పుస్తకాల్లో ప్రచురించలేదు. రూపాయి విలువను కాపాడేందుకు, విపరీతమైన అప్పుల నుంచి రాష్ట్రాలను కాపాడడానికి రాజ్యాంగంలోని 292, 293 అధికరణల ప్రకారం ద్రవ్య నియంత్రణ-బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టాన్ని కేంద్రం రూపొందించింది. దీని ప్రకారమే రాష్ట్రాలు అప్పు తెచ్చుకోవాలి. అవి చట్టబద్ధమైన అప్పులు. అప్పులకు చట్టం ఉన్నప్పటికీ రాష్ట్రాలు నేరుగా ఆర్‌బీఐ వద్దకు వెళ్లి తెచ్చుకోవడానికి వీల్లేదు. ముందుగా కేంద్రం అనుమతి ఇవ్వాలి. అంటే ఆ అప్పులకు కేంద్రం గ్యారెంటీగా ఉంటుందన్న మాట. ఆ తర్వాతే ఆర్‌బీఐ వద్దకు వెళ్లి ఓఎంబీ(ఓపెన్‌ మార్కెట్‌ బారోయింగ్‌) రూపంలో తెచ్చుకోవాలి. ఇందుకు గాను రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆర్‌బీఐ వద్ద తాకట్టులో ఉంటుంది. రాష్ట్రప్రభుత్వం ఆ అప్పులు చెల్లించడంలో విఫలమైతే ఆర్‌బీఐ చెల్లిస్తుంది. ఆ అప్పులు చెల్లించేందుకు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోతే కేంద్ర ఖజానా నుంచి చెల్లిస్తారు. చట్టబద్ధమైన అప్పులకే కేంద్రం ఇన్ని షరతులు పెట్టినప్పుడు.. దానికి తెలియకుండా బయటి నుంచి రాష్ట్రాలు అప్పులు చేయకూడదని.. అది తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన అని, పైగా కేబినెట్‌ ఆమోదించడం ఆర్థిక నేరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


ఉద్దేశపూర్వకంగానే దాచారా ?

రూ.25 వేల కోట్ల రుణానికి గ్యారెంటీ ఇవ్వడం, అందులో ఇప్పటికే రూ.21,500 కోట్లు వాడుకున్న విషయాన్ని రాష్ట్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాచిందన్న ఆరోపణలు వస్తున్నాయి. బడ్జెట్‌ పుస్తకాల్లో ప్రచురిస్తే ముందే అకౌంటెంట్‌ జనరల్‌కు, ఆ తర్వాత కేంద్రానికి తెలిసిపోతుంది. అందుకే ఆ పుస్తకాల్లో కావాలనే పొందుపరచలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. బుగ్గన, రావత్‌ల విజ్ఞప్తి మేరకు కేంద్రం అప్పుల అనుమతి అంశాన్ని పరిశీలిస్తూ రకారకాల సమాచారం అడుగుతోంది. రాష్ట్రం కూడా ఆ సమాచారం ఇస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ రూ.25,000 కోట్ల గ్యారెంటీ విషయం తనకు తెలిస్తే అదనపు అప్పులకు అనుమతి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరిస్తుందా..? అడిగితే ఏం సమాధానం చెప్పాలన్న దానిపై ఆర్థిక శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.



Updated Date - 2021-07-23T08:24:20+05:30 IST