ఎస్పీ బాలు మృతికి సంతాపం తెలిపిన ఏపీ అసెంబ్లీ

ABN , First Publish Date - 2020-11-30T18:10:55+05:30 IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

ఎస్పీ బాలు మృతికి సంతాపం తెలిపిన ఏపీ అసెంబ్లీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఎస్పీ బాలు మృతికి సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సుమారు 16 భాషల్లో 37 వేల పాటలు పాడి గిన్నిస్ రికార్డు సాధించారని కొనియాడారు. ఎస్పీ బాలు 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా, కోనేటమ్మపేటలో శ్రీపతి పండితా రాజ్యుల సాంబమూర్తి, శకుంతులమ్మ దంపతులకు జన్మించారని, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యతగా, నటుడుగా, నిర్మాతగా, రచయితగా, డబ్బింగ్ కళాకారుడిగా పేరు గాంచిన ఆయన ఇంజనీరింగ్ చదివారన్నారు.


శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రం ద్వారా 1966లో సినీ నేపథ్య గాయకుడిగా ఎస్పీ బాలు పరిచయమయ్యారని, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, సంస్కృతి, ఆంగ్ల, ఉరుదు భాషల్లో వేల సంఖ్యలో పాటలు పాడారని తమ్మినేని తెలిపారు. 1968లో పెళ్లంటే నూరేళ్లపంట సినిమా ద్వారా నటుడిగా పరిచయమై అనేక సినిమాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డును ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించిందన్నారు. 2012లో ఎన్టీఆర్ జాతీయ పురష్కారం, మిథునం చిత్రానికి ఏపీ నంది పురష్కారం అందుకున్నారని స్పీకర్ తెలిపారు. 2016లో ఇండియన్ ఫిలిమ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారన్నారు. ఉత్తమ గాయకుడిగా ఆరుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారని తమ్మినేని సీతారాం తెలిపారు.

Updated Date - 2020-11-30T18:10:55+05:30 IST