సీపీఎస్‌ రద్దు.. తూచ్‌!

ABN , First Publish Date - 2022-04-30T08:03:13+05:30 IST

రాష్ట్రంలోని కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) ఉద్యోగులు నిండా మునిగిపోయారు. గద్దెనెక్కిన వారంలోగా సీపీఎ్‌సను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) అమలు చేస్తానని ప్రతిపక్ష నేతగా ఊరూవాడా తిరిగి హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

సీపీఎస్‌ రద్దు.. తూచ్‌!

మరో హామీకి జగన్‌ ఎగనామం!!

సొంత పత్రికకు ఇచ్చిన ప్రకటనలో

చెప్పకనే చెప్పిన ముఖ్యమంత్రి

ప్రత్యామ్నాయాలపై లోతైన కసరత్తట

ఓపీఎస్‌ భావితరాలపై భారమంటూ

ఉద్యోగులపై విషం చిమ్మే యత్నం

జీపీఎస్‌లో 33ు గ్యారెంటీ పెన్షన్‌..

ఆప్షన్లు ఎంచుకోవాలని సూచనలు

33ు వస్తుందని చెబితే చాలా?

ఎలా వస్తుందో చెప్పరా?

ఇది ఓపీఎస్‌తో సమానమవుతుందా?

అబద్ధాల ప్రచారానికి కోట్లకు కోట్లు

సీపీఎస్‌ ఉద్యోగుల ఆగ్రహం

నాడు మాటిచ్చి మూడేళ్ల తర్వాత

మడమ తిప్పుతారా అని ధ్వజం


నాడు

‘సీపీఎస్‌ రద్దు కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఆ సోదరులందరికి చెబుతా ఉన్నా.. దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చినాక.. వారం రోజుల్లోనే సంతకాలు పెట్టి మీకిస్తాను అని చెబుతా ఉన్నా’..

 ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ


నేడు

‘ముఖ్యమంత్రిగా సీపీఎస్‌ను రద్దు చేస్తూ సంతకం పెట్టాలంటే అది నిమిషం పని... మరి నేను గానీ, మన ప్రభుత్వం గానీ ఎందుకింత ఆలోచిస్తున్నాం? ప్రత్యామ్నాయాలపై ఎందుకింత లోతైన కసరత్తు చేయాల్సి వస్తోంది..?’

సొంత పత్రికలో ఇచ్చిన ప్రకటనలో సీఎం


అమరావతి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) ఉద్యోగులు నిండా మునిగిపోయారు. గద్దెనెక్కిన వారంలోగా సీపీఎ్‌సను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) అమలు చేస్తానని ప్రతిపక్ష నేతగా ఊరూవాడా తిరిగి హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మూడేళ్లపాటు కాలయాపన చేసి.. మాటతప్పారు.. మడమా తిప్పేశారు. సీపీఎస్‌ రద్దు ప్రసక్తే లేదని రూ.కోట్ల ప్రజాధనం ఖర్చుతో సొంత పత్రికలో శుక్రవారం ఇచ్చిన ప్రకటనలో చెప్పకనే చెప్పారు. తాము ప్రతిపాదించిన గ్యారెంటీ పెన్షన్‌ స్కీం (జీపీఎస్‌) అమల్లోకి తేవడం ఖాయమని తేల్చేశారు. అందులో ఇచ్చిన ఆప్షన్లు ఎంచుకోవాలంటూ.. వేరే గత్యంత రం లేదని నర్మగర్భంగా చెప్పారు.


దీంతో 3 లక్షలా 8 వేల మంది సీపీఎస్‌ ఉద్యోగులు భగ్గుమన్నారు. ఈ ప్రకటనంతా అబద్ధాలపుట్ట అని మండిపడ్డారు. ఇప్పుడున్న సీపీఎస్‌ వల్ల పెన్షన్‌ మొత్తంపై ఎలాంటి గ్యా రెంటీ లేదని.. జగనన్న ఇచ్చే జీపీఎ్‌సతో చివరి బేసిక్‌ పేలో 33 శాతాన్ని గ్యారెంటీడ్‌ పెన్షన్‌గా పొందుతారని.. ప్రస్తుత సీపీఎస్‌ కన్నా ఇది కనీసం 70 శాతం ఎక్కువంటూ అన్నీ అసత్యాలతో ప్రకటన ఇచ్చారని ధ్వజమెత్తారు. సీపీఎస్‌ రద్దుపై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం ఇటీవల మంత్రుల కమిటీని వేయడం.. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల ముందు జీపీఎస్‌ ప్రతిపాదనలు ఉంచడం.. అవి నిర్ద్వంద్వంగా తిరస్కరించడం తెలిసిందే.


ఊరకే తెరపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ లెక్కలు వేస్తే కుదరదని.. దాని ప్రతులివ్వాలని.. సంఘాల నేతలు చెప్పారు. తర్వాత ఆ కాపీలను ప్రభుత్వం పంపింది. వాటిని పరిశీలించిన  సంఘాలు.. ఒకట్రెండు అంశాల్లో తప్ప సీపీఎ్‌సకు, జీపీఎ్‌సకు తేడాయే లేదని.. దీనిని అంగీకరించేది లేద ని స్పష్టం చేశాయి. ఒక పక్క తమతో చర్చలంటూ మరో పక్క జీపీఎ్‌సపై ప్రకటన ఇవ్వడంలోని అంతరార్థం.. ఆ విధానాన్ని అమలు చేసి తీరతామని చెప్పడమేనని ఉద్యోగులు భావిస్తున్నారు.  సీపీఎస్‌, జీపీఎస్‌ కొనసాగితే ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేని దుస్థితిలోకి జా రిపోతామని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సీపీఎస్‌ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులుండవు. రిటైర్‌మెంట్‌ తర్వాత ఆస్పత్రి ఖర్చులకు ఇచ్చే అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌(ఏక్యూపీ) కూడా అందదు. కొందరు ఉద్యోగులకైతే ప్రస్తుతం నెలకు రూ.500, రూ.1000 పెన్షన్‌ కూడా వస్తోంది. ఇలా చూస్తే దీనమైన స్థితి తమకు  దాపురిస్తుందని సీపీఎస్‌ ఉద్యోగులు చెబుతున్నారు.


టక్కర్‌ ఏం చెప్పారు..?

ఓపీఎస్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్‌ ఉంటుంది. సీపీఎస్‌ ఉద్యోగులకు లేదు. అయితే చంద్రబాబు మా జీ సీఎస్‌ ఎస్‌పీ టక్కర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కమిటీ దీనికి పరిష్కారం సూచించింది. రిటైర్‌మెంట్‌ తర్వాత సీపీఎస్‌ ఉద్యోగికి ప్రభుత్వంతో సంబంధాలు తెగిపోకూడదని భావించి కార్పస్‌ ఫండ్‌కు చట్టబద్ధత కల్పించి ఆ మొత్తాన్ని ట్రెజరీ నుంచి ఇవ్వాలని టక్కర్‌ ప్రతిపాదించారు. అలాగే ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబానికి పింఛను ట్రెజరీ నుంచే ఇవ్వాలని సూచించారు. కానీ జగన్‌ చెబుతున్న జీపీఎ్‌సలో ఫ్యామిలీ పెన్షన్‌ ఇచ్చేదీ లేనిదీ ఎక్కడా చెప్పలేదు. ఓపీఎస్‌ ఉద్యోగులతో సమానంగా సీపీఎస్‌ ఉద్యోగులకు రావలసిన పెన్షన్‌ను లెక్కించే బాధ్యత ఏజీ కార్యాలయం చేపట్టాలని టక్కర్‌ కమిటీ పేర్కొంది. సీపీఎస్‌ ఉద్యోగుల పెన్షన్‌ కోసం ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇప్పుడు జగన్‌ జీపీఎ్‌సలో లెక్కించి ఎంత తగ్గుతుందో తెలుసుకోవడాల్లేవు.. 33.5 శాతం పెరుగుతుందన్న ప్రచారం తెచ్చారు. అదెలా వస్తుం దో.. సంబంధిత గణాంకాలను ఉదాహరణలతో వెల్లడి స్తే నమ్మశక్యంగా ఉండేది. 30 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్లకే ఈ 33.5 శాతం పెన్షన్‌ వస్తుందా.. అంతకంటే తక్కువ సర్వీసు ఉన్న వాళ్ల పరిస్థితేంటో ఎక్కడా చెప్పలేదు.


అంతేకాదు.. ప్రస్తుతం మార్కెట్లో వడ్డీ రేట్లు బాగా తగ్గుతున్నాయని.. సీపీఎస్‌ ఉద్యోగులకు 10 శాతమైనా పెన్షన్‌ వస్తుందో రాదోనని ఒక వైపు చెబుతూనే.. మరోవైపు 33.5 శాతం పెన్షన్‌ గ్యా రంటీ అని చెప్పడంపై ఉద్యోగులు సందేహం వ్యక్తంచేస్తున్నారు. పీఆర్‌సీకి సంబంధించిన డీఏ బకాయిల నుంచి ఐఆర్‌ రికవరీ చేయబోమంటూ మీటింగ్‌ మినిట్స్‌లో పేర్కొన్న ప్రభుత్వం.. 4 నెలలవుతున్నా ఇంకా జీవో ఇవ్వలేదు.  ప్రస్తుతం తమకు ప్రభుత్వం చెల్లించాల్సిన డీఏ బకాయిలు రూ.18,000 కోట్లకు చేరుకున్నాయని, కోట్లకు కోట్టు పెట్టి ఆర్భాటంగా అసత్య ప్రకటనలు ఇస్తున్న ప్రభుత్వానికి ఆ బకాయిలు గుర్తు రావ డం లేదా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తమకు జగన్‌ సర్కారు ఇచ్చిన హెల్త్‌ కార్డులు పనిచేయడం లేదని.. లక్షల రూపాయల ఆస్పత్రి బిల్లులు కట్టలేక అడుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందని వాపోతున్నారు.  


ఎగ్జిట్‌ ప్లాన్‌ లేదనేది అవాస్తవం!

సీపీఎస్‌ నుంచి బయటకు వచ్చేందుకు ఎగ్జిట్‌ ప్లాన్‌ కు అవకాశం లేదంటూ జగన్‌ సర్కారు ఇంకో అసత్యం చెబుతోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. 1999 గ్రూప్స్‌ అభ్యర్థులు సీపీఎ్‌సకి ముందే రిక్రూట్‌ అయి నా.. వారి అపాయింట్‌మెంట్‌ సీపీఎస్‌ తర్వాత జరిగిం ది. దీంతో వారంతా కొత్త పెన్షన్‌ స్కీం పరిధిలోకి వచ్చారు. కేంద్రం ఇటీవల వారందరికీ తిరిగి ఓపీఎ్‌సలోకి వెళ్లే వెసులుబాటు కల్పించింది. అందుచేత వారికి అమలు చేసిన ఎగ్జిట్‌ ప్లాన్‌నే తమకూ అమలు చేయాలని సీపీఎస్‌ ఉద్యోగులు కోరుతున్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల కంట్రిబ్యూషన్లను ఆయా ఫండ్‌ మేనేజింగ్‌ సంస్థ లు పలు చోట్ల పెట్టుబడులు పెట్టి ఉంటాయి. ఆ పె ట్టుబడుల ఒప్పందం ముగియడానికి సమయం ప ట్టొచ్చు. కానీ ఆ డబ్బులు అసలు వెనక్కి రాకపోవడమంటూ ఉండదు. కాబట్టి ఆ సంస్థల నుంచి తమ డబ్బులను దశలవారీగా ఇచ్చేసి తమను ఓపీఎ్‌సలోకి మార్చాలని ఉద్యోగులు కోరుతున్నారు. 


ఖర్చులపై అతితెలివి..

జీపీఎస్‌ కంటే గొప్ప విధానం లేదంటూ ఉద్యోగుల ను మఽభ్యపెట్టేందుకు ప్రభుత్వం చూపుతున్న అతితెలివి పరాకాష్టకు చేరింది. శుక్రవారంనాటి ప్రకటనలో.. పెన్షన్ల ఖర్చు 2040వ సంవత్సరానిది చూపెట్టి.. ఆదాయం మాత్రం 2021కి చూపిస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.65,695 కోట్లు కాగా, 2021-22లో రూ.లక్షన్నర కోట్లకు పెరిగింది. ఈ లెక్కన 2040 నాటికి రాష్ట్ర ఆదాయం రూ.4.31 లక్ష ల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ లెక్కలు దాచి.. కేవలం పెన్షన్ల ఖర్చు చూపించి పెన్షన్ల ఖర్చే ఎక్కువగా ఉంటుందంటూ సర్కారు ప్రచారం చేసుకుంటోంది.


ఆప్షన్లు ఎంచుకోవాలా?

జీపీఎస్‌ కింద జగనన్న ప్రభుత్వం ఇస్తున్న ఆప్షన్స్‌ అంటూ ప్రకటనలో ఊదరగొట్టడంపై ఉద్యోగులు మం డిపడుతున్నారు. జీపీఎస్‌ వద్దని తామంటే ఆప్షన్లు ఎంచుకోవాలనడాన్ని తప్పుబడుతున్నారు. ఆప్షన్‌-1 కిం ద సీపీఎస్‌ ఉద్యోగి జీతంలో 10 శాతం చెల్లిస్తే ప్ర భుత్వం మరో 10 శాతాన్ని కలిపి రిటైర్‌మెంట్‌ తర్వాత ఉద్యోగి ఆఖరు నెల బేసిక్‌ పేలో 33 శాతం గ్యారెంటీడ్‌ పెన్షన్‌గా ప్రతినెలా అందిస్తామని.. ఆప్షన్‌-2లో ఉద్యోగి తన జీతంలో 14ు చెల్లిస్తే ప్రభుత్వం మరో 14 శాతాన్ని కలిపి ఆఖరు నెల బేసిక్‌ పేలో 40ుగ్యారంటీడ్‌ పెన్షన్‌గా అందిస్తామని చెప్పింది. అంటే సీపీఎస్‌ లో ఉద్యోగి కంట్రిబ్యూషన్‌ ఎలా ఉందో అదే కొనసాగుతుందన్న మాట. అయితే.. తమకు కావలసింది భద్రతతో కూడిన పెన్షన్‌ అని ఉద్యోగులు అంటున్నారు. ఓపీఎస్‌ ఇస్తే భారం పడుతుందంటూ గోబెల్స్‌ ప్రచారానికి ప్రభుత్వం తెరతీసిందని ఏపీసీపీఎ్‌సయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం దాస్‌ విమర్శించారు. జీతాలు, పెన్షన్ల వల్ల కుప్పకూలిన దేశాలు గానీ, రాష్ట్రాలు గానీ ఉన్నాయా అని నిలదీశారు. పీఆర్‌సీలాగే జీపీఎస్‌ విషయంలోనూ సీపీఎస్‌ ఉద్యోగులను మభ్యపెట్టే ప్రయ త్నం చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్‌ తరాలకు భారం అంటే.. సీపీఎస్‌ ఉద్యోగులు భవిష్యత్‌ తరాల్లో లేరా.. వీరికి సామాజిక భద్రత అవసరం లేదా అని ప్రశ్నించారు. కాగా, సీపీఎ్‌సను రద్దు చేసి ఉద్యోగులకు శాశ్వతంగా సామాజిక భద్రత కల్పించాల్సిన ప్రభు త్వం.. జీపీఎ్‌సపై ఉద్యోగులు ఆలోచించాలని ప్రకటన ఇవ్వడం ఏంటని సచివాలయ సంఘం ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్‌ ఆక్షేపించారు. 4.9 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు, రూ.24 వేల వేల కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఉన్న రాజస్థాన్‌ రాష్ట్రం భవిష్యత్‌ పర్యవసానాలు ఆలోచించకుండానే సీపీఎస్‌ రద్దు చేసిందా? అని ప్రశ్నించారు. 


 ‘ఆంధ్రజ్యోతి’ అడగకపోతే..

8 టక్కర్‌ కమిటీ ఎలా వచ్చింది?

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): సీపీఎస్‌ రద్దుపై మూడేళ్లు నాన్చుతూ వచ్చి.. ఇప్పుడు జీపీఎస్‌ అమల్లోకి తెస్తామంటున్న జగన్‌ ప్రభుత్వం.. ఇదివరకటి ప్రభుత్వాలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించలేదని అబద్ధం ప్రచారం చేసేందుకు ప్రయత్నించింది. శుక్రవారం సొంత మీడియాకు, కొన్ని ఆంగ్ల పత్రికల్లో జీపీఎ్‌సపై 2 పేజీల ప్రకటన ఇచ్చింది. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి ఇచ్చిన ఈ ప్రకటనలో.. ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తున్న ‘ఆంధ్రజ్యోతి’పై అక్కసు వెళ్లగక్కారు. ఉద్యోగుల ప్రయోజనాల గురించి గత ప్రభుత్వాలను అడగలేదని రాశారు. కానీ.. ఈ రోజే కాదు.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఉద్యోగుల సమస్యలు, వారి ఆందోళనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ‘ఆంధ్రజ్యోతి’ ఎప్పుడూ ముందుంది. చంద్రబాబు హయాం లో సీపీఎస్‌ ఉద్యోగుల ఆందోళనలకు విస్తృత ప్రా చుర్యం కల్పించింది. ఈ నేపథ్యంలోనే నాటి సీఎం చంద్రబాబు సీపీఎస్‌ ఉద్యోగులకు న్యాయం చేసేందుకు తగు సిఫారసులు చేసేందుకు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ టక్కర్‌ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే ఉద్యోగుల కోసం టక్కర్‌ కమిటీ నివేదికపై అందరికంటే ముందుగా 2019 జూన్‌ 10నే ‘ఆంధ్రజ్యోతి’ సమగ్ర కథనం ప్రచురించింది. చంద్రబాబు వేసిన టక్కర్‌ కమిటీ సమగ్ర స్థాయిలో 72 పేజీలతో నివేదిక ఇచ్చింది.  2030 నుంచి సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రయోజనాలు అందించాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-30T08:03:13+05:30 IST