Sep 14 2021 @ 01:10AM

చిరంజీవికి ఏపీ సీఎం జగన్‌ పిలుపు

  • ఈ నెల 20న కలవనున్న చిత్రప్రముఖులు


తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడానికి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్న చిరంజీవి బృందానికి అక్కడ నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 20న మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, దిల్‌ రాజు, సురేశ్‌బాబు తదితరులు జగన్‌ను కలవనున్నారు. కరోనా కష్టకాలంలో తెలుగు చిత్రపరిశ్ర ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకువస్తామని చిరంజీవి నేతృత్వంలోని బృందం ఇంతకుముందు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ద్వారా కబురుపంపింది. ఆయన ఈ విషయం ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. త్వరలోనే వారికి సమయం ఇద్దామంటూ పేర్నితో సీఎం జగన్‌ చెప్పారు. ఈ నెల 20న చిత్రప్రముఖులను ఆహ్వానించమని మంత్రి పేర్ని వెంకట్రామయ్యకు సీఎం చెప్పారు. ఈ సమాచారం చిరంజీవికి మంత్రి పేర్ని చేరవేశారు.

 కొత్త సినిమాలకు బెనిఫిట్‌ షోలు వేసే అవకాశం ఇవ్వాలనీ, నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే వెసులుబాటు కల్పించాలనీ, అదే విధంగా గ్రేడ్‌-2 కేంద్రాల్లో నేల టిక్కెట్టుకు పది రూపాయలు.. కుర్చీకి 20 రూపాయలు వసూలు చేసే విధానాన్ని రాష్ట్రమంతా వర్తింపజేయవద్దని ముఖ్యమంత్రి జగన్‌ను కోరేందుకు చిరంజీవి బృందం సన్నద్ధమవుతోందని సమాచారం. కాగా.. ఇటీవల ప్రభుత్వమే నేరుగా సినీ టిక్కెట్ల విక్రయానికి తెరతీసింది. దీనిపైనా .. చిరంజీవి బృందం తమ అభిప్రాయాన్ని వెల్లడించే వీలుందని అంటున్నారు.  - ఆంధ్రజ్యోతి, అమరావతి