నెలలో పదిరెట్లు!

ABN , First Publish Date - 2020-08-02T08:49:16+05:30 IST

పల్లె, పట్నం తేడా లేదు. ఊరు, వాడా వ్య త్యాసం లేదు. కరోనా రాష్ట్రం మొత్తం అల్లుకుపోతోంది

నెలలో పదిరెట్లు!

  • ఉధృతంగా కరోనా కేసులు
  • ఏడున్నర రెట్లు పెరిగిన మరణాలు 
  • కొవిడ్‌ హాట్‌స్పాట్‌గా మారిన ఏపీ 
  • ఇతర రాష్ట్రాల్లో కొన్నిచోట్లే ప్రభావం
  • రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ తీవ్రత 

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : పల్లె, పట్నం తేడా లేదు. ఊరు, వాడా వ్య త్యాసం లేదు. కరోనా రాష్ట్రం మొత్తం అల్లుకుపోతోంది. వైరస్‌ వ్యాప్తికి హాట్‌స్పాట్‌గా మారిం ది. విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖ, కర్నూలు, అనంతపురం, కడప, తిరుపతి.. ఇలా అనేక ప్రధాన నగరాలు, పట్టణాలు కొవిడ్‌ గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. జూలై 1న రాష్ట్రంలో 15,252 కేసులు ఉంటే... 31నాటికి వాటి సంఖ్య 1,50,209కి చేరింది. అంటే నెల వ్యవధిలోనే కేసులు పదిరెట్లు పెరిగాయి. మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో నమోదయ్యాయి. జూలై 1నాటికి 193మంది వైర్‌సతో చనిపోతే ఇప్పుడు వీటి సంఖ్య 1,407కు చేరుకుంది. నెలలోనే కరోనా మరణాలు దాదాపు ఏడున్నర రెట్లు పెరిగాయి. లెక్కకు రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రెండువారాల్లో కేసులు రెట్టింపవడం అత్యంత ప్రమాదకరం. కానీ, రాష్ట్రంలో వారంలోనే కొత్తగా 68 వేల కేసులు నమోదవడంతో వైరస్‌ వ్యాప్తి ఉధృతమైందని నిరూపితమైంది. కొన్ని రాష్ట్రాల్లో లక్షలాది కేసులు నమోదైనా, వేలాది మరణాలు సంభవించినా వైరస్‌ ప్రభావం ఓ పెద్ద నగరం, లేదా నాలుగైదు పట్టణాలు, జిల్లాలకే పరిమితమైంది. కానీ ఏపీలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రాష్ట్రం లో ప్రతీ జిల్లా, మండలం, గ్రామంలోనూ కొవి డ్‌ బాధితులున్నారు. 


తీవ్ర ప్రభావిత రాష్ట్రాల్లో ఇలా...

కరోనా తీవ్రత మహారాష్ట్రలో అత్యధికంగా ఉండగా తర్వాత స్థానాల్లో ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వైరస్‌ ప్రభావంలేని గ్రామాలు వేలసంఖ్యలో ఉన్నా యి. 4,22,118 కేసులున్న మహారాష్ట్రలో ఒక్క ముంబైలోనే 1,14,284 కేసులు వెలుగు చూశా యి. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 1,50,662 కాగా, ముంబైలో 20,563 నమోదయ్యాయి. థానే, పుణె జిల్లాల్లో 82వేల యాక్టివ్‌ కేసులు ఉం డగా, రాయగఢ్‌, పాల్‌ఘర్‌, నాసిక్‌, జల్గావ్‌ జిల్లాల్లో 16-14వేల కేసులున్నాయి. మరో 13జిల్లాల్లో 5వేల నుంచి 1,200వరకూ కేసులున్నాయి. ఇక తమిళనాడులో 2,45,859 కేసులున్నాయి. వీటిలో ఒక్క చెన్నైలోనే లక్ష నమోదయ్యాయి. వెయ్యిలోపు కేసులున్న జిల్లాలు 11. 


ఊరువాడా పాకేసింది

ఏపీలో అతి తక్కువగా అంటే 4,323 కేసులున్న జిల్లా విజయనగరం. మిగిలిన అన్ని జిల్లాలు 5వేలకు పైగా కేసులున్నాయి. 10వేలపైనే కేసులున్న జిల్లాలు ఏడున్నాయి. ఇందులో నాలుగు జిల్లాల్లో 15వేలకు పైనే ఉన్నాయి. తూర్పుగోదావరిలో కరోనా ప్రభావం చాలా ఆలస్యంగా మొద లైనా ఇప్పుడు అక్కడ కేసుల సంఖ్య 21వేలు దాటింది. 


రికవరీలో కింద నుంచి మూడోస్థానం

కరోనా కేసుల్లో రికవరీ రేటు రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంది. పాజిటివ్‌ కేసుల్లో మూడో స్థానంలో ఉన్న ఏపీ రికవరీ రేటు లో మాత్రం కింద నుంచి మూడో స్థానం లో ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో 51% మంది మాత్రమే కోలుకున్నారు. జాతీయ స్థాయిలో 38.39శాతం రికవరీ రేటుతో జార్ఖండ్‌ చివర స్థానంలో ఉంది. 40.11శాతంతో కర్ణాటక తర్వాత స్థానంలో ఉండగా, 51శాతంతో ఏపీ కింద నుంచి మూడోస్థానంలో నిలిచింది. కేసుల్లో జాతీయ స్థాయిలో తొలిస్థానంలో ఉన్న మహారాష్ట్రలో రివకరీ రేటు 60.68%, తమిళనాడులో 74.82%, ఢిల్లీలో 89.18%గా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,50,209 కేసులు నమోదు కాగా 76,614మంది కోలుకున్నారు. మరో 72188 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకా 49శాతం మంది ఆస్పత్రుల్లోనే ఉన్నారు. 

Updated Date - 2020-08-02T08:49:16+05:30 IST