అప్పుల రాష్ట్రం ఆకలి రాజ్యం!

ABN , First Publish Date - 2021-09-15T08:02:19+05:30 IST

ఇది తీరని ‘ధన’ దాహం! రేపటి కోసం దాచుకున్న, భవిష్యత్తులో వాడుకోవాల్సిన తిండినీ ఇప్పుడే తినేంత ఆకలి! ఈ రోజు గడిస్తే చాలు, రేపు ఏమైపోయినా ఫర్వాలేదు అనుకునే దారుణ కలి!

అప్పుల రాష్ట్రం ఆకలి రాజ్యం!

భవిష్యత్తు సొమ్ములూ ముందుగానే మింగుడు

ఐదేళ్ల రెవెన్యూ లోటు గ్రాంటు మూడేళ్లకే సరి

ఢిల్లీలో లాబీయింగ్‌తో ముందస్తు ‘సర్దుబాటు’

15వ ఆర్థిక సంఘం సిఫారసులతోనే ఆటలు

ఐదేళ్లలో అందాల్సిన సాయం 30,497 కోట్లు

దీనిని మూడేళ్లలోనే పుచ్చుకుంటున్న సర్కారు

ఎన్నికల ఏడాదిలోపే మొత్తం గ్రాంటు స్వాహా

ఆ తర్వాత రెండేళ్లు పైసా సహాయం దక్కదు

ఎవరు అధికారంలోకి వచ్చినా ఆర్థికంగా కటకటే

ఇప్పటికే కొత్త అప్పులు పుట్టని పరిస్థితి

రెవెన్యూ లోటు గ్రాంటూ రాకుంటే ఇక్కట్లు

మరో 2,655 కోట్ల అప్పు

బహిరంగ మార్కెట్‌ నుంచి రుణ

సేకరణకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఇది తీరని ‘ధన’ దాహం! రేపటి కోసం దాచుకున్న, భవిష్యత్తులో వాడుకోవాల్సిన తిండినీ ఇప్పుడే తినేంత ఆకలి! ఈ రోజు గడిస్తే చాలు, రేపు ఏమైపోయినా ఫర్వాలేదు అనుకునే దారుణ కలి! ఎడాపెడా అప్పులు చేస్తూ, అదే స్థాయిలో పన్నులు వేస్తూ రాష్ట్ర ఆర్థికాన్ని అతలాకుతలం చేస్తున్న వైసీపీ సర్కారు... డబ్బుల కోసం కనీవినీ ఎరుగని, ఏ రాష్ట్రానికీ రాని ఆలోచనలతో కాసుల వేట సాగిస్తోంది. ఇందులో భాగంగా.... కేంద్రం నుంచి ఐదేళ్ల పాటు ప్రతి ఏటా కొంతచొప్పున అందాల్సిన రెవెన్యూ లోటు గ్రాంటును ‘మూడేళ్ల’కే ఖాళీ చేసేస్తోంది. ఆ తర్వాత వచ్చేది ఎన్నికల సంవత్సరం! ఈలోపు పబ్బం గడుపుకోవడమే ముఖ్యం!


ఆర్థిక సంఘాలు రాష్ట్రానికి వివిధ గ్రాంట్లను కేటాయిస్తుంది. ఇది అచ్చంగా కేంద్రం నుంచి అందే సహాయం. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అప్పుల కుప్పల్లో కొత్త పుంతలు తొక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వం... ‘తిరిగి చెల్లించక్కర్లేని’ గ్రాంట్లనూ పిండుకోవడంపై కన్నేసింది. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నడుస్తోంది. 2020-21 నుంచి ఆరేళ్లపాటు ఈ సంఘం సిఫారసులు అమలులో ఉంటాయి. దీని ప్రతిపాదనల మేరకు కేంద్రం 2020-21లో రూ.5,897 కోట్ల రెవెన్యూ లోటును గ్రాంటు ద్వారా భర్తీ చేసింది. ఆ తర్వాత ఐదేళ్లు... అంటే 2021-22 నుంచి 2025-26 కాలానికిగాను ఆర్థిక సంఘం ఏపీకి రూ.30,497 కోట్లను రెవెన్యూ లోటు భర్తీ కోసం కేటాయించింది. వైసీపీ ప్రభుత్వం కూడా ఐదేళ్లకు రెవెన్యూ లోటు ఉంటుందని సవరించిన ప్రతిపాదనలను 15వ ఆర్థిక సంఘానికి ఇచ్చింది. ఈ మొత్తాన్ని ప్రతి ఏటా విడతల వారీగా కేంద్రం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాల విషయంలో ఇలాగే జరుగుతోంది. కానీ... మొట్టమొదటిసారిగా, ఏపీ విషయంలో మాత్రమే ఒక చిత్రం జరిగింది. అదేమిటంటే... ఐదేళ్లలో రావాల్సిన గ్రాంటు రూ.30,497 కోట్లను మూడేళ్లలోనే ఇచ్చేలా ఆర్థిక సంఘం ‘సర్దుబాటు’ చేసేసింది. అసలు విషయం ఆరా తీస్తే.... ‘‘ఇది ఎలాగూ మాకు ఇచ్చేదే కదా! ఐదేళ్లపాటు ఆగలేం. మూడేళ్లలోనే మొత్తం సర్దుబాటు చేసేయండి’’ అని జగన్‌ ప్రభుత్వం ఢిల్లీలో భారీ స్థాయిలో లాబీయింగ్‌ చేసుకుని... అనుకున్నది సాధించినట్లు తెలిసింది. అంటే... 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రెవెన్యూ లోటు గ్రాంటును కూడా జగన్‌ ప్రభుత్వం ముందే వాడేసుకుంటోంది!


ఎన్నికలకు ముందే ఖాళీ...:

2024లో ఎన్నికలు జరుగుతాయి. అంటే... 2023-24 ఎన్నికల సంవత్సరం! అంటే... ఎన్నికలు వచ్చేలోగానే మొత్తం రెవెన్యూ లోటు గ్రాంటును ఖాళీ చేసేస్తారన్న మాట! మరి... ఆ తర్వాత రెండేళ్ల పరిస్థితి ఏమిటి? ఎన్నికల తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా ఇది ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితికే దారి తీస్తుంది. ఇప్పటికే కొత్త అప్పులు దొరకడం కనాకష్టంగా మారింది. అలాంటిది... భవిష్యత్‌ గ్రాంట్లనూ ముందే వాడుకుంటే ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఐదేళ్లకు రావాల్సిన రూ.30,497 రెవెన్యూ లోటు గ్రాంటును మూడేళ్లకే సర్దేసి... 2021-22లో రూ.17,257 కోట్లు, 2022-23లో రూ.10,549 కోట్లు, 2023-24లో రూ.2691 కోట్లు తీసుకుంటున్నారు. దీని ప్రకారమే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ.1480 కోట్ల వరకు రెవెన్యూ లోటు గ్రాంటు వస్తుంది. ప్రతి నెలా అంత గ్రాంటు వస్తున్నా... నెలకు రూ.5000 కోట్ల నుంచి రూ.6000 కోట్లు అప్పు చేయక తప్పని పరిస్థితి. అలాంటిది 2024-25, 2025-26 సంవత్సరాల్లో అసలు రెవెన్యూలోటు గ్రాంటే రాదు. ఇప్పుడే రాష్ట్రానికి అప్పులు దొరకడం గగనమైంది. కేంద్రం దయతలిస్తే తప్ప రూపాయి అప్పు పుట్టడంలేదు. కార్పొరేషన్ల పేరిట దొంగదారుల్లో గరిష్ఠ స్థాయిలో అప్పులు తెచ్చారు. ఈ తప్పులు బయటపడిన నేపథ్యంలో... ఇక కార్పొరేషన్‌ కాసులకూ తలుపులు మూసుకుపోయాయి. మరి... అప్పులూ పుట్టక, గ్రాంట్లూ అందకపోతే 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రం పరిస్థితి ఏమిటి?


16వ ఆర్థిక సంఘాన్ని అడగగలరా?

ఐదేళ్ల రెవెన్యూలోటును మూడేళ్లకే సర్దుబాటు చేస్తున్నందున మిగిలిన రెండేళ్లు రాష్ట్రానికి ‘లోటు’ ఉండదు. ఆదాయం మిగులులో ఉంటుందని అర్థం. కాబట్టి 2026-27 నుంచి ప్రారంభమయ్యే 16వ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటు గ్రాంటు కేటాయింపులో ఏపీని పరిగణనలోకి తీసుకోదు. 


లోటు గ్రాంటు ఎందుకంటే ?

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్రాల రెవెన్యూ లోటు జీరో ఉండాలి. కానీ, ఆదాయానికి మించిన అతి ఖర్చుల వల్ల అది సాధ్యపడట్లేదు. అతి తక్కువ రాష్ట్రాలు మాత్రమే ‘లోటు’లో కాకుండా మిగులులో ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రెవెన్యూ లోటును కేంద్రం అన్ని రాష్ట్రాలకు నెలనెలా గ్రాంటు ఇస్తుంది. దీన్ని ఆర్థిక సంఘాలు ఖరారు చేస్తాయి. అలా కేంద్రం వేల కోట్ల నిధులు గ్రాంటు రూపంలో ఇస్తున్నప్పటికీ ఏపీకి 2021-22లో రెవెన్యూ లోటు రూ.55,000 కోట్ల పైచిలుకే ఉంది. దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ ఇచ్చే గ్రాంటును కేంద్రం ఏపీకి మళ్లిస్తే గాని ఆ లోటు తీరదు. 


ఆ 3వేల కోట్లు తెచ్చుకోలేక...

2014-15లో రాష్ట్ర విభజన సందర్బంగా వచ్చిన రెవెన్యూ లోటు రూ.16,000 కోట్లను భర్తీ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక ప్రతిపాదన పంపింది. అందులో రూ.7,000 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు ఒప్పుకొంది. రూ.4,000 కోట్లను టీడీపీ హయాంలోనే ఇచ్చారు. ఇంకా రూ.3,000 కోట్లు రావాల్సి ఉంది. ఈ లోపు రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ కనీసం రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3వేల కోట్లను కూడా కేంద్రాన్ని అడగలేక పోతోంది. 


ఇంకో వెయ్యికోట్ల అప్పు

రాష్ట్ర సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.1000 కోట్ల అప్పు చేసింది. దీనిపై వడ్డీ 6.98 శాతం. 15 ఏళ్లలోపు ఈ అప్పు కట్టేయాలి. వెరసి... వారంరోజుల్లోనే ప్రభుత్వం రూ.3,000 కోట్ల అప్పు చేసింది. ఈ నెల ఏడో తేదీన రూ.2,000 కోట్ల అప్పు చేసింది. దీనిపై వడ్డీ 7 శాతం  అమలైంది. 14వ తేదీ వచ్చే నాటికి మరో రూ.1000 కోట్ల అప్పు జతైంది.

Updated Date - 2021-09-15T08:02:19+05:30 IST