Abn logo
Jul 12 2021 @ 13:36PM

YS Jagan పంతాలు, పట్టింపులు ఎలా ఉంటాయో ఈ ఒక్క సంఘటనే సాక్ష్యం!

  • సంప్రదాయాలకు తిలోదకాలు!
  • వైఎస్‌ జయంతి రోజు బయటపడ్డ కుటుంబ విభేదాలు!
  • రాజకీయ విభేదాలతో వేర్వేరు షెడ్యూల్‌లో నివాళి! 
  • ఉదయం నివాళి అర్పించి హైదరాబాద్ వచ్చిన షర్మిల
  • కన్నబిడ్డలు తండ్రికి నివాళి అర్పించిన తీరుకు తల్లి సాక్ష్యం!
  • షెడ్యూల్‌ మార్చుకోవాలని చెల్లిని కోరిన అన్న!
  • సంప్రాదాయాలకు భిన్నంగా నివాళి అర్పించిన సీఎం
  • ఒకరు మొండి.. మరొకరు జగమెండి అనే చర్చ
  • జగన్‌ పంతాలకు, పట్టింపులకు పోయారని గుసగుసలు!
  • జగన్‌ తీరునచ్చని జనం!

వైఎస్ జగన్‌ పంతాలు పట్టింపులు ఎలా ఉంటాయో.. ఆ సంఘటనే సాక్ష్యమా? తండ్రి జయంతి రోజున తోడబుట్టిన చెల్లెమ్మ ఎదురుకనబడుతుందని శ్రద్దాంజలి సంప్రదాయాలకే తిలోదకాలిచ్చారా? రాష్ట్రపెద్దన్న పాత్ర పోశిస్తున్న జగనన్న.. జన్మనిచ్చిన తండ్రికి నివాళి అర్పించేందుకు రక్తం పంచుకుపుట్టిన చెల్లెమ్మ షర్మిలతో ఎందుకు అడుగులో అడుగువేయలేకపోయారు.. అనేదానిపై పూర్తి వివరాలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాంం

టాక్ ఇదీ..

వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటారు. ఇడుపులపాయలో కుటుంబం  మొత్తం కలిసివచ్చి సంప్రదాయపద్దతిలో నివాళి అర్పిస్తారు. అయితే ఇది ఇక గతం అనే కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చింది ఈసారి జయంతి వేడుకల్లో. కుటుంబ విభేదాలు పెద్దాయన జయంతి రోజు కూడా మరిచిపోలేనంతగా పెరిగిపోయాయా అనే చర్చ కడప జిల్లాలోనే కాదు రెండు తెలుగురాష్ట్రాల్లో, ఆ మాటకొస్తే వైఎస్‌ అభిమానులు ఉన్న ప్రతీచోట మొదలైంది. సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి తండ్రికి నివాళి ఇచ్చే టైమ్‌ మార్చుకున్న జగన్‌ తీరుపై ఆయన ఇలాఖాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉదయం పూట చేయాల్సిన సంప్రదాయకార్యక్రమాలు పట్టుదలకు పోయి సాయంత్రానికి మార్చుకోవడం ఆయనకు నచ్చిందేమో కాని జిల్లా ప్రజలకు నచ్చలేదనే టాక్‌ వస్తోంది.

ఒకరు మొండి అంటే మరొకరు జగమొండి!

అన్నాచెల్లెల్లు ఇద్దరు జన్మనిచ్చిన తండ్రికి నివాళి అర్పించేందుకు కలిసిరాలేకపోయారు. కన్నబిడ్డలిద్దరూ విడివిడిగా తండ్రి జయంతి కార్యక్రమాలను చేయడాన్ని ప్రత్యక్షంగా చూసిన తల్లి విజయమ్మ మౌన ప్రేక్షకురాలిగా మిగిలిపోవాల్సివచ్చిందనే అభిప్రాయం వైఎస్‌ అభిమానుల్లో కలుగుతోంది. వైఎస్‌ కడుపున పుట్టిన బిడ్డల ప్రవర్తన ఆయన జయంతిరోజు ప్రత్యక్షంగా టీవీల్లో, ఇతర మాధ్యమాల ద్వారా చూసిన జనం.. ఒకరు మొండి అంటే మరొకరు జగమొండి అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోందట.

వైఎస్ షర్మిలకు జగన్ ఫోన్ చేసి..!

రాజకీయంగా విభేదాలు పొడసూపడటంతో ఒకరినొకరిని కలుసుకోలేనంతగా పౌరుషాలు ప్రదర్శించుకున్న అన్న జగన్‌.. చెల్లెలు షర్మిల వేర్వేరు షెడ్యూల్స్‌ ఫిక్స్‌ చేసుకోవాల్సివచ్చిందట. చెల్లెమ్మ షర్మిల తల్లి విజయమ్మ బెంగళూరు నుంచి ఇడుపులపాయకు జయంతి ముందు రోజు అంటే ఏడోతేదీనే చేరుకున్నారు. 8వ తేదీ ఉదయం జయంతి కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్‌ వచ్చేశారు. ఆ తర్వాత తెలంగాణలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జయంతి వేడుకలకు మూడు రోజులముందు అన్నయ్య జగన్‌ చెల్లెలు షర్మిలకు ఫోన్‌ చేశారట. ఉదయం జయంతి కార్యక్రమాల తన షెడ్యూల్‌ మార్చుకోవాలని సూచించారట. అయితే హైదరాబాద్‌లో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని తన షెడ్యూల్‌ మార్చుకోవడం కుదరదని చెప్పిందట. చెల్లెలు షెడ్యూల్‌ మార్చుకోకపోవడంతో సంప్రదాయాలకు భిన్నంగా సాయంత్రం పూట తండ్రికి నివాళి అర్పించారట జగన్‌..కనిపెంచిన తండ్రికి సాయంత్రం పూట నివాళి అర్పించిన ఘటనలు చరిత్రలో లేవనే మాటలు జగన్‌ను ఉద్దేశించివస్తున్నాయట.

పెద్ద మనసు చేసుకోలేకపోయారేం!

తండ్రి జయంతి రోజే.. షర్మిల పార్టీ ఏర్పాటుకు సంబంధించి విషయం ఎప్పటినుంచో అందరికీ తెలిసిందే. మనసులో విభేదాలు ఉన్నా ఉదయం ఇద్దరం కలసి నివాళి అర్పిద్దామని ఆ తరువాత ఎవ్వరుకి వారుగా వెళ్ళవచ్చు అని ఎందుకు పెద్దవాడిగా జగన్‌ పెద్ద మనసు చేసుకోలేకపోయారనే ప్రశ్నలు ఏ ఇద్దరు కలిసినా చర్చించుకుంటున్నారట. రక్తసంబంధం, ఆచారాలు, సాంప్రదాయాల కన్నా పంతాలు, పట్టింపులే ముఖ్యమని జగన్ నిరూపించుకున్నాడని కడప జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారట. పంతాలకు పోయిన జగన్‌.. తండ్రికి నివాళి అర్పించే సమయాన్ని మార్చుకుని సాయంత్రం పూట కార్యక్రమాలు చేయడమేంటనే చర్చ సాగుతోంది. తండ్రివైఎస్సార్‌కి  నివాళి అర్పించేందుకు ఒకరికొకరు తోడుగా రాలేదు. ఇన్నాళ్లు కలిసినడిచిన అడుగులు ఇప్పుడు దూరం అయ్యాయంటే కారణమెవరు? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.