నేడు AP Cabinet సమావేశం.. ఈ కీలక అంశాలపై చర్చ

ABN , First Publish Date - 2021-08-06T13:29:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన...

నేడు AP Cabinet సమావేశం.. ఈ కీలక అంశాలపై చర్చ

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు విషయాలపై నిశితంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సుమారు మూడు గంటలకుపైగా ఈ భేటీ జరిగే అవకాశం ఉంది.


చర్చకు వచ్చే కీలకాంశాలు ఇవే..

- ఏపీ లాజిస్టిక్స్ పార్క్‌

- నూతన సీడ్ పాలసీ, నేతన్న నేస్తం

- ఆక్వా రైతుల మార్కెటింగ్ కోసం ఫిష్ మార్కెటింగ్ పాలసీ

- ‘నాడు-నేడు’ రెండో దశ పనులు ఆగస్ట్-16న ప్రారంభం కానుండడంతో వాటికి కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశం

- ఈ నెల 16 నుంచి పాఠశాలలు తెరవనున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేబినెట్‌లో చర్చ

- కరోనా థర్డ్ వేవ్ సన్నద్ధతపై చర్చ

- వాక్సిన్ కేటాయింపుపై, మరోసారి కేంద్రానికి లేఖ రాయలన్న విషయంపై చర్చ

- జాతీయ విద్య విధానంపై చర్చ


జల జగడంపై..!

వీటితో పాటు తక్కువ పరిహారం అందుకున్న పోలవరం నిర్వాసితులకు పరిహారం పెంచి ఇచ్చే అంశంపైనా చర్చించనున్నారు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై కేబినెట్ చర్చించనున్నది. ఆర్అండ్‌బికి చెందిన 4వేల కోట్ల ఆస్తులను ఏపీఎస్ఆర్టీసీకి బదలాయించే అంశంపై కేబినెట్‌లో ప్రతిపాదించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కేంద్రం, కాగ్, విపక్షాలు లెవనెత్తుతున్న అంశాలు కూడా కేబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా.. జలవివాదం ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. మధ్యవర్తిత్వంతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సీజేఐ ఎన్వీ రమణ చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో వేరే బెంచ్‌కు ఈ పిటిషన్ బదిలీ చేసిన విషయం తెలిసిందే.


పీవీ సింధుకు ఏమిద్దాం..?

టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కాంస్య పతకం సాధించిన విషయం విదితమే. సింధుకు ఏపీ ప్రభుత్వం ఏం చేయాలి..? ఎలాంటి ప్రోత్సాహకాలు అందించాలి..? అనే విషయాలపై ఇవాళ కేబినెట్‌లో చర్చించనున్నారు. భేటీలో ముందుగా కేబినెట్.. సింధుకు అభినందనలు తెలియజేయనున్నది.

Updated Date - 2021-08-06T13:29:26+05:30 IST